ఆయన వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధముచేయుట
అధ్యాయము 116
ఆయన వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధముచేయుట
జ్ఞాపకార్థ భోజనము అయిపోయింది, అయితే యేసు మరియు ఆయన అపొస్తలులు ఇంకను మేడమీద గదిలోనే ఉన్నారు. యేసు త్వరలోనే వెళ్లిపోవనైయున్నను, ఆయన వారికి చెప్పవలసిన సంగతులు ఇంకను ఎన్నోకలవు. “మీ హృదయమును కలవరపడనియ్యకుడి” అని ఆయన వారిని ఓదార్చును. “దేవునియందు విశ్వాసముంచుచున్నారు” అని ఆయన ఇంకను ఇట్లనును: “నాయందును విశ్వాసముంచుడి.”
యేసు కొనసాగించుచు, “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, . . . మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. . . . నేనుండు స్థలములో మీరును ఉందురు. . . . నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.” యేసు పరలోకమునకు వెళ్లుటనుగూర్చి మాట్లాడుచున్నాడని అపొస్తలులు గ్రహించలేదు, కావున తోమా ఇట్లడుగును: “ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియును?”
యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని జవాబిచ్చును. అవును, కేవలము ఆయనను అంగీకరించి ఆయన జీవన విధానమును అనుకరించుటద్వారా మాత్రమే ఒకడు తండ్రి పరలోక గృహములో ప్రవేశించగలడు, ఎందుకంటే యేసు చెప్పునట్లుగా, “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”
“ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని” ఫిలిప్పు ఆయనను వేడుకొనును. ప్రాచీన కాలములో మోషే, ఏలీయా, ఎలీషాలకు అనుగ్రహింపబడినట్లుగా, దృశ్యమగురీతిలో దేవుని ప్రత్యక్షతను యేసు తమకు చూపవలెనని ఫిలిప్పు కోరుచున్నాడు. అయితే నిజానికి అపొస్తలులు దర్శనములకంటె శ్రేష్ఠమైన దానిని కలిగియున్నారు, యేసు వారితో ఇట్లనును: “ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”
యేసు ఎంత పరిపూర్ణముగా తన తండ్రి వ్యక్తిత్వమును ప్రతిబింబించుచున్నాడంటే, నిజానికి ఆయనను చూచుట తండ్రిని చూసినట్టే కాగలదు. అయినను, యేసు అంగీకరించుచున్నట్లుగా, తండ్రి యేసుకంటే ఎంతో ఉన్నతుడైయున్నాడు: “నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు.” యేసు సరియైన రీతిలో తన బోధయంతటి ఘనత యావత్తును తన తండ్రికి యిచ్చుచున్నాడు.
ఇప్పుడు యేసు ఇలా చెప్పుచుండుటను వినుట అపొస్తలులకు ఎంత ప్రోత్సాహకరముగా యుండవచ్చును: “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును.” తన అనుచరులు తనకంటే మరిగొప్పవైన అద్భుత శక్తులను ప్రదర్శించుదురని యేసు భావము కాదు. అయితే వారు ఎక్కువ ప్రాంతములో, మరి ఎక్కువ ప్రజలయెడల పరిచర్యను దీర్ఘకాలము కొనసాగింతురని, ఆయన భావమై యున్నది.
తాను వెళ్లిపోయిన తర్వాత యేసు తన శిష్యులను విడిచిపెట్టడు. “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని ఆయన వాగ్దానము చేయును. ఆయనింకను, ఇట్లనును: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” ఆ తర్వాత, ఆయన పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు, యేసు తన శిష్యులపై ఈ వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను కుమ్మరించెను.
యేసు చెప్పునట్లుగా ఆయన వెళ్లవలసిన సమయము దగ్గరపడును: “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు.” ఏ మానవుడు చూడలేని విధముగా యేసు ఆత్మీయవ్యక్తియై యుండును. అయితే యేసు తన నమ్మకమైన అపొస్తలులకు మరలా ఇట్లు వాగ్దానము చేయును: “అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.” అవును, యేసు పునరుత్థానమైన తదుపరి ఆయన వారికి మానవరూపమున అగుపడుటయే కాకుండా, తగిన కాలమున ఆయన తనతో పరలోకమందు ఆత్మీయ ప్రాణులుగా ఉండుటకు వారిని జీవమునకు పునరుత్థానము చేయును.
యేసు ఇప్పుడు ఒక సరళమైన నియమమును చెప్పును: “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును.”
ఇప్పుడు తద్దయి అనికూడ పిలువబడిన అపొస్తలుడగు యూదా కలుగజేసుకొని, “ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించెనని” అడుగును.
అందుకు యేసు, “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, . . . నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడని” జవాబిచ్చును. ఆయన విధేయతగల శిష్యులవలె కాక, లోకము క్రీస్తు బోధలను అలక్ష్యము చేయును. కావున ఆయన వారికి తననుతాను కనబరచుకొనడు.
తన భూపరిచర్య కాలములో యేసు తన అపొస్తలులకు అనేక సంగతులను బోధించెను. ప్రత్యేకముగా ఈ క్షణము వరకు వారు ఎన్నో విషయములను గ్రహించలేక పోయారు, వాటన్నింటిని వారెట్లు గుర్తుంచుకొందురు? సంతోషకరంగా, యేసు వారికిట్లు వాగ్దానము చేయును: “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతోచెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.”
యేసు మరలా వారిని ఓదార్చుచు, ఇట్లనును: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను. . . . మీ హృదయమును కలవరపడనియ్యకుడి.” నిజమే, యేసు వెళ్లిపోవుచున్నాడు, ఆయితే ఆయనిట్లు వివరించుచున్నాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.”
యేసు వారితో ఉండు సమయము చాలా తక్కువగా యున్నది. ఆయనిట్లనుచున్నాడు: “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.” యూదామీద పట్టుకలిగియుండుటకు అతనిలో ప్రవేశించగల్గిన అపవాదియగు సాతాను, ఈ లోకాధికారియైయున్నాడు. అయితే దేవుని సేవించుటనుండి త్రిప్పివేయగల పాత్రను సాతాను నిర్వహించుటకు యేసులో ఎటువంటి పాపభరితమైన బలహీనత లేదు.
సన్నిహిత సంబంధమును అనుభవించుట
జ్ఞాపకార్థ భోజనము తరువాత, యేసు అతి సన్నిహితముగా మాట్లాడుచు తన అపొస్తలులను ప్రోత్సహించుచున్నాడు. అప్పటికి అర్థరాత్రి దాటి యుండవచ్చును. కావున యేసు, “లెండి, ఇక్కడనుండి వెళ్లుదమని” వారితో చెప్పును. అయితే వారు బయలుదేరక ముందు, వారియెడల తనకుగల ప్రేమచే కదిలింపబడి, యేసు వారితో మాటలాడుటను కొనసాగించి, వారిని ఉత్తేజపరచు ఒక ఉపమానమును చెప్పును.
ఆయన మొదలుపెట్టి ఇట్లనును: “నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.” యెహోవా దేవుడు గొప్ప వ్యవసాయకుడై యున్నాడు, సా.శ. 29 ఆకురాలు కాలమున యేసు బాప్తిస్మమప్పుడు ఆయనను పరిశుద్ధాత్మచే అభిషేకించుటతో ఆయన ఈ సూచనార్థకమైన ద్రాక్షవల్లిని నాటెను. అయితే యేసు ఇంకను కొనసాగించుచు, ఆ ద్రాక్షవల్లి కేవలము తనకంటె ఎక్కువను సూచించుచున్నదని చూపించుచు ఇట్లనును: “నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. . . . తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేగాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు.”
పెంతెకొస్తునాడు, అనగా 51 దినముల తరువాత, అపొస్తలులు మరియు ఇతరులు, తమపై పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు వారు ఆ ద్రాక్షావల్లి తీగెలైరి. చివరకు, 1,44,000 మంది ఆ సూచనార్థక ద్రాక్షావల్లి తీగెలుగా తయారైరి. ద్రాక్షావల్లియైన యేసుక్రీస్తుతో కలిసి వీరు దేవుని రాజ్య ఫలములను ఉత్పన్నముచేయు సూచనార్థక ద్రాక్షా చెట్టుగా తయారగుదురు.
ఫలములను ఉత్పన్నము చేయుటకు కీలకమైన దానిని యేసు ఇట్లు వివరించుచున్నాడు: “ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరు ఉండి మీరేమియ చేయలేరు.” అయితే ఒకడు ఫలించనట్లయిన, “వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును” అని యేసు చెప్పును. మరొకవైపున యేసు ఇట్లు వాగ్దానము చేయుచున్నాడు: “నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.”
యేసు ఇంకను తన అపొస్తలులతో ఇట్లనును: “మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” దేవుడు తీగెలనుండి కోరు ఫలములేవనగా, వారు క్రీస్తునుపోలిన లక్షణములను, ప్రత్యేకముగా ప్రేమను ప్రదర్శించవలెననునదియే. అంతేకాకుండ, క్రీస్తు దేవుని రాజ్య ప్రచారకునిగా యుండినందున, కోరబడిన ఫలములందు ఆయన చేసిన విధముగానే శిష్యులనుచేయు పనియు చేర్చబడియున్నది.
“నా ప్రేమయందు నిలిచియుండుడి” అని యేసు ఉద్బోధించును. అయినను, ఆయన అపొస్తలులు దీనినెట్లు చేయగలరు? ఆయనిట్లనును: “మీరు నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.” కొనసాగించుచు యేసు ఇట్లు వివరించును: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.”
ఇక కొద్దిగంటలలో, తన అపొస్తలులు మరియు తనయందు విశ్వాసముంచు ఇతరులందరి పక్షముగా తన ప్రాణమునిచ్చుటద్వారా యేసు ఈ మిన్నయైన ప్రేమను ప్రదర్శించును. ఆయన మాదిరి ఆయన అనుచరులును ఒకరియెడల ఒకరు ఈ స్వయం-త్యాగ ప్రేమను కలిగియుండుటకు వారిని ప్రేరేపించవలెను. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని” యేసు అంతకుముందు చెప్పినట్లుగా, ఈ ప్రేమ వారిని గుర్తించును.
తన స్నేహితులను గుర్తించుచు, యేసు ఇట్లనును: “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.”
యేసు సన్నిహిత స్నేహితులైయుండు—ఆ సంబంధము ఎంత అమూల్యమైనది! అయితే ఈ సంబంధమును ఎడతెగక అనుభవించవలెనంటే, ఆయన అనుచరులు తప్పక “ఫలములను ఫలింపవలెను.” వారట్లు చేసినట్లయిన, యేసు చెప్పునట్లుగా “మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించును.” రాజ్య ఫలములు ఫలించినందుకు, అది నిశ్చయముగా దివ్య బహుమానమై యున్నది! “ఒకనినొకడు ప్రేమించుడని” మరలా ఒకసారి తన అపొస్తలులకు ఉద్బోధించి, లోకము వారిని ద్వేషించునని యేసు వివరించును. అయినప్పటికిని, ఆయన వారినిట్లు ఓదార్చును: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.” ఆ పిమ్మట లోకము తన అనుచరులను ఎందుకు ద్వేషించునో తెల్పుచు, యేసు ఇట్లనును: “మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”
లోకము ద్వేషించుటకుగల మరొక కారణమును వివరించుచు, “వారు నన్ను పంపిన వానిని [యెహోవా దేవుడు] ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు” అని యేసు చెప్పును. యేసు చెప్పునట్లుగా, ఆయన చేసిన అద్భుత క్రియలు, నిజానికి ఆయనను ద్వేషించువారిని దోషులను చేయుచున్నవి: “ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రినిని చూచి ద్వేషించియున్నారు.” ఆ విధముగా, యేసు చెప్పునట్లు, “నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి” అను లేఖనము నెరవేరును.
అంతకుముందు చేసినట్లుగానే, ఆదరణకర్తను అనగా దేవుని బలమైన చురుకైన శక్తియగు పరిశుద్ధాత్మను పంపెదనని వాగ్దానము చేయుటద్వారా యేసు మరలా వారిని ఓదార్చును. “పరిశుద్ధాత్మ నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును; . . . కాగా మీరును నాకు సాక్ష్యమియ్యవలెను.”—NW.
వెళ్లిపోవుటకు ముందు మరింత ఉపదేశము
యేసు మరియు ఆయన అపొస్తలులు మేడగదినుండి బయలుదేరుటకు నిలువబడిరి. “మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను,” అని ఆయన వారినిట్లు గంభీరముగా హెచ్చరించును: “వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.”
అపొస్తలులు ఈ హెచ్చరికద్వారా బహుగా కలతచెందుదురు. యేసు ఇంతకుముందు కూడా లోకము వారిని ద్వేషించునని చెప్పినను, వారు చంపబడుదురని ఇంత సూటిగా బయల్పరచలేదు. “నేను మీతోకూడ ఉంటిని గనుక, మొదటనే వీటిని మీతో చెప్పలేదు” అని యేసు వివరించును. అయినను, ఆయన వెళ్లకముందు వారిని ఈ విషయమై ముందే హెచ్చరించుట ఎంత శ్రేష్ఠము!
ఇంకను యేసు, “ఇప్పుడు నన్ను పంపినవానియొద్దకు వెళ్లుచున్నాను, ‘నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని’ మీలో ఎవడును నన్నడుగుటలేదని” అనును. సాయంకాలము కాకమునుపు వారు ఆయన ఎక్కడికి పోవుచున్నాడని వాకబు చేసిరి, అయితే వారిప్పుడు ఆయన చెప్పిన దానికి ఎంతగా చలించిపోయిరంటే ఈ విషయమై వారు ఏమియు అడుగలేకపోవుదురు. యేసు చెప్పునట్లు: “నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది.” తాము తీవ్ర హింసలపాలై చంపబడుదుమని తెలిసికొనినందువలన మాత్రమే కాదుగాని, తమ యజమాని తమను విడిచి వెళ్లుచున్నాడనియు అపొస్తలులు దుఃఖక్రాంతులై యున్నారు.
కావున యేసు ఇట్లు వివరించును: “నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.” మానవునిగా యేసు ఒక సమయములో ఒక స్థలములోనే ఉండగలడు, కాని ఆయన పరలోకములో ఉన్నప్పుడు, భూమిపై తన అనుచరులు ఎక్కడవున్నను వారియొద్దకు దేవుని పరిశుద్ధాత్మయగు ఆదరణకర్తను ఆయన పంపగలడు. కావున యేసు వెళ్లుట ప్రయోజనకరము.
పరిశుద్ధాత్మ, “పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును” అని యేసుచెప్పును. లోకముయొక్క పాపము, దేవుని కుమారునియందు విశ్వాసముంచుటలో తప్పిపోవుట బహిర్గతము చేయబడును. దానికితోడు, యేసుయొక్క నీతినిగూర్చి ఒప్పింపజేయు రుజువు ఆయన తండ్రియొద్దకు ఎక్కిపోవుటద్వారా ప్రదర్శింపబడును. మరియు యేసు యథార్థతను త్రుంచివేయుటలో సాతాను అతని దుష్ట లోకము తప్పిపోవుట, ఈ లోకాధికారి తీవ్రముగా తీర్పుతీర్చబడునని ఒప్పింపజేయు రుజువు నిచ్చుచున్నది.
“నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు” అని యేసు చెప్పును. కావున తాను దేవుని చురుకైన శక్తియగు పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసినప్పుడు, వారి గ్రహణ శక్తినిబట్టి ఈ సంగతులను అర్థము చేసికొనుటకు వారిని నడిపించునని యేసు వాగ్దానము చేయును.
అపొస్తలులు ప్రత్యేకముగా యేసు చనిపోయి ఆ పిమ్మట పునరుత్థానమైనప్పుడు వారికి కన్పించుననునది అర్థము చేసికొనలేకపోవుదురు. అందువలన వారిలో వారిట్లు మాట్లాడుకొందురు: “‘కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు’ ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి?”
వారు తనను ప్రశ్నించవలెనని కోరుచున్నారని యేసు గ్రహించును, కావున ఆయనిట్లు వివరించును: “మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఆ దినమందలి తర్వాతి సమయములో అనగా మధ్యాహ్నము యేసు చంపబడినప్పుడు, లోక మతనాయకులు సంతోషింతురు, అయితే శిష్యులు దుఃఖక్రాంతులగుదురు. అయితే యేసు పునరుత్థానమైనప్పుడు, వారి దుఃఖము సంతోషముగా మారును! వారిమీద దేవుని పరిశుద్ధాత్మను కుమ్మరించుటద్వారా తన సాక్షులుగా ఉండుటకు పెంతెకొస్తునాడు ఆయన వారిని శక్తిమంతులను చేసినప్పుడు వారి సంతోషము కొనసాగును.
అపొస్తలుల పరిస్థితిని ప్రసవవేదన పడుచున్న ఒక స్త్రీకి పోల్చుచు, యేసు ఇట్లనును: “స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును.” అయితే శిశువు పుట్టిన మరుక్షణమే ఆమె తన బాధనంతా మరచిపోవును అని చెప్పి, యేసు తన అపొస్తలులను ప్రోత్సహించుచు ఇట్లనును: “అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని [నేను పునరుత్థానమైనప్పుడు] మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీయొద్దనుండి తీసివేయడు.”
ఇప్పటివరకు అపొస్తలులు ఎన్నడును యేసు నామమున విన్నపములు చేయలేదు. అయితే యేసు ఇప్పుడు వారితో ఇట్లనును: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. . . . మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకము విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నాను.”
యేసు మాటలు అపొస్తలులను ఎంతగానో ప్రోత్సహించును. “దేవుని యొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని” వారందురు. అందుకు యేసు, “మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది” అనును. పైకి అది అసంభవముగా కన్పించినను, ఆ రాత్రి గడవకముందే అది సంభవించును!
“నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమకలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నానని” చెప్పుచు యేసు ముగించును. యేసు యథార్థతను త్రుంచివేయుటకు సాతాను అతని లోకము ఎన్ని ప్రయత్నములు చేసినను దేవుని చిత్తమును నమ్మకముగా నెరవేర్చుటద్వారా యేసు లోకమును జయించెను.
మేడగదిలో ముగింపు ప్రార్థన
తన శిష్యుల కొరకైన లోతైన ప్రేమతో కదిలింపబడి, యేసు త్వరగా తను వెళ్లిపోవుట విషయమై తన శిష్యులను సిద్ధము చేయుచున్నాడు. చాలా సమయము వరకు వారిని ఓదార్చుచు ఉపదేశములిచ్చిన తర్వాత, ఆయనిప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి తనతండ్రికి ఇట్లు ప్రార్థించును: “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.”
ఎంతటి కదిలింపజేయు మూలాంశమును యేసు పరిచయము చేసెను—నిత్యజీవము! “సర్వశరీరులమీద” అధికారమివ్వబడిన వానిగా, యేసు తన విమోచన క్రయధన ప్రయోజనములను చనిపోవుచున్న మానవజాతిలోని వారందరికి ఇవ్వగలడు. అయినను, ఆయన కేవలము తండ్రి గుర్తించువారికి మాత్రమే “నిత్యజీవమును” అనుగ్రహించును. నిత్యజీవమునుగూర్చిన ఈ మూలాంశమును మరింత విశదముచేయుచు, యేసు తన ప్రార్థనను ఇట్లు కొనసాగించును:
“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” అవును, మన రక్షణ దేవుని మరియు ఆయన కుమారుని గూర్చిన జ్ఞానమును సంపాదించుటపై ఆధారపడియున్నది. అయితే కేవలము తల జ్ఞానముకంటే ఎక్కువ అవసరమైయున్నది.
ఒకవ్యక్తి వారిని సన్నిహితముగా తెలిసికొనవలెను, వారితో అర్థము చేసికొనిన స్నేహమును పెంపొందించుకొనవలెను. వారి కనుదృష్టితో విషయములను చూస్తు వారివలెనే భావింపవలెను. అన్నింటికంటె ఎక్కువగా, ఒకవ్యక్తి ఇతరులతో వ్యవహరించుటలో వారి సాటిరాని లక్షణములను అనుకరించుటకు కృషిచేయవలెను.
యేసు ఆ పిమ్మటకూడ ఇట్లు ప్రార్థించును: “చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని.” ఆ విధముగా తనకప్పగింపబడిన పనిని ఇప్పటికి వరకు నెరవేర్చినవానిగా, ఆయన తన భవిష్యత్తులోకూడ సఫలుడగుదునను నమ్మకమును కలిగియుండెను, ఆయనిట్లు విన్నవించుకొనును: “తండ్రీ లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.” అవును, ఆయనిప్పుడు పునరుత్థానముద్వారా తన పూర్వ పరలోక మహిమను పునరుద్ధరించవలెనని అడుగుచున్నాడు.
భూమిమీది తన ముఖ్యమైన పనిని సంక్షిప్తపరచుచు, యేసు ఇట్లనును: “లోకమునుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.” యెహోవా, అను దేవుని నామమును యేసు తన పరిచర్యలో ఉపయోగించెను. ఆయన తన అపొస్తలులకు దేవుని నామమును తెలియజేయుటకంటే మరి ఎక్కువనే చేసెను. యెహోవానుగూర్చి, ఆయన వ్యక్తిత్వము, సంకల్పములనుగూర్చిన వారి జ్ఞానమును, గుణగ్రహణను విస్తరింపజేసెను.
యెహోవా తనకంటే ఉన్నతుడని, ఆయనక్రింద తాను సేవచేయుచున్నానను ఘనతను ఆయనకే ఇచ్చుచు, యేసు వినయముతో ఇట్లు అంగీకరించును: “నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి.”
తన అనుచరులకు మరియు మిగతా మానవజాతికిగల వ్యత్యాసమును చూపించుచు, ఆ తర్వాత యేసు ఇట్లు ప్రార్థించును: “నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, . . . నేను వారిని భద్రపరచితిని . . . , నాశనపుత్రుడు [ఇస్కరియోతు యూదా] తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.” ఈ సమయములో, యూదా యేసును అప్పగించు నీచమైన పనిని చేయుటకు బయలువెళ్లియున్నాడు. ఆ విధముగా, యూదా తనకు తెలియకుండానే లేఖనమును నెరవేర్చును.
యేసు ఇంకను ఇట్లు ప్రార్థించును: “లోకము వారిని ద్వేషించును. నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” యేసు అనుచరులు ఈ లోకములో, అనగా సాతాను పరిపాలించు ఈ సంఘటిత మానవజాతి సమాజములో ఉన్నారు, అయితే అన్నిసమయములలో వారు దానినుండి దాని దుష్టత్వమునుండి వేరుగా నిలిచియుండవలెను.
యేసు ఇంకను ఇట్లనును: “సత్యమందు వారిని ప్రతిష్ఠచేయుము; నీ వాక్యమే సత్యము.” ఇక్కడ తాను ఎడతెగక ఎత్తిచూపిన ప్రేరేపిత హెబ్రీలేఖనములను యేసు “సత్యమని” పిలుచుచున్నాడు. అయితే ఆయన తన శిష్యులకు బోధించినది మరియు వారు ప్రేరణక్రింద వ్రాసిన క్రైస్తవ గ్రీకు లేఖనములును అదేరీతిలో “సత్యమై” యున్నవి. ఈ సత్యము ఒకవ్యక్తిని ప్రతిష్ఠ పరచగలదు, అతని జీవితమును పూర్తిగా మార్చగలదు మరియు అతడు లోకమునుండి వేరుగాయుండునట్లును చేయగలదు.
యేసు ఇప్పుడు ‘వారికొరకు మాత్రమే ప్రార్థించుట లేదు; వారి వాక్యమువలన ఆయనయందు విశ్వాసముంచు వారందరి కొరకు ప్రార్థించుచున్నాడు.’ కావున యేసు తన అభిషక్త అనుచరులుగా ఉండువారికొరకు మరియు భవిష్యత్తులో ‘ఒకే మందగా’ సమకూర్చబడు ఇతర శిష్యుల కొరకును ప్రార్థించుచున్నాడు. వీరందరికి కొరకు యేసు ఏమి విన్నవించుచున్నాడు?
“తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, . . . వారును ఏకమై యుండవలెను.” యేసు మరియు ఆయన తండ్రి అక్షరార్థముగా ఒకే వ్యక్తిగాలేరు, అయితే వారు సమస్త విషయములలో సంపూర్ణ అంగీకారమును కలిగియున్నారు. తన అనుచరులుకూడ అదే ఏకతను కలిగియుండవలెనని యేసు ప్రార్థించుచున్నాడు, అలా “నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనును.”
యేసు ఇప్పుడు తన అభిషక్తులైన అనుచరులుగా తయారగు వారి పక్షముగా తన పరలోకపు తండ్రికి విన్నపము చేయుచున్నాడు. దేని కొరకు? “నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు [అనగా ఆదాము హవ్వలు పిల్లలను కనకముందు] పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.” ఎంతో కాలము పూర్వమే యేసుక్రీస్తుగా వచ్చిన తన అద్వితీయ కుమారుని దేవుడు ప్రేమించెను.
తన ప్రార్థనను ముగించుచు, యేసు మరలా ఇట్లు నొక్కితెల్పును: “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.” అపొస్తలులకు, దేవుని నామమును నేర్చుకొనుటలో వారు వ్యక్తిగతముగా దేవుని ప్రేమను తెలిసికొనుట ఇమిడియుండెను. యోహాను 14:1–17:26; 13:27, 35, 36; 10:16; లూకా 22:3, 4; నిర్గమకాండము 24:10; 1 రాజులు 19:9-13; యెషయా 6:1-5; గలతీయులు 6:16; కీర్తన 35:19; 69:4; సామెతలు 8:22, 30.
▪ యేసు ఎక్కడకు వెళ్లుచున్నాడు, వెళ్లు మార్గమునుగూర్చి తోమాకు ఎలాంటి సమాధానము లభించును?
▪ తన విన్నపముద్వారా, యేసు ఏమి దయచేయవలెనని ఫిలిప్పు కోరుచున్నాడు?
▪ యేసును చూసినవారు తండ్రినికూడ ఎందుకు చూసిన వారగుదురు?
▪ యేసుకంటె ఆయన అనుచరులు ఎట్లు మరిగొప్పవైన కార్యములు చేయుదురు?
▪ ఏ భావమందు సాతాను యేసుపై ఎటువంటి పట్టును కలిగిలేడు?
▪ యెహోవా ఎప్పుడు సూచనార్థకమైన ద్రాక్షవల్లిని నాటును, ఎప్పుడు మరియు ఎట్లు ఇతరులు ద్రాక్షావల్లియందు భాగమగుదురు?
▪ చివరకు, సూచనార్థక ద్రాక్షావల్లికి ఎన్ని తీగెలు ఉండును?
▪ తీగెలనుండి దేవుడు ఎటువంటి ఫలములను కోరుచున్నాడు?
▪ మనమెట్లు యేసు స్నేహితులమై యుండగలము?
▪ యేసు అనుచరులను లోకము ఎందుకు ద్వేషించును?
▪ యేసు చేసిన ఎటువంటి హెచ్చరిక ఆయన అపొస్తలులను కలవరపరచును?
▪ ఆయన ఎక్కడికి వెళ్లుచున్నాడనుటను గూర్చి యేసును ప్రశ్నించుటకు అపొస్తలులు ఎందుకు తప్పిపోవుదురు?
▪ అపొస్తలులు ప్రత్యేకముగా దేనిని అర్థము చేసికొనలేక పోవుదురు?
▪ అపొస్తలుల పరిస్థితి దుఃఖమునుండి సంతోషముగా మారునని యేసు ఎట్లు దృష్టాంత పరచును?
▪ త్వరలోనే అపొస్తలులు ఏమి చేయుదురని యేసు చెప్పును?
▪ యేసు లోకమును ఎట్లు జయించును?
▪ ఏ భావమందు యేసుకు “సర్వశరీరుల మీద అధికారమివ్వబడెను”?
▪ దేవునిగూర్చి ఆయన కుమారునిగూర్చి జ్ఞానమును పొందుట అనగా దాని భావమేమి?
▪ ఏ విధములుగా యేసు దేవుని నామమును ప్రత్యక్షపరచును?
▪ “సత్యము” అనగానేమి, అది ఒక క్రైస్తవుని ఎట్లు “ప్రతిష్ఠ” పరచును?
▪ దేవుడు, ఆయన కుమారుడు, మరియు సత్యారాధికులందరు ఎట్లు ఏకమైయున్నారు?
▪ “జగత్తు పునాది వేయబడుట” ఎప్పుడు జరిగెను?