కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్పగింపబడి బంధింపబడుట

అప్పగింపబడి బంధింపబడుట

అధ్యాయము 118

అప్పగింపబడి బంధింపబడుట

యూదా పెద్ద సైన్యమును, ప్రధానయాజకులను, పరిసయ్యులను వెంట తీసికొని వచ్చునప్పటికి అర్థరాత్రి దాటి చాలా సమయము గడచిపోయినది. యేసును అప్పగించినందుకు యాజకులు యూదాకు 30 వెండి నాణెములను ఇచ్చుటకు అంగీకరించారు.

అంతకుముందు పస్కా భోజనమునుండి యూదా బయటకు పంపబడినప్పుడు, సాక్ష్యాధారముగా అతడు నేరుగా ప్రధానయాజకుల యొద్దకు వెళ్లును. వీరు వెంటనే తమ స్వంత బంట్రౌతులును, ఆలాగే కొంతమంది సైనికులను సమావేశపరచుదురు. యూదా బహుశ వారిని మొదట యేసు ఆయన అపొస్తలులు పస్కాను ఆచరించిన స్థలముయొద్దకు నడిపియుండ వచ్చును. వారక్కడనుండి వెళ్లిపోయిరను సంగతిని తెలిసికొనిన మీదట, బహుజనులు ఆయుధములను, కాగడాలను దీపములను చేతబట్టుకొని యూదాను వెంబడించి యెరూషలేమును దాటి కిద్రోను లోయకు అడ్డముగా నడిచిరి.

యూదా ఒలీవల కొండమీదుగా ఆ గుంపును నడిపించుచుండగా, యేసును కనుగొను స్థలము తనకు నిశ్చయముగా తెలుసునని అతడు భావించును. పోయినవారం యేసు ఆయన అపొస్తలులు బేతనియ యెరూషలేముల మధ్య ప్రయాణించినప్పుడు, విశ్రాంతి తీసికొనుటకు, మాట్లాడుకొనుటకు వారు తరచు గెత్సేమను తోటలో ఆగిరి. అయితే ఇప్పుడు, యేసు చీకటిలో ఒలీవల చెట్లమాటున కనబడకుండ ఉన్నందున, సైనికులు ఆయనను ఎట్లు గుర్తుపట్టగలరు? వారాయనను ఇదివరకు ఎన్నడు చూసియుండలేదు. కావున యూదా వారికి ఒక గురుతునిచ్చుచు ఇట్లనును: “నేనవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడి.”

యూదా ఆ బహుజనములను తోటలోనికి నడిపి, యేసు తన అపొస్తలులతో ఉండుటను చూసి, నేరుగా ఆయన యొద్దకు వెళ్లును. “బోధకుడా, నీకు శుభమని” చెప్పి ఆయనను బహు ఆప్యాయముగా ముద్దుపెట్టుకొనును.

“చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని” చెప్పి, ఆ పిమ్మట అతని ప్రశ్నకు జవాబిచ్చుచు, యేసు ఇట్లనును: “యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా?” అయితే ఆయనను అప్పగించువానికి అది చాలును! కాలుచున్న కాగాడాలు, దీపముల వెలుగునకువచ్చి యేసు ఇలా అడుగును: “మీరెవని వెదకుచున్నారు?”

“నజరేయుడైన యేసును” అని జవాబువచ్చును.

అందుకు యేసు ధైర్యముగా వారందరి యెదుట నిలవబడి“ నేనే ఆయనని,” చెప్పును. ఆయన ధైర్యమునకు ఆశ్చర్యపడి, ఏమిచేయాలో అర్థంకాక ఆ మనుష్యులు వెనుకను తగ్గి నేలమీద పడుదురు.

మరలా ఆయన, “నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.” ఇంతకు ముందే మేడగదిలో యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో ఒక్క “నాశనపుత్రుడు” తప్ప మిగిలిన నమ్మకమైన అపొస్తలులను తాను భద్రపరచెనని వారిలో ఒకనినైనను తాను పొగొట్టుకొనలేదని యేసు చెప్పెను. కావున తన మాట నెరవేరునట్లు, తన అనుచరులను పోనియ్యుడని ఆయన అడుగును.

సైనికలు మరలా తమ ధైర్యమును చిక్కబట్టుకొని లేచి నిలువబడి యేసును బంధించుచుండగా, జరుగబోవు దానిని అపొస్తలులు గుర్తించుదురు. “ప్రభువా, కత్తితో నరుకుదుమా?” అని వారడుగుదురు. యేసు జవాబివ్వకముందే, పేతురు అపొస్తలుల యొద్దనున్న రెండుకత్తులలో ఒకదానినిదూసి, ప్రధానయాజకుని దాసుడైన మల్కుపై దాడిచేయును. పేతురు కొట్టినదెబ్బ దాసుని తలకు మారుగా అతని కుడిచెవికి తగిలి అది తెగి క్రిందపడును.

యేసు కలుగజేసుకొని, “ఈ మట్టుకు తాళుడని” చెప్పును. మల్కు చెవిని ముట్టి, అతని బాగుచేసిన పిమ్మట, ఆయన ఒక ప్రాముఖ్యమైన పాఠమును బోధించుచు, పేతురుకిట్లు ఆజ్ఞాపించును: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశించుతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే పంపడనియు నీవనుకొనుచున్నావా?”

యేసు బంధింపబడుటకు ఇష్టపడును, ఏలయనగా ఆయనిట్లు వివరించును: “ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరును” అని చెప్పుచు ఆయనింకా ఇట్లనును: “తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా?” తనయెడల దేవుని చిత్తముతో ఆయన సంపూర్ణ అంగీకారమును కలిగియున్నాడు.

ఆ పిమ్మట యేసు జనసమూహమును ఉద్దేశించి మాట్లాడును. “బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా?” అని అడిగి, ఆ పిమ్మట “నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను.”

అంతట యూదుల సైనికులు, సైనికాధికారి, బంట్రౌతులు యేసుపైబడి ఆయనను పట్టుకొని బంధింతురు. దీనిని చూసిన అపొస్తలులు ఆయనను విడిచి పారిపోవుదురు. అయితే ఒక పడుచువాడు—బహుశ శిష్యుడైన మార్కు—ఆ జనసమూహమందే నిలుచును. అతడు యేసు పస్కాను ఆచరించిన గృహమువద్దవుండి ఆ పిమ్మట అక్కడనుండి జనసమూహముతో కలిసి ఇక్కడకువచ్చి యుండవచ్చును. కాని, ఇప్పుడు ప్రజలు ఆయనను గుర్తించి పట్టుకొనబోగా, అతడు తన నారబట్టను విడిచి పారిపోవును. మత్తయి 26:47-56; మార్కు 14:43-52; లూకా 22:47-53; యోహాను 17:12; 18:3-12.

యేసును గెత్సేమను తోటలో కనుగొందునని యూదా నిశ్చయముగా ఎందుకు భావించును?

తన అపొస్తలుల యెడల యేసు ఎట్లు శ్రద్ధను ప్రదర్శించును?

యేసును కాపాడుటకు పేతురు ఏమిచేయును, అయితే దానినిగూర్చి యేసు పేతురుతో ఏమిచెప్పును?

తన కొరకైన దేవుని చిత్తముతోతాను సంపూర్ణ అంగీకారమును కలిగియున్నానని యేసు ఎట్లు బయల్పరచును?

అపొస్తలులు ఆయనను విడిచి పారిపోయినప్పుడు, ఎవరు అక్కడనే నిలిచియుండిరి, అతనికేమి సంభవించును?