కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏడవ దినమున ఇంకను బోధించుట

ఏడవ దినమున ఇంకను బోధించుట

అధ్యాయము 68

ఏడవ దినమున ఇంకను బోధించుట

పర్ణశాలల పండుగయొక్క చివరిదినమైన ఏడవదినము ఇంకా మిగిలియున్నది. దేవాలయములో “కానుక పెట్టె” అని పిలువబడిన ప్రదేశములో యేసు బోధించుచున్నాడు. ఇది స్పష్టంగా, ప్రజలు కానుకలువేయు పెట్టెలుంచబడు స్త్రీల ఆవరణలో ఉన్నది.

పండుగ దినములలో ప్రతి రాత్రి దేవాలయములోని ఈ ప్రాంతములో ప్రత్యేక దీపకాంతిని ఏర్పాటుచేయుదురు. తైలముతో నింపబడిన నాలుగేసి పెద్దగిన్నెలుగల, నాలుగు పెద్ద దీపస్తంభములు ఇక్కడ ఏర్పాటుచేయబడును. ఆ నాలుగు దీపస్తంభములకు ఉన్న 16 పెద్దగిన్నెలలో మండు తైలము వెలుగుచు ఆ చుట్టువున్న ప్రాంతములకు సరిపడునంత వెలుగిస్తూ రాత్రిపూట చాలాదూరము వరకు కనిపించును. ఇప్పుడు యేసు చెప్పునది ఆయనను వినువారికి ఈ వెలుగునుగూర్చి గుర్తుచేయవచ్చును. “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని” యేసు ప్రకటించును.

దానికి పరిసయ్యులు, “నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని” అభ్యంతరము చెప్పుదురు.

వారికి జవాబుచెప్పుచు యేసు ఇట్లనును: “నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” ఆయనింకను, “నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.”

“నీ తండ్రి ఎక్కడ?” పరిసయ్యులు తెలుసుకొన గోరుదురు.

యేసు, “మీరు నన్నైనను నాతండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగియుంటిరా నా తండ్రినికూడ ఎరిగియుందురని” వారికి జవాబిచ్చును. పరిసయ్యులింకను యేసును బంధించవలెనని చూసిరిగాని, ఎవరును ఆయనను పట్టుకొనలేదు.

యేసు మరలా, “నేను వెళ్లిపోవుచున్నాను; . . . నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.”

దానికి యూదులు, “‘నేను వెళ్లుచోటికి మీరు రాలేరని’ ఈయన చెప్పుచున్నాడే; తన్నుతానే చంపుకొనునా?” అని ఆలోచించసాగుదురు.

అప్పుడు యేసు, “మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను” అని వారికి వివరించుచు ఆయన ఇంకను ఇట్లనును: “నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురు.”

యేసు తన మానవపూర్వ ఉనికిని గూర్చియు, తానే వాగ్దానము చేయబడిన మెస్సీయ, లేక క్రీస్తునని సూచించుచున్నాడు. అయినప్పటికిని, వారు నిస్సందేహముగా ధిక్కార ధోరణిలో, “నీవెవరవు” అని అడుగుదురు.

వారు తిరస్కరించినను యేసు, “మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే” అని జవాబిచ్చును. ఆయనింకను వారితో ఇట్లనును: “నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. . . . మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.”

యేసు ఈ సంగతులు చెప్పుచుండగా అనేకులు ఆయనయందు విశ్వాసముంచుదురు. కాగా ఆయన వారితో, “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను.”

ఆయన వ్యతిరేకులు మాటకలిపి, “మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి దాసులై యుండలేదే, ‘మీరు స్వతంత్రులుగా చేయబడుదురని’ యేల చెప్పుచున్నావు” అని అందురు.

యూదులు తరచు పరదేశుల అధికారము క్రింద ఉన్ననూ, తమను అణచివేతకు గురిచేయు యజమాని ఒకరు తమమీద ఉన్నారని గుర్తించరు. బానిసలని పిలువబడుటకు వారు ఒప్పుకొనరు. అయితే వారు నిజముగా బానిసలేనని యేసు సూచించుచున్నాడు. ఏ విధముగా? “పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని” యేసు వారికి చెప్పును.

పాపమునకు తాము దాసులమని అంగీకరించకపోవుట యూదులను ప్రమాదకరమైన స్థానములో ఉంచును. “దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసము చేయునని” యేసు వివరించును. దాసుడు వారసత్వపు హక్కులు కలిగియుండడు గనుక, అతడు ఏ సమయములోనైనను వెళ్లగొట్టబడు ప్రమాదమందుండును. కేవలము జన్మించిన కుమారుడు లేక దత్తత తీసుకొనబడిన కుమారుడు మాత్రమే ఆ యింట “ఎల్లప్పుడును” అనగా అతను జీవించినంత కాలము ఉండును.

కాబట్టి యేసు ఇంకను ఇట్లనును: “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.” ఆ విధముగా, ప్రజలను స్వతంత్రులనుగా చేయు సత్యము, కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సత్యమే. ఆయన పరిపూర్ణ మానవ జీవితముయొక్క బలిద్వారానే ఎవరైనను మరణకరమగు పాపమునుండి స్వతంత్రులు కాగలరు. యోహాను 8:12-36.

ఏడవ దినమున యేసు ఎక్కడ బోధించును, రాత్రిపూట అక్కడ ఏమిచేయబడును, మరియు యేసు బోధకు అది ఎట్లు సంబంధమును కలిగియున్నది?

తన మూలమునుగూర్చి యేసు ఏమిచెప్పును, ఆయన గుర్తింపునుగూర్చి ఇది ఏమి వెల్లడిచేయును?

ఏ విధముగా యూదులు దాసులై యున్నారు, అయితే ఏ సత్యము వారిని స్వతంత్రులను చేయును?