ఒక వివాదము చెలరేగును
అధ్యాయము 115
ఒక వివాదము చెలరేగును
సాయంకాలము అంతకుముందు, వినయముతో సేవచేయుట సంబంధముగా తన అపొస్తలుల పాదములు కడుగుటద్వారా యేసు ఒక చక్కని పాఠమును బోధించును. ఆ తర్వాత, ఆయన తన రానైయున్న మరణమునుగూర్చిన జ్ఞాపకార్థ ఆచరణను పరిచయము చేయును. ఇప్పుడు, ఇంతకుముందే జరిగిన దాని దృష్ట్యా, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగును. ఆయన అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అను వివాదములో పడుదురు! స్పష్టముగా ఇది అంతకుముందునుండి వచ్చుచున్న వివాదములో భాగమైయున్నది.
గుర్తుతెచ్చుకొనుము, యేసు కొండమీద రూపాంతరము పొందిన తర్వాత, అపొస్తలులు తమలో ఎవరు గొప్పయని వాదించుకొనిరి. అంతేకాకుండ, యాకోబు మరియు యోహాను రాజ్యములో ప్రముఖ స్థానముల కొరకు అడిగినప్పుడుకూడ అపొస్తలులలో విభేదము కలిగెను. ఇప్పుడు, ఆయన వారితోవున్న ఈ చివరి రాత్రి, వారు మరలా జగడమాడుకొనుట చూచినప్పుడు యేసు ఎంతగా విచారపడును! ఆయన ఏమిచేయును?
వారి ప్రవర్తన విషయమై అపొస్తలులను గద్దించుటకు బదులు, యేసు మరలా ఒకసారి ఓపికగా వారితో ఇట్లు తర్కించును: “అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు. వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగుండరాదు. . . . గొప్పవాడెవడు భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తిన కూర్చుండువాడే గదా?” అటుపిమ్మట, తన మాదిరిని వారికి గుర్తుచేయుచు, ఆయనిట్లనును: “నేను మీ మధ్య పరిచర్యచేయువానివలె ఉన్నాను.”
వారు అసంపూర్ణులైనను, అపొస్తలులు యేసుకు కలిగిన పరీక్షలయందు ఆయనను హత్తుకొనియున్నారు. కావున ఆయన వారితో ఇట్లనును: “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” యేసు మరియు ఆయన యథార్థ అనుచరుల మధ్యనున్న ఈ వ్యక్తిగత నిబంధన వారిని ఆయన రాజ్యాధికారమునందు ఆయనతో చేర్చుచున్నది. కేవలము పరిమిత సంఖ్యయగు 1,44,000 మంది మాత్రమే చివరకు రాజ్యము కొరకైన ఈ నిబంధనలోనికి తీసికొనబడుదురు.
అపొస్తలులకు రాజ్యమందు క్రీస్తుతో భాగము వహించు అద్భుతకరమైన ఉత్తరాపేక్ష ఇవ్వబడినను, వారు ప్రస్తుతము ఆత్మీయముగా బలహీనముగా ఉన్నారు. “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతర పడెదరు” అని ఆయన అనును. అయితే పేతురు పక్షముగా తాను ప్రార్థించితినని అతనితో చెప్పుచు, యేసు ఇట్లు ఉద్బోధించును: “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము.”
యేసు ఇట్లు వివరించును: “పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును; ‘మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని’ నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”
“ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావు?” అని పేతురు అడుగును.
అందుకు యేసు, “నేను వెళ్లుచున్న చోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని” ప్రత్యుత్తరమిచ్చును.
“ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీవెంట రాలేను?” పేతురు తెలిసికొనగోరును. “నీకొరకు నా ప్రాణము పెట్టుదునని” ఆయనతో అనును.
యేసు, “నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”
దానికి పేతురు అడ్డు చెప్పుచు, “నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను.” ఇతర అపొస్తలులును అదేవిధముగా చెప్పుటలో పేతురుతో కలిసినప్పుడు, అతను ఇట్లు గొప్పలుపోయెను: “నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడను.”
సంచియు జాలెయు లేకుండ అపొస్తలులను ప్రచారము చేయుటకు గలిలయకు పంపిన సమయమును సూచించుచు, యేసు వారినిట్లడుగును: “మీకు ఏమైనను తక్కువాయెనా?”
“లేదు” అని వారందురు.
“ఇప్పుడయితే సంచిగలవాడు సంచియు జాలెయు తీసికొనిపోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తికొనుక్కొనవలెను; ‘ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను’ అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి యున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానని” ఆయన అనును.
కీడుచేయు వారితో, లేక అక్రమకారులతో తాను వ్రేలాడదీయబడు సమయమును యేసు సూచించుచున్నాడు. అంతేకాకుండా ఆ తర్వాత తన అనుచరులు తీవ్రమైన హింసను ఎదుర్కొందురని కూడా ఆయన సూచించుచున్నాడు. వారు “ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనిరి.”
“చాలునని” అయన జవాబిచ్చును. మనము చూడబోవునట్లు, వారితో కత్తులుండుట త్వరలోనే యేసు మరొక ప్రాముఖ్యమైన పాఠమును వారికి బోధించుటకు అనుమతించును. మత్తయి 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:24-38; యోహాను 13:31-38; ప్రకటన 14:1-3.
▪ అపొస్తలుల వాగ్వివాదము ఎందుకు ఆశ్చర్యము కల్గించునదై యున్నది?
▪ ఆ వాగ్వివాదముతో యేసు ఎట్లు వ్యవహరించును?
▪ తన శిష్యులతో యేసుచేయు నిబంధనద్వారా ఏమి నెరవేర్చబడును?
▪ ఏ క్రొత్త ఆజ్ఞను యేసు ఇచ్చును, ఇది ఎంత ప్రాముఖ్యమై యున్నది?
▪ పేతురు ఎటువంటి అతినమ్మకమును ప్రదర్శించును, కాగా యేసు ఏమిచెప్పును?
▪ యేసు అంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు సంచియు జాలెయు తీసికొనిపోవలెనని ఉపదేశించిన దానికి ఎందుకు భేదము కలదు?