కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె అతని వస్త్రము ముట్టినది

ఆమె అతని వస్త్రము ముట్టినది

అధ్యాయము 46

ఆమె అతని వస్త్రము ముట్టినది

దెకపొలినుండి యేసుతిరిగి వచ్చుచున్నాడను వార్త కపెర్నహూమునకు చేరినది. కాగా ఒక గొప్ప జనసమూహము ఆయనను తిరిగి ఆహ్వానించుటకు సముద్రతీరమునకు చేరుకొనును. ఆయన తుపానును నిమ్మళపరచుటను, దయ్యములు పట్టిన వారిని బాగుచేయుటను వారు నిస్సందేహముగా వినిరి. ఇప్పుడు ఆయన తీరమున కాలుమోపినపుడు ఆసక్తితో ఆయనను చూడవలెననే కోరికతో వారాయనచుట్టు మూగుదురు.

యేసును చూడవలెననే కాంక్షగలవారిలో సమాజమందిరపు అధికారియైన యాయీరు ఒకడు. అతను యేసుపాదములపై బడి పదేపదే అడుగుచు, “నా చిన్నకుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవువచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనెను.” ఆమె అతనికి ఏకైక కుమార్తెయేగాక, ఆమె కేవలము 12 సంవత్సరముల వయస్సుగల బాలిక, కావున ఆమె యాయీరుకు ప్రత్యేకముగా ఎంతో విలువైన వ్యక్తి.

యేసు దీనికి ప్రతిస్పందించి, గొప్ప జనసమూహము వెంటరాగా యాయీరు ఇంటికి వెళ్లసాగును. మరొక సూచక క్రియ జరుగునని ఎదురుచూచుచున్న ఆ ప్రజలెంత ఉత్సాహభరితులైరో మనము ఊహించవచ్చును. అయితే ఆ గుంపులోనున్న ఒక స్త్రీ తనకున్న తీవ్రమైన సమస్యమీదనే తన అవధానమును నిలిపుతుంది.

గత 12 సంవత్సరములుగా ఈ స్త్రీ రక్తస్రావరోగముతో బాధపడుచుండును. ఆమె ఒక వైద్యుని తరువాత మరొక వైద్యుని వద్దకు వెళ్లుచు తన ధనమంతయు చికిత్సకొరకు ఖర్చుచేయును. అయితే ఆమెకెట్టి స్వస్థతకలుగలేదు గాని ఆమె సమస్య మరింత తీవ్రంగా తయారయింది.

ఆమెకున్న రోగము ఆమెను బహు బలహీనపరచుటయే గాక, ఆమెను అవమానపరచునదిగాను, ఇబ్బంది పెట్టునదిగాను ఉన్నదనుటను బహుశ మీరు ఒప్పుకొందురు. సహజముగా అటువంటి రోగమునుగూర్చి ఎవరును బహిరంగముగా చెప్పుకోరు. అంతేకాకుండా మోషే చట్టప్రకారము రక్తస్రావముగల స్త్రీ అపవిత్రురాలు మరియు ఆమెనుగాని ఆమె వస్త్రమునుగాని ముట్టినవ్యక్తి తన్నుతాను కడుగుకొనవలెను మరియు సాయంత్రమువరకు అపవిత్రుడైయుండాలి.

ఈ స్త్రీ యేసుచేసిన అద్భుతములను గూర్చి విని, ఇప్పుడు ఆయనద్వారా స్వస్థత పొందగోరుచున్నది. తనకున్న అపవిత్రతనుబట్టి ఆమె సాధ్యమైనంతవరకు గుర్తింపబడకుండా ఆ జనసమూహము మధ్యదూరి తనలోతాను, “నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొనెను.” అట్లు ముట్టినప్పుడు వెంటనే తన రక్తస్రావము ఆగిపోయెనని ఆమె తెలిసికొనును!

“నన్ను ముట్టినదెవరు?” అని అన్న యేసు మాటలు ఆమెను ఎంతగా దిగ్భ్రాంతి పరచెనో! ఆయన ఎట్లు తెలిసికొనగల్గెను? అందుకు పేతురు “బోధకుడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచుండగా ‘నన్ను ముట్టినదెవరని’ ప్రశ్నించుచున్నావా?” అనును.

ఆ స్త్రీ కొరకు తనచుట్టూ కలియజూసి యేసు, “ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలిపోయెను” అని అనును. నిజమే! అది సామాన్యంగా ముట్టటంకాదు ఏలయనగా యేసునుంచి బయలువెడలిన శక్తిఫలితముగా ఆమె బాగుపడును.

ఇక తాను తప్పించుకోలేనని గ్రహించిన ఆ స్త్రీ వణకుచూ, భయపడుతూ ముందుకువచ్చి యేసు ఎదుట సాగిలపడును. ఆ ప్రజలందరిముందు ఆమె తన వ్యాధిని గూర్చిన వాస్తవమంతయు తెలియజేసి ఇప్పుడు తానెట్లు స్వస్థపడెనో వివరించును.

ఆమె చెప్పినదంతయు విని జాలితో కదిలించబడి యేసు ఆమెను ఓదార్చుచు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానివై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక” అని ఆమెతో చెప్పును. అట్టి కనికరము, ప్రేమగల వ్యక్తిని, తన ప్రజలయెడల శ్రద్ధ కనపరచినవారికి సహాయముచేయగల శక్తిగలిగిన వ్యక్తిని దేవుడు ఈ భూమిని పరిపాలించుటకు ఎన్నుకొన్నాడని తెలిసికొనుట మనకెంత సంతోషముకలిగించును! మత్తయి 9:18-22; మార్కు 5:21-34; లూకా 8:40-48; లేవీయకాండము 15:25-27.

▪ యాయీరు ఎవరు, అతనెందుకు యేసునొద్దకు వచ్చును?

▪ ఒక స్త్రీ ఏ సమస్యను కలిగియుండెను, మరియు సహాయము కొరకు యేసునొద్దకు వచ్చుటకు ఆమె కెందుకంత కష్టమగును?

▪ ఆ స్త్రీ ఎట్లు స్వస్థపరచబడినది, మరియు యేసు ఆమెనెట్లు ఓదార్చును?