కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయనను వారు బంధింపలేక పోవుదురు

ఆయనను వారు బంధింపలేక పోవుదురు

అధ్యాయము 67

ఆయనను వారు బంధింపలేక పోవుదురు

పర్ణశాలల పండుగ ఇంకను జరుగుచుండగా, మత నాయకులు యేసును బంధించుటకు పోలీసు బంట్రౌతులను పంపుదురు. ఆయన దాగుకొనుటకు ప్రయత్నించలేదు. బదులుగా యేసు బహిరంగముగానే బోధించుచు ఇట్లు చెప్పసాగును: “ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు.”

యూదులకు అది అర్థముకాలేదు, కావున వారు తమలోతాము, “మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? ‘నన్ను వెదకుదురుగాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని’ ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో?” అని చెప్పుకొనుచుందురు. అయితే యేసు, సమీపించుచున్న తన మరణమునుగూర్చి మరియు తన శత్రువులు రాలేని పరలోకమునకు తాను పునరుత్థానమగుటనుగూర్చి మాటలాడుచున్నాడు.

పండుగలో ఏడవదియైన చివరిరోజు వచ్చును. పండుగ రోజులలో ప్రతి ఉదయము, యాజకుడొకరు సిలోయమను కొలనునుండి నీరు తీసికొనిపోయును గనుక, అవి బలిపీఠము అడుగున పారుచుండును. బహుశ ఈ ప్రతిదిన ఆచరణను గుర్తుచేయుచు, యేసు బిగ్గరగా ఇట్లనును: “ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు ‘వాని కడుపులోనుండి జీవజలనదులు పారును.’”

వాస్తవానికి, యేసు ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునప్పుడు కలుగు దివ్య పరిణామములనుగూర్చి మాట్లాడుచున్నాడు. ఆ మరుసటి సంవత్సరము పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట జరుగును. అక్కడ, 120 మంది శిష్యులు ప్రజలకు పరిచర్య జరిగించుచుండగా జీవజలము పొంగిపారును. అయితే అప్పటివరకు, ఆత్మ అనుగ్రహింపబడలేదు అనగా క్రీస్తు శిష్యులలో ఎవరును పరిశుద్ధాత్మచే అభిషేకింపబడి పరలోక జీవమునకు పిలువబడలేదని దాని భావము.

యేసు బోధకు ప్రత్యుత్తరముగా, కొందరు మోషేకంటె గొప్పవాడు వచ్చునని వాగ్దానము చేయబడిన ప్రవక్తను స్పష్టముగా సూచించుచు, “నిజముగా ఈయన ప్రవక్తయే” అందురు. మరికొందరైతే, “ఈయన క్రీస్తే” అందురు, ఇంకొందరు దానిని వ్యతిరేకించుచు, “ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా?” అందురు.

కాగా జనసమూహములో బేధము పుట్టును. వారిలో కొందరు ఆయనను బంధించవలెనని చూచిరిగాని యెవడును ఆయనమీద చెయ్యివెయ్యలేదు. యేసు లేకుండా బంట్రౌతులు తిరిగివచ్చినప్పుడు, ప్రధానయాజకులు, పరిసయ్యులు, “ఎందుకు మీరాయనను తీసికొని రాలేదు?” అని వారిని అడుగుదురు.

“ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని” బంట్రౌతులు సమాధానమిస్తారు.

కోపముతో నిండినవారై మతనాయకులు అపహాస్యమునకు దిగి, అవమానకరముగా, నీచముగా మాట్లాడుటకు సిద్ధపడుదురు. ఎగతాళిగా వారిట్లందురు: “మీరుకూడ మోసపోతిరా? అధికారులలోగాని పరిసయ్యులలోగాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనది.”

అప్పుడు, పరిసయ్యుడు మరియు యూదుల అధికారియునైన (అనగా, యూదుల న్యాయసభ సభ్యుడు) నీకొదేము, యేసు పక్షమున మాట్లాడుటకు ధైర్యముచేయును. రెండున్నర సంవత్సరముల క్రితము రాత్రిసమయమున యేసునొద్దకు వచ్చి ఆయనయందు తనకు విశ్వాసమున్నదని చెప్పిన విషయమును మీరు గుర్తు తెచ్చుకొనవచ్చును. ఇప్పుడు నీకొదేము ఇట్లనును: “ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పుతీర్చునా?”

తమలోని ఒకవ్యక్తి సహితము యేసుపక్షముగా మాట్లాడుట చూసి పరిసయ్యులు మరింత ఉగ్రులగుదురు. కరకుగా మాట్లాడుచు వారిట్లందురు: “నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు.”

ప్రవక్త గలిలయనుండి వచ్చునని లేఖనములు సూటిగా చెప్పకపోయినను, ఆ ప్రాంతములో వారు “గొప్ప వెలుగును” చూతురని చెప్పుచు, క్రీస్తు అక్కడనుండి వచ్చునని అవి సూచించెను. అంతేకాకుండా, యేసు బేత్లెహేములో జన్మించెను, మరియు ఆయన దావీదు సంతానమై యుండెను. పరిసయ్యులు బహుశ దీనిని ఎరిగియున్నను, యేసునుగూర్చి ప్రజలు కలిగియున్న తప్పుడు అభిప్రాయములను వ్యాప్తిచేయుటకు బహుశ వారే బాధ్యులైయున్నారు. యోహాను 7:32-52; యెషయా 9:1, 2; మత్తయి 4:13-17.

పండుగ రోజులలో ప్రతి ఉదయము ఏమి జరుగును, మరియు దీనియెడల యేసు తన శ్రద్ధనెట్లు మళ్లించును?

బంట్రౌతులు యేసును ఎందుకు బంధించలేక పోవుదురు, కాగా మత నాయకులు ఎట్లు ప్రతిస్పందింతురు?

నీకొదేము ఎవరు, యేసుయెడల ఆయన దృక్పధమేమైయున్నది, మరియు తోటి పరిసయ్యులు ఆయనను ఎట్లు చూసిరి?

క్రీస్తు గలిలయలోనుండి వచ్చుననుటకు ఏ నిదర్శనము కలదు?