కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయనను నిందించువారికి ప్రత్యుత్తరమిచ్చుట

ఆయనను నిందించువారికి ప్రత్యుత్తరమిచ్చుట

అధ్యాయము 30

ఆయనను నిందించువారికి ప్రత్యుత్తరమిచ్చుట

విశ్రాంతిదినమును ఉల్లంఘించుచున్నాడని యూదా మత నాయకులు యేసును నిందించినప్పుడు, ఆయన వారికిట్లు జవాబిచ్చును: “నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.”

పరిసయ్యులు అట్లు చెప్పినను, యేసు చేసినపని విశ్రాంతిదినమును ఉల్లంఘించునటువంటిది కాదు. ఆయన ప్రకటించు మరియు స్వస్థపరచు పని దేవునిచే నియమింపబడినది, పైగా అది దేవుని మాదిరిని అనుకరించుటయైయున్నది, ఆయన ప్రతిదినము ఎడతెగక పనిచేయుచున్నాడు. అయితే ఆయన జవాబు వారికి క్రితమున్నదానికంటే ఎక్కువ కోపము రప్పించినది, కాగా వారు ఆయనను చంపవలెనని ప్రయత్నించిరి. ఎందుకు?

ఎందుకనగా వారు, యేసు విశ్రాంతిదినమును ఉల్లంఘించాడని నమ్ముటయే కాకుండ, దేవుని స్వంత కుమారుడనని ఆయన చెప్పుటను వారు దైవదూషణగా భావించుచున్నారు. అయితే యేసు వారికి భయపడక, దేవునితో తనకున్న దగ్గర సంబంధమునుగూర్చి ఇంకను వారికి తెలియజేయును. ఆయన వారితో ఇట్లనును: “తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు.”

ఇంకను యేసు, “తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో, ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.” నిజానికి, కుమారుడు అప్పటికే మృతులను ఆత్మీయరీతిలో లేపుచున్నాడు. యేసు వారితో ఇట్లనును: “నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు . . . మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు.” అవును, ఆయనింకను ఇట్లనును: “మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది; దానిని వినువారు జీవింతురు.”

యేసు అప్పటికి అక్షరార్థముగా మృతుల నెవరినైనా లేపినట్టు ఎటువంటి వ్రాతచరిత్ర లేకపోయినను, అటువంటి అక్షరార్థ పునరుత్థానము జరుగునని ఆయన తనను నిందించువారితో చెప్పుచున్నాడు. “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”

అప్పటివరకు, యేసు బహిరంగముగా ఎన్నడును దేవుని సంకల్పములో తన పాత్రయేమిటో ఇంత స్పష్టముగా, ఖచ్ఛితముగా వివరించియుండలేదు. అయితే ఈ సంగతుల విషయములో ఆయనను నిందించు వారికి యేసు స్వంత సాక్ష్యముకంటే ఎక్కువనే కలిగియున్నారు. “మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను,” అని యేసు వారికి గుర్తుచేయును.

కేవలము రెండు సంవత్సరముల క్రితము, బాప్తిస్మమిచ్చు యోహాను తన వెనుకవచ్చుచున్న వానినిగూర్చి ఈ యూదా మత నాయకులతో చెప్పియుండెను. ఇప్పుడు చెరసాలలోయున్న యోహానుయెడల ఒకప్పుడు వారికున్న గౌరవమును గుర్తుచేయుచు, యేసు వారితో ఇట్లనును: “మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి.” వారికి సహాయము చేయవలెను, అవును వారిని రక్షింపవలెనను నిరీక్షణతోనే యేసు ఈ సంగతిని వారికి గుర్తుచేయును. అయినను ఆయన యోహాను సాక్ష్యముపై ఆధారపడడు.

“నేను చేయుచున్న ఆ క్రియలే [ఆయన అంతకుముందే చేసిన అద్భుతముతో సహా] తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” దీనికి తోడు యేసు ఇంకను వారికిట్లు తెలియజేయును: “నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.” ఉదాహరణకు, యేసు బాప్తిస్మమప్పుడు దేవుడు, “ఈయన నా ప్రియకుమారుడు” అని సాక్ష్యమిచ్చెను.

నిజానికి, యేసును నిందించువారికి ఆయనను తృణీకరించుటకు ఏ కారణము లేదు. తాము పరిశోధించుచున్నామని చెప్పు లేఖనములే ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి! “అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక, మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురు?” అని చెప్పుచు యేసు తన మాటలను ముగించును. యోహాను 5:17-47; 1:19-27; మత్తయి 3:17.

యేసు పని ఎందుకు విశ్రాంతిదినమును ఉల్లంఘించనిదై యున్నది?

దేవుని సంకల్పమందలి తన పాత్రనుగూర్చి యేసు ఎట్లు వివరించెను?

తాను దేవుని కుమారుడనని నిరూపించుటకు, ఎవరి సాక్ష్యమును యేసు సూచించెను?