కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆలయమును మరలా సందర్శించుట

ఆలయమును మరలా సందర్శించుట

అధ్యాయము 103

ఆలయమును మరలా సందర్శించుట

యెరికోనుండి వచ్చిన తర్వాత యేసు, ఆయన శిష్యులు బేతనియలో తమ మూడవరాత్రిని గడిపారు. ఇప్పుడు సోమవారము తెలతెలవారుచుండగానే, అనగా నీసాను 10న వారు యెరూషలేముకు ప్రయాణమగుదురు. యేసు ఆకలిగొనును. కావున ఆయన ఆకులతో నిండియున్న ఒక అంజూరపు వృక్షమును చూసినప్పుడు, దానికి కొన్ని అంజూరపు పండ్లున్నాయేమోనని చూచుటకు దానియొద్దకు వెళ్లును.

అంజూరపు కాపు జూన్‌ నెలలోగాని రాదు, అదేమో మార్చి నెలాఖరు. ఆ చెట్టుకు ఆకులు కాపుకాలమునకు ముందే వచ్చాయి. అయితే ఆకులు ముందే వచ్చినందున దానికి అంజూరపు పండ్లుకూడ ముందే వచ్చియుండునని యేసు భావించును. కాని ఆయనకు నిరాశ ఎదురయ్యెను. ఆకులు చెట్టుకు మోసకరమైన రూపమునిచ్చినవి. అప్పుడు యేసు చెట్టును శపించుచు, ఇట్లనును: “ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక.” యేసు తీసుకొనిన చర్య మరియు దాని ప్రాముఖ్యతయొక్క పరిణామములు మరుసటి ఉదయానికి తెలియవచ్చును.

అలా ప్రయాణిస్తూ త్వరలోనే, యేసు ఆయన శిష్యులు యెరూషలేముకు చేరుకొందురు. ఆయన ముందురోజు మధ్యాహ్నము పరీక్షించిన ఆలయమునకు వెళ్లును. అంతకుముందు మూడు సంవత్సరముల క్రితము అనగా, సా.శ. 30లో పస్కాపండుగకు వచ్చినప్పటివలెనే ఈ రోజు, ఆయన చర్యగైకొనును. ఆలయములో క్రయవిక్రయములు జరిగించువారిని తోలివేసి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీఠలను పడద్రోయును. దేవాలయము గుండా ఏపాత్రయు ఎవడును తీసికెళ్లుటను ఆయన అనుమతించలేదు.

దేవాలయములో రూకలు మార్చువారిని మరియు జంతువులను అమ్మువారిని ఖండించుచు, ఆయనిట్లనును: “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగుహగా చేసితిరి.” వారు దొంగలైయున్నారు ఎందుకనగా బలికొరకు కావలసిన జంతువులను వారినుండి కొనుట మినహా వేరే ప్రత్యామ్నాయములేని వ్యక్తులనుండి వారు విపరీతమైన మూల్యమును వసూలుచేయుదురు. కావున యేసు ఈ వ్యాపార వ్యవహారములను దోపిడిగా లేక దొంగతనముగా దృష్టించును.

ప్రధానయాజకులు, శాస్త్రులు మరియు ప్రజలలోని ముఖ్యులు యేసు చేసినదానిని వినినప్పుడు, వారు మరలా ఆయనను ఎలా చంపవలెనని వెదకుదురు. ఆ విధముగా వారు మార్చబడలేని వారని నిరూపించబడుదురు. అయినను, ప్రజలు ఆయనను వినుటకు ఎప్పుడు ఆయనయొద్ద ఉన్నందున, వారికి యేసును ఎట్లు అంతమొందించవలెనో అంతుబట్టలేదు.

సహజ ఇశ్రాయేలీయులతో పాటు, అన్యులుకూడ పస్కాపండుగను ఆచరించుటకు వచ్చారు. వీరు యూదామత ప్రవిష్ఠులు, అనగా వారు యూదామతమునకు మారిని వారని దాని భావము. స్పష్టముగా యూదామత ప్రవిష్ఠులైన కొంతమంది గ్రీసు దేశస్థులు, ఇప్పుడు ఫిలిప్పును సమీపించి యేసును చూడవలెనని అడుగుదురు. అలా కలిసికొనుట సరియేనా అని బహుశ అడుగుటకు, ఫిలిప్పు అంద్రెయయొద్దకు వెళ్లును. యేసు ఇంకను దేవాలయములోనే ఉన్నాడు గనుక, గ్రీసు దేశస్థులాయనను చూడగలరు.

తనకు ఇంకా కొద్దిరోజుల జీవితము మాత్రమే మిగిలియున్నదని యేసు ఎరిగియున్నాడు, కావున ఆయన తన పరిస్థితిని ఇట్లు వర్ణించును: “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోదుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.”

ఒక్క గోదుమగింజకు విలువతక్కువే. అయినను, అది భూమిలో నాటబడి, గింజగా దాని జీవితమును ముగించుచు, “చచ్చినయెడల” అప్పుడు దాని సంగతియేమి? అది ఆ పిమ్మట మొలకెత్తి, తగిన కాలమునకు అది పెద్దమొక్కగా పెరిగి ఎన్నెన్నో గోదుమ గింజలను ఉత్పత్తిచేయును. అదే విధముగా, యేసు కేవలము ఒక్క పరిపూర్ణ మనుష్యునిగా ఉన్నాడు. అయితే ఆయన దేవునియెడల నమ్మకముగావుండి మరణించినట్లయిన, తాను కలిగియున్న స్వయం-త్యాగ ఆత్మనే కలిగియున్న నమ్మకస్థులైన అనేకులకు నిత్యజీవమనుగ్రహించుటకు ఆయన ఆధారముగా తయారగును. అందుకే యేసు ఈ విధముగా చెప్పును: “తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనును.”

యేసు నిజంగా తననుగూర్చి మాత్రమే తలంచుటలేదు, ఏలయనగా ఆ తర్వాత ఆయనిట్లనును: “ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినయెడల నాతండ్రి అతని ఘనపరచును.” యేసును వెంబడించి ఆయనకు పరిచర్యచేయుట ఎంత అద్భుతమైన ప్రతిఫలమును తెచ్చును! అదేమనగా, క్రీస్తు రాజ్యమందు ఆయనతోపాటు పాలించు ఘనతను తండ్రిద్వారా పొందుటయే.

తాననుభవించనైయున్న గొప్ప శ్రమ మరియు మిగుల బాధాకరమైన మరణమునుగూర్చి ఆలోచిస్తు, యేసు ఇంకను ఇట్లనును: “ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును? తండ్రీ, ఈ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము.” ఆయన కొరకు వేచియున్నది తప్పించుకొన గలిగినదైతేనే! అయితే, ఆయన చెప్పునట్లుగా అది తప్పించుకోలేనిది: “అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని.” తన స్వంత బలిపూర్వక మరణముతోసహా, దేవుని ఏర్పాటు యంతటితో యేసు ఏకీభవిస్తున్నాడు. మత్తయి 21:12, 13, 18, 19; మార్కు 11:12-18; లూకా 19:45-48; యోహాను 12:20-27.

అది పండ్ల కాలము కాకపోయినను యేసు అంజూరపు పండ్లు ఉంటాయని ఎందుకు అనుకున్నాడు?

దేవాలయములో అమ్మువారిని యేసు ఎందుకు “దొంగలని” పిలిచెను?

ఏ విధముగా యేసు చనిపోవు గోదుమగింజను పోలియున్నాడు?

వేచియున్న శ్రమ మరియు మరణమునుగూర్చి యేసు ఎట్లు భావించును?