కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన జన్మించక పూర్వమే ఘనపరచబడెను

ఆయన జన్మించక పూర్వమే ఘనపరచబడెను

అధ్యాయము 2

ఆయన జన్మించక పూర్వమే ఘనపరచబడెను

తానొక మగశిశువును కనునని, ఆయన శాశ్వతకాల రాజగునని యౌవనస్థురాలగు మరియతో గబ్రియేలు దూత చెప్పిన తర్వాత, మరియ, “నేను పురుషుని ఎరుగనిదాననే; ఇదేలాగు జరుగునని,” అడుగును.

దానికి గబ్రియేలు, “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును” అని వివరించును.

తన వర్తమానమును మరియ నమ్మునట్లు సహాయపడుటకు గబ్రియేలు ఇంకను ఇట్లనును: “నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు.”

మరియ గబ్రియేలు మాటలను అంగీకరించును. కాగా ఆమె ప్రత్యుత్తరమేమై యున్నది? “ఇదిగో! యెహోవా దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగుగాక” అని ఆమె అనును.

గబ్రియేలు వెళ్లిన వెంటనే, మరియ లేచి యూదయ దేశమందలి కొండసీమలో తన భర్తయైన జెకర్యాతోపాటు జీవించుచున్న ఎలీసబెతును దర్శించ వెళ్లును. నజరేతులోని మరియ ఇంటినుండి ఇది బహుశ మూడు లేక నాలుగు దినముల ప్రయాణం చేయునంత దూరంగా ఉన్నది.

చివరకు మరియ జెకర్యా ఇంటికి వచ్చినప్పుడు, ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చెప్పును. అంతట, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై మరియతో ఇట్లనును: “స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవినపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.”

దీనిని వినిన మరియ, హృదయపూర్వక కృతజ్ఞతతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును: “నా ప్రాణము యెహోవాను ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు.” తనయెడల అంత కటాక్షము చూపబడినను, మరియ సమస్త ఘనతను దేవునికి ఇచ్చును. “ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును” అని ఆమె అనును.

మరియ దేవుని మహిమపరచు చుండుటనుగూర్చి ప్రేరేపిత ప్రవచనార్థక కీర్తన ఇంకను ఇట్లు తెల్పుచున్నది: “ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను., అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.”

మరియ ఎలీసబెతుతో దాదాపు మూడు నెలలు ఉండును, నిండు గర్భవతియైన ఎలీసబెతుకు ఈ చివరి వారములలో నిస్సందేహముగా ఆమె గొప్ప సహాయమై యుండును. దేవుని సహాయముతో తమగర్భమందు పిల్లలను మోయుచున్న ఈ ఇద్దరు స్త్రీలు, తమ జీవితములలో ఆశీర్వాదకరమగు ఈ సమయములో కలిసి ఒకచోటయుండుట నిజముగా ఎంతో దీవెనకరము!

జన్మించక పూర్వమే యేసుకివ్వబడిన ఘనతను మీరు గమనించారా? ఎలీసబెతు ఆయనను “నా ప్రభువు” అని పిలిచెను, ఆలాగే మరియ మొదట వచ్చినప్పుడు ఆమె గర్భస్థ శిశువు ఆనందముతో గంతులు వేసెను. అయితే ఆ తరువాత, ఇతరులు మరియను ఇంకా జన్మించని శిశువును, హీనంగాచూసిరని మనము గమనించ బోవుచున్నాము. లూకా 1:26-56.

తానెట్లు గర్భము ధరించునోయని మరియ అర్థముచేసికొన సహాయపడుటకు గబ్రియేలు ఏమిచెప్పును?

యేసు జన్మించక పూర్వమే ఎట్లు ఘనపరచబడెను?

దేవుని మహిమపరచుటలో ప్రవచనార్థక కీర్తనయందు మరియ ఏమిచెప్పును?

మరియ ఎలీసబెతుతో ఎంతకాలముండును, మరియు ఈ సమయములో మరియ ఎలీసబెతుతో ఉండుట ఎందుకు సరియైయున్నది?