కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపమానములతో బోధించుట

ఉపమానములతో బోధించుట

అధ్యాయము 43

ఉపమానములతో బోధించుట

యేసు పరిసయ్యులను గద్దించినప్పుడు ఆయన కపెర్నహూములో ఉన్నట్లు స్పష్టమవుతుంది. అయితే తరువాత అదే రోజున ఆయన తానున్న గృహమును విడిచి సమీపమునగల గలిలయ సముద్రముయొద్దకు వెళ్లగా, జనసమూహములు అక్కడ గుమికూడియుందురు. అప్పుడు ఆయన దోనెయెక్కి కొంతదూరము వెళ్లి దరిన ఉన్న ప్రజలకు పరలోక రాజ్యమునుగూర్చి బోధింప నారంభించును. ఆయన ప్రజలకు తెలిసిన సంగతులను ఉపయోగించి అనేక ఉపమానములు లేక దృష్టాంతముల ద్వారా బోధించును.

మొదట, విత్తనములు విత్తు విత్తువాని ఉపమానమును యేసు చెప్పును. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా పక్షులు వాటిని తినివేయును. కొన్ని విత్తనములు రాతినేలను పడి, వేర్లు లేనందున, వచ్చిన మొలకులు సూర్యరశ్మికి ఎండిపోవును. ఇంకొన్ని ముండ్లపొదలలో పడగా వాటిని ముండ్లపొదలు అణచివేయును. చివరకు మంచి నేలను పడిన కొన్ని విత్తనములు నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలించును.

మరొక ఉపమానములో యేసు పరలోక రాజ్యమును ఒక మనుష్యుడు విత్తనములు విత్తుటకు పోల్చును. అతడు రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచునుండగా, అతనికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి, అటుతరువాత దానంతటదే ధాన్యము పండించును. పంట పండినప్పుడు అతడు పంట కోయును.

యేసు మూడవ ఉపమానముగా మంచివిత్తనములు విత్తిన ఒక మనుష్యునిగూర్చి చెప్పును. అయితే “మనుష్యులు నిద్రించుచుండగా,” శత్రువువచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోవును. అతని దాసులు వచ్చి గురుగులను పెరికివేయవలెనా అని ఆయనను అడిగినప్పుడు, అతడిట్లనును: ‘వద్దు అలా చేసినట్లయిన మీరు గోధుమ మొక్కలనుకూడ పీకివేయుదురు. కాబట్టి కోతకాలము వరకు వాటిని అలానే పెరగనియ్యుడి. అప్పుడు నేను కోతకోయువారికి గురుగులను వేరుగా కట్టలుకట్టి తగులబెట్టుడని, గోధుమలను కొట్లకు చేర్చుడని చెప్పుదును.’

సముద్రము ఒడ్డున తన ప్రసంగమును కొనసాగించుచు, యేసు జనసమూహములకు మరిరెండు ఉపమానములను చెప్పును. “పరలోక రాజ్యము” ఒకడు నాటిన ఆవగింజను పోలియున్నదని ఆయన వివరించును. అది మిగతా విత్తనములన్నింటిలో మిగుల చిన్నదైనను, అది కూరమొక్కలన్నింటికంటె పెద్దదగునని, పక్షులు దాని కొమ్మలయందు నివసించునంత పెద్ద చెట్టగునని ఆయన చెప్పును.

ఈనాడు కొందరు ఆవగింజకంటె చిన్నవైన గింజలు కలవని అభ్యంతరము చెప్పవచ్చును. అయితే యేసు వృక్షశాస్త్రములో పాఠము చెప్పుటలేదు. తనకాలములో గలిలయులు ఎరిగియున్న విత్తనములలో ఆవగింజ నిజముగా చిన్నదైయున్నది. కాబట్టి అది అద్భుతరీతిలో పెరుగునని యేసు చెప్పిన ఉపమానమును వారు గుణగ్రహించిరి.

చివరగా, యేసు “పరలోక రాజ్యమును” ఒక స్త్రీ, మూడుకుంచములలో పిండి అంతయు పులియువరకు దాచిపెట్టిన కొంచెము పుల్లని పిండితో పోల్చును. ఆ పులుపు అంతట వ్యాపించి పిండినంతటిని పులియజేస్తుందని ఆయన చెప్పును.

ఈ ఐదు ఉపమానములు చెప్పిన తర్వాత, యేసు జనసమూహములను పంపివేసి తిరిగి తాను ఉంటున్న ఇంటికి తిరిగివచ్చును. వెంటనే తన 12 మంది అపొస్తలులు ఇతరులు ఆయనయొద్దకు వచ్చెదరు.

యేసు ఉపమానములనుండి ప్రయోజనము పొందుట

సముద్ర తీరమున జనసమూహములకు యేసు ఉపన్యసించిన తదుపరి, శిష్యులు ఆయనయొద్దకువచ్చి ఉపదేశించుటలో ఆయన చేపట్టిన క్రొత్త పద్ధతినిగూర్చి తెలిసికొనవలెనని ఆసక్తిగావుందురు. ఆయన ఉపమానములను ఉపయోగించి ఉపదేశించుటను వారు ముందు విన్నారు, గానీ ఇంత విస్తృతముగా ఉపయోగించుటను ఎన్నడూ వినలేదు. గనుక వారు, “నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు?” అని అడుగుదురు.

ఆయనట్లు చేయుటకు గల ఒక కారణము ప్రవక్తమాటలను నెరవేర్చుటకే. “నేను నానోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను.” అయితే దీనికంటే ఇంకా కారణమున్నది. ఆయన ఉపయోగించిన ఉపమానములు ప్రజల హృదయ దృక్పధములను బహిర్గతము చేయుటకు సహాయపడును.

వాస్తవానికి, అనేకులు యేసు మంచి కథలు చెప్పేవాడని, అద్భుత కార్యములు చేయువాడని మాత్రమే ఆసక్తి చూపెడివారే గాని, ప్రభువుగా సేవింపదగిన వాడని, నిస్వార్థంగా అనుసరించదగిన వాడని కాదు. తమ జీవిత విధానములో లేక తమ దృక్పధములలో మార్పులు చేసికొనుటకు వారికి ఇష్టంలేదు. ఆ మేరకు వర్తమానము వారిలో చొచ్చుకొనిపోవుట వారికి ఇష్టంలేదు.

కాబట్టి యేసు ఇట్లనును: “ఇందు నిమిత్తమే నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను, . . . ఈ ప్రజల . . . హృదయము క్రొవ్వినది. వారు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపరు చూచుటమట్టుకు చూతురుగాని యెంతమాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.”

యేసు ఇంకను, “అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని” చెప్పును.

అవును, 12మంది అపొస్తలులు వారితోవున్న వారు గ్రహించు హృదయములు గలవారైయున్నారు. కాబట్టి యేసు వారితో ఇట్లనుచున్నాడు: “పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది, గాని వారికి అనుగ్రహింపబడలేదు.” అర్థము చేసికొనవలెనను కోరిక వారికున్నందున, యేసు తన శిష్యులకు విత్తువానిగూర్చిన ఉపమాన భావమును వివరించును.

“విత్తనము దేవుని వాక్యము,” హృదయము నేల అని యేసు చెప్పును. త్రోవప్రక్కన గట్టినేలలో విత్తబడిన విత్తనమునుగూర్చి చెప్పుచు ఆయనిట్లు వివరించును: “నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తికొని పోవును.”

మరోవైపున, రాతినేలను విత్తబడిన విత్తనమును పోలిన వారెవరనగా, వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. అయితే, అటువంటి వారి హృదయములలోనికి వాక్యము లోతుగా వేరుపారలేదు గనుక శోధనకాలములో లేదా శ్రమలు వచ్చినప్పుడు వీరు పడిపోవుదురు.

ముండ్లపొదలలో విత్తబడిన విత్తనము సంగతియేమనగా, అది వాక్యమును వినిన ప్రజలను సూచించుచున్నదని యేసు చెప్పును. అయితే, వీరు ఈ జీవన సంబంధమగు ఐహిక విచారములు, ధనవ్యామోహము, వినోదములకు బానిసలగుచున్నారు గనుక వారు పూర్తిగా అణచివేయబడి పరిపూర్ణతకు రాలేరు.

చివరకు మంచినేలను పడిన విత్తనములు, శ్రేష్ఠమైన సహృదయముతో వాక్యమును విని దానిని పదిలపరచుకొని సహనముతో ఫలించిన వారిని సూచించుచున్నవని యేసు చెప్పుచున్నాడు.

తన ఉపదేశముల భావమును గ్రహించుటకు యేసును వెదకిన ఈ శిష్యులు ఎంత ధన్యులు! ఇతరులకు సత్యము నేర్పించుటకుగాను తన ఉపమానములను అర్థము చేసికొనవలెనని యేసు ఉద్దేశించెను. “దీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని, కుంచము క్రిందనైనను, మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా” అని అడిగి, యేసు ఇంకను ఇట్లనును: “మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి.”

ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట

విత్తువాని ఉపమాన భావమును యేసునుండి తెలిసికొనిన తర్వాత, శిష్యులు ఇంకను ఎక్కువ తెలిసికొనుటకు ఇష్టపడుదురు. వారువచ్చి, “పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పుమనిరి.”

సముద్రతీరముననున్న జనసమూహపు దృక్పథమునకు, శిష్యుల దృక్పథము ఎంత భిన్నముగాయున్నది! వారైతే తమకు చెప్పబడిన పైపైసంగతులతో తృప్తిచెంది, ఆ ఉపమానముల వెనుకనున్న భావమును తెలిసికొను ఆతురతను చూపలేదు. అందుచేత ప్రశ్నించి తెలిసికొనుటకు ఇంటిలోని తన యొద్దకు వచ్చిన తన శిష్యులకును సముద్రతీరమునున్న ఆ ప్రేక్షకులకును మధ్యగల వ్యత్యాసమును చూపుతూ, యేసు యిలా చెప్పును:

“మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.” అవును, యేసుపట్ల నిజమైన ఆసక్తినిచూపి, ఆయనపై అవధానమును నిలిపినందున, శిష్యులు మరి ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడిరి. ఆ విధముగా తన శిష్యులు అడిగినదానికి సమాధానముగా, యేసు యిలా వివరించును:

“మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యకుమారులు; గురుగులు దుష్టుని కుమారులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.”

తన ఉపమానమందలి ప్రతిభాగమును గుర్తించిన తర్వాత, తదుపరి ఫలితమును ఆయన వివరించును. యుగసమాప్తియందు కోతకోయువారు లేక దేవదూతలు నిజమైన “రాజ్యకుమారుల’ నుండి గురుగులవంటి నామమాత్రపు క్రైస్తవులను వేరుచేయుదురు. అప్పుడు “దుష్టుని కుమారులు” నాశనమునకు గుర్తింపబడగా, దేవుని రాజ్యకుమారులు, “నీతిమంతులు” తమ తండ్రి రాజ్యములో తేజరిల్లుదురు.

ఆ తరువాత ప్రశ్నించి తెలిసికొను తన శిష్యులకు యేసు మరి మూడు ఉపమానములను చెప్పును. మొదట ఆయనిలా చెప్పును: “పరలోకరాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.”

“మరియు పరలోకరాజ్యము, మంచిముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానికొనును” అనికూడ ఆయన చెప్పును.

యేసు తనంతటతానే దాచబడిన ధనమును, అమూల్యమైన ముత్యమును కనుగొనిన మనుష్యుని పోలియున్నాడు. దీనుడైన మనుష్యునిగా తయారగుటకు తనకున్నదంతయు అమ్మినరీతిగా పరలోకములో తనకున్న గౌరవనీయమైన స్థానమును వదలుకున్నాడు. ఆ పిమ్మట, దేవుని రాజ్యపాలకునిగా అర్హత సంపాదించుటకు భూమిపై మనుష్యునిగా, ఆయన నిందను మరియు ద్వేషపూరితమైన హింసను అనుభవించాడు.

ఆలాగే, క్రీస్తుతో సహపరిపాలకునిగా, లేక భూమిపై రాజ్య పౌరునిగావుండు మహాగొప్ప ప్రతిఫలమును పొందుటకై సమస్తమును అమ్ము సవాలు యేసు అనుచరులముందుకూడ ఉంచబడియున్నది. దేవుని రాజ్యములో భాగము వహించుట అమూల్యమైన ధనము, లేక ప్రశస్తమైన ముత్యమువలె మన జీవితములో అన్నింటికన్న మిక్కిలి విలువైనదని మనము యెంచుదుమా?

చివరగా, యేసు “పరలోకరాజ్యమును” ప్రతివిధమైన చేపలను పట్టు వలకు పోల్చాడు. చేపలను వేరుచేయునప్పుడు మంచివాటిని ఉంచుకొని చెడ్డవాటిని పారవేయుదురు. అదేరీతిగా, యుగసమాప్తియందును ఉండునని యేసు చెప్పును; దేవదూతలు దుష్టులను నాశనము చేయుటకు వారిని నీతిమంతులనుండి వేరుచేయుదురు.

తన తొలి శిష్యులను “మనుష్యులను పట్టుజాలరులని” పిలిచి తానే స్వయముగా ఈ చేపలు పట్టుపనిని యేసు ప్రారంభించెను. చేపలు పట్టుపని శతాబ్దములనుండి దేవదూతల ఆధ్వర్యమున కొనసాగుచున్నది. చివరకు అభిషక్త క్రైస్తవుల సంఘంతో పాటు, క్రైస్తవులమని చెప్పుకొను భూమిపైనున్న సంస్థలన్నింటిని సూచించు ఈ “వలను” దరికి లాగు కాలము వచ్చును.

పనికిరాని చేపలు నాశనమునకు త్రోసివేయబడినను, కృతజ్ఞతతో ‘మంచి చేపలు’ భద్రపరచబడును. జ్ఞానవివేచనల కొరకు యేసు శిష్యులు చూపినటువంటి నిజమైన శ్రద్ధను మనము కనబరచుటద్వారా, ఎక్కువ ఉపదేశముతో దీవించబడుటయే గాక, నిత్యజీవముతో మనము దేవునిచే ఆశీర్వదింపబడుదుము. మత్తయి 13:1-52; మార్కు 4:1-34; లూకా 8:4-18; కీర్తన 78:2; యెషయా 6:9, 10.

ఎప్పుడు మరియు ఎక్కడ జనసమూహములతో ఆయన ఉపమానములతో మాట్లాడును?

ఏ ఐదు ఉపమానములనుగూర్చి యేసు ఇప్పుడు జనసముహములతో చెప్పును?

ఆవగింజ విత్తనములన్నింటిలోకెల్లా అతి చిన్నదని యేసు ఎందుకు చెప్పును?

యేసు ఎందుకు ఉపమానములతో మాట్లాడును?

తాము జనసమూహములతో వ్యత్యాసమును కలిగియున్నామని యేసు శిష్యులు ఎట్లు తమనుతాము చూపించుకొందురు?

విత్తువాని ఉపమానమునకు యేసు ఎటువంటి వివరణ ఇచ్చును?

సముద్రతీరమునున్న జనసమూహమునకు శిష్యులు ఎట్లు భిన్నముగా యున్నారు?

విత్తువాడు, పొలము, మంచివిత్తనము, శత్రువు, కోత, కోతకోయువారు దేనిని లేక ఎవరిని సూచిస్తున్నారు?

యేసు ఏ ఇతర మూడు ఉపమానములను యిచ్చును, మరియు వాటినుండి మనము ఏమి నేర్చుకొనగలము?