కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కనికరమును గూర్చి ఒక పాఠము

కనికరమును గూర్చి ఒక పాఠము

అధ్యాయము 40

కనికరమును గూర్చి ఒక పాఠము

ఇటీవలనే విధవరాలి కుమారుని పునరుత్థానము చేసిన పట్టణమగు నాయీనులో లేక ఆ సమీప పట్టణమునో యేసు సందర్శించుచుండవచ్చును. అంతటి ఆశ్చర్యకార్యములను చేయుచున్న ఆయనను దగ్గరగా చూడవలెనను కోరికతో పరిసయ్యుడైన సీమోను, యేసును భోజనము చేయుటకు ఆహ్వానించును.

అక్కడున్న వారికి పరిచర్య చేయుటకు ఆ సందర్భము అనువుగాయుండుట దృష్ట్యా, సుంకరులతో పాపులతో భోజనముచేయుటకు ఆహ్వానింపబడినప్పుడు అంగీకరించినట్లే, యేసు ఈ ఆహ్వానమునుకూడ అంగీకరించెను. అయితే, యేసు సీమోను ఇంట ప్రవేశించినప్పుడు, సాధారణముగా అతిథులను చేర్చుకొనునప్పుడు ఇచ్చు హృదయపూర్వక మర్యాద ఆయనకివ్వబడలేదు.

దుమ్మునిండిన రహదార్లలో ప్రయాణం చేయుటవలన పాదరక్షలున్న పాదములు వేడెక్కి మురికియగును గనుక, ఆతిథ్య కార్యక్రమములలో చల్లని నీళ్లతో అతిథుల కాళ్లు కడుగుట ఒక ఆచారము. అయితే యేసు వచ్చినప్పుడు ఆయన కాళ్లు కడుగబడలేదు. లేక సాధారణ ఆచారము ననుసరించి, ఆయనకు ఆహ్వానమును తెలియజేయు ముద్దు పెట్టబడలేదు. ఆలాగే ఆచారప్రకారము ఆయన తలవెంట్రుకలకు నూనెయు పూయబడలేదు.

భోజన సమయమున, అతిథులు బల్లయొద్ద కూర్చొనగా, ఆహ్వానింపబడని ఒక స్త్రీ నెమ్మదిగా ఆ గదిలోనికి ప్రవేశించెను. ఆమె అవినీతికరమైన జీవితమును జీవించుచున్నదని ఆ పట్టణములో అందరికి తెలుసు. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న వారందరు విశ్రాంతి కొరకు తనయొద్దకు రావలెనని’ ఇచ్చిన ఆహ్వానముతో సహా, ఆమె బహుశ యేసు బోధలను వినియుండవచ్చును. తాను చూచి, వినినవాటినిబట్టి కదిలించబడినదై, ఆమె ఇప్పుడు యేసును కనుగొనును.

ఆ స్త్రీ వెనుకగా యేసునొద్దకు వచ్చి, ఆయన పాదముల దగ్గర మోకరిల్లి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో వాటిని తడిచి, ఆయన పాదములను ఆప్యాయముగా ముద్దుపెట్టుకుంటు, తనతో తెచ్చిన బుడ్డిలోనుంచి అత్తరుతీసి, ఆయన పాదములకు దానిని పూసెను. సీమోను దీనినంతటిని అయిష్టముగా గమనించుచు, “ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో, ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.”

అతని ఆలోచనను గ్రహించి యేసు, “సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనెను.”

అందుకు అతడు, “బోధకుడా, చెప్పుమనెను.”

యేసు ప్రారంభించి, “అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును, మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువ ప్రేమించునో చెప్పుమని అడిగెను.”

అసందర్భముగా కన్పించుచున్న ఈ ప్రశ్నకు బహుశ నిర్లక్ష్యముగా, “అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పెను.”

అందుకు యేసు, “నీవు సరిగా యోచించితివని” చెప్పి, ఆ స్త్రీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను: “ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటినుండి ఈమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.”

ఆ విధముగా ఆ స్త్రీ తన గత అవినీతి ప్రవర్తన విషయమై హృదయపూర్వక పశ్చాత్తాపమునకు తగిన రుజువునిచ్చెను. కాబట్టి యేసు ముగింపుగా, “ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను.”

యేసు అవినీతిని క్షమించుచున్నాడని లేక చూసిచూడనట్టు ఊరుకుంటున్నాడని ఎంతమాత్రము కాదు. బదులుగా, ఈ సంఘటన జీవితములో తప్పులుచేసి వాటివిషయమై దుఃఖించి, విశ్రాంతి కొరకు క్రీస్తునొద్దకు ఎవరు వత్తురో అట్టివారిని ఆయన ఎట్లు దయతో అర్థము చేసికొనునో తెలియజేయుచున్నది. ఆ స్త్రీకి నిజమైన సేదదీర్పును కలుగజేయుచు యేసు ఆమెతో ఇట్లనును: “నీ పాపములు క్షమింపబడియున్నవి. . . . నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుము.” లూకా 7:36-50; మత్తయి 11:28-30.

యేసుకు ఆతిథ్యమిచ్చిన సీమోను, ఆయనను ఏ విధముగా చేర్చుకొనెను?

యేసును ఎవరు వెదికిరి, ఎందుకు?

యేసు ఏ ఉపమానము చెప్పెను, మరియు ఆయన దానిని ఎట్లు అన్వయించెను?