కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అభ్యాససిద్ధమైన జ్ఞానముతో భవిష్యత్తు కొరకు సమకూర్చుకొనుట

అభ్యాససిద్ధమైన జ్ఞానముతో భవిష్యత్తు కొరకు సమకూర్చుకొనుట

అధ్యాయము 87

అభ్యాససిద్ధమైన జ్ఞానముతో భవిష్యత్తు కొరకు సమకూర్చుకొనుట

యేసు ఇంతకుముందే తన శిష్యులు, మోసగాండ్రయిన సుంకరులు, పేరుమోసిన ఇతర పాపులు, శాస్త్రులు, పరిసయ్యులు మొదలగు వారు చేరియున్న జనసమూహమునకు తప్పిపోయిన కుమారుని కథ చెప్పి ముగించును. ఇప్పుడు ఆయన తన శిష్యులనుద్దేశించి మాట్లాడుచు, తన గృహపరిపాలకుడు లేక గృహనిర్వాహకునిగూర్చి ప్రతికూల నివేదికను వినిన ఒక ధనవంతునిగూర్చి ఒక ఉపమానము చెప్పును.

యేసు చెప్పిన ప్రకారము, ఆ ధనవంతుడు తన గృహనిర్వాహకుని పిలిచి అతనిని పనిలోనుండి తీసివేయబోవునట్లు అతనితో చెప్పును. “నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమిచేతును?” అని ఆ గృహనిర్వాహకుడు ఆలోచించును. “త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమిచేయవలెనో నాకు తెలియుననుకొనెను.”

ఆ గృహనిర్వాకుని పథకము ఏమి? అతడు తన యజమానికి రుణపడియున్న వారిని పిలిపించి, “నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావు?” అని అడుగును.

మొదటివాడు, ‘నూరు మణుగుల ఒలీవ నూనే’ అని జవాబిచ్చును.

‘నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని’ వానితో చెప్పును.

అతను మరియొకని, ‘నీవు ఎంత అచ్చియున్నావు?’ అని అడుగును.

వాడు, ‘నూరు తూముల గోధుమలని’ చెప్పును.

‘నీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొనుము’ అని చెప్పును.

గృహనిర్వాహకుడు ఇంకను తన యజమాని ఆర్ధిక వ్యవహారములయందు బాధ్యతగలిగి ఉండెను గనుక, తన యజమానికి రుణపడియున్న రశీదుల మొత్తమును తగ్గించుటలో అతడు తన అధికార పరిధిలోనే పనిచేయును. ఆ విధముగా రుణములను తగ్గించుటద్వారా తను ఉద్యోగము కోల్పోయినప్పుడు తనను ఆదరించగల స్నేహితులను అతడు తయారుచేసికొనుచున్నాడు.

జరిగిన దానిని యజమానుడు వినునప్పుడు, అతడు ముగ్ధుడగును. వాస్తవానికి, అతడు “అన్యాయస్థుడైనను, ఆ గృహనిర్వాహకుడు అభ్యాససిద్ధమైన జ్ఞానముతో నడుచుకొనెనని అతని మెచ్చుకొనెను.” (NW) అవును, యేసు ఇంకను ఇట్లనును: “వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా (అభ్యాసపరముగా) యుక్తిపరులై యున్నారు.”—NW.

ఇప్పుడు, దానిద్వారా ఆయన తన శిష్యులకు ఒక పాఠమునేర్పుచూ. యేసు వారినిట్లు ప్రోత్సహించును: “అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు.”

యేసు, గృహనిర్వాహకుని అతని దుర్నీతినిబట్టి కాదుగాని, అతని దూరదృష్టితో కూడిన అభ్యాససిద్ధమైన జ్ఞానమును మెచ్చుకొనుచున్నాడు. తరచు “ఈ లోక సంబంధులు” తమకు మేలుచేయగల స్నేహితులను సంపాదించుకొనుటకు, తమ ధనమును లేక స్థానమును తెలివిగా ఉపయోగింతురు. కావున దేవుని సేవకులగు “వెలుగు సంబంధులు” కూడా, తమ వస్తుదాయక సంపత్తిని, వారి “అన్యాయపు సిరిని” తమకు ప్రయోజనకరమగు రీతిలో జ్ఞానయుక్తముగా ఉపయోగించవలెను.

అయితే యేసు, “నిత్యమైన నివాసములలో” చేర్చుకొనగల వారిని స్నేహితులుగా చేసికొనుటకు వారు తమ సిరిని ఉపయోగించవలెనని చెప్పును. చిన్నమంద సభ్యులకు ఈ స్థలములు పరలోకమందును; “వేరే గొర్రెలకు” భూపరదైసునందు ఉన్నవి. కేవలము యెహోవా దేవుడు ఆయన కుమారుడు మాత్రమే మనుష్యులను ఈ స్థలములలోనికి చేర్చుకొనగలరు గనుక, రాజ్యాసక్తులను బలపరచుటకు మనకుగల ఎటువంటి “అన్యాయపు సిరి” నైనను ఉపయోగించుటద్వారా వారితో స్నేహమును పెంపొందించుకొనుటకు మనము పట్టుదలతో పనిచేయవలెను. అప్పుడు, వస్తుదాయక ఐశ్వర్యము పాడైపోయినప్పుడు లేక విలువ కోల్పోయినప్పుడు— అవి నిశ్చయముగా పాడగును—మన నిత్య భవిష్యత్తు నిశ్చయమైయుండును.

వస్తుసంబంధమైన ఈ చిన్నవిషయములలో, లేక మిక్కిలి కొంచెములో సహితము నమ్మకముగా ఉండు వ్యక్తులు, మరి ఎక్కువ ప్రాముఖ్యతగల విషయములలో కూడ నమ్మకముగా ఉందురని యేసు తెలియజేయును. ఆయన ఇంకను ఇట్లనును: “కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును [అనగా ఆత్మీయమైన, లేక రాజ్యముయొక్క ఆసక్తులు] ఎవరు మీ వశము చేయును? మీరు పరులసొమ్ము [దేవుడు తన సేవకులకు అప్పగించిన రాజ్యాసక్తులు] విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది [నిత్యమైన నివాసములలో జీవమను బహుమతి] మీకు ఎవడిచ్చును?”

యేసు తేల్చిచెప్పినట్లుగా మనము అన్యాయపు సిరికి, వస్తుదాయక సంపత్తికి దాసులమైయుండి, అదే సమయములో దేవునికి నిజమైన సేవకులుగా ఉండలేము. “ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరు.” లూకా 15:1, 2; 16:1-13; యోహాను 10:16.

యేసు ఉపమానములోని గృహనిర్వాహకుడు తనకు తర్వాత సహాయము చేయగలవారిని ఎట్లు స్నేహితులుగా చేసికొనును?

“అన్యాయపు సిరి” ఏమైయున్నది, మరియు దానిద్వారా మనమెట్లు స్నేహితులను తయారుచేసికొనగలము?

మనలను ఎవరు “నిత్యమైన నివాసములలోనికి” చేర్చుకొనగలరు, మరియు ఇవి ఏ స్థలములైయున్నవి?