కపెర్నహూములోని ఇంటికి తిరిగివచ్చుట
అధ్యాయము 26
కపెర్నహూములోని ఇంటికి తిరిగివచ్చుట
ఇప్పటికే యేసుయొక్క పేరు ప్రఖ్యాతులు దూర ప్రాంతములకు వ్యాపించినవి. ఆయన నివసించిన ప్రాంతములు ప్రయాణమునకు అననుకూలంగా ఉన్నప్పటికిని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనయొద్దకు వచ్చుచుండిరి. అయితే కొన్నిదినముల తర్వాత, ఆయన గలిలయ సముద్ర తీరముననున్న కపెర్నహూమునకు తిరిగివచ్చును. ఆయన తిరిగి వచ్చెనన వార్త వేగముగా ఆ పట్టణమంతయు వ్యాపించును, కాగా ఆయనవున్న ఇంటికి అనేకులు వచ్చుదురు. యెరూషలేమంత దూరమునుండికూడ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అక్కడకు వచ్చుదురు.
ఆ జనసముహము ఎంత ఎక్కువగాయుండెనంటే, ద్వారమునొద్ద ప్రజలు క్రిక్కిరిసిపోవుదురు, వేరే ఎవరును లోనికి ప్రవేశించుటకు స్థలము లేదు. నిజముగా గుర్తుంచుకొనదగు సంఘటన అక్కడ జరుగబోవుచుండెను. ఈ సందర్భములో జరుగు సంగతి చాలాప్రాముఖ్యమైయున్నది, ఏలయనగా మానవ బాధకు కారణమైన దానిని తీసివేసి, తాను ఎంపిక చేసుకొనువారందరికి ఆరోగ్యమును పునరుద్ధరించు శక్తి యేసుకు కలదని గుణగ్రహించుటకు అది మనకు సహాయము చేయును.
యేసు ఆసమూహమునకు బోధించుచుండగా, నలుగురు మనుష్యులు ఒక మంచముమీద పక్షవాయువు గలవానిని మోసికొని ఆ ఇంటికి వచ్చుదురు. తమ స్నేహితుని యేసు స్వస్థపరచవలెనని వారు కోరుకొనిరి, అయితే చాలామంది కూడియున్నన, వారు లోనికి వెళ్లలేకపోవుదురు. ఎంత నిరుత్సాహకరము! అయినను వారు తమ ప్రయత్నమును విరమించుకొనలేదు. వారు సమతలముగావున్న ఇంటిపైకప్పునకు ఎక్కివెళ్లి, దానికి ఓ సందుచేసి, పక్షవాయువుగలవానిని మంచముతోసహా యేసుకు ప్రక్కగా దించుదురు.
ఆటంకము కలిగినందుకు యేసు కోపగించెనా? ఎంతమాత్రము లేదు! బదులుగా, ఆయన వారి విశ్వాసమునకు బహుగా ముగ్ధుడయ్యెను. ఆయన పక్షవాయువుగలవానితో, “నీ పాపములు క్షమింపబడియున్నవని” చెప్పును. అయితే యేసు ముగా పాపములు క్షమించగలడా? అలా అని శాస్త్రులు పరిసయ్యులు తలంచరు. వారు “ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు?” అని తమ హృదయములలో ఆలోచించుకొందురు.
వారి ఆలోచనలను ఎరిగినవాడై, యేసు వారితో ఇట్లనెను: “మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువుగలవానితో, ‘నీ పాపములు క్షమించబడియున్నవని’ చెప్పుట సులభమా? లేక ‘నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని’ చెప్పుట సులభమా?”
ఆ తర్వాత, తనకు భూమిమీద పాపములు క్షమించు అధికారము కలదనియు, తను నిజముగా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప వ్యక్తియని వెల్లడిచేయు అసాధారణమైన క్రియను ప్రదర్శించి, తనను విమర్శించువారితో సహా జనసమూహమంతయు దానిని చూచునట్లు ఆయన చేయును. ఆయన పక్షవాయువుగలవానివైపు తిరిగి అతనితో, “నీవు లేచి నీ పరుపెత్తికొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.” తక్షణమే అతడట్లు చేసి, పరుపెత్తికొని వారందరియెదుట నడచి బయటికి వెళ్లును! ప్రజలు విభ్రాంతినొంది, “మనమీలాటి కార్యములు ఎన్నడును చూడలేదని” చెప్పుచు దేవుని మహిమపరచుదురు.
రోగము పాపముతో సంబంధము కలిగియున్నదని, ఆలాగే పాపములు క్షమించబడుట శరీర ఆరోగ్యమును సంపాదించుకొనుటకు సంబంధమున్నదని యేసు ప్రస్తావించుటను మీరు గమనించారా? మన మొదటి తండ్రియైన ఆదాము పాపము చేశాడని, ఆ పాపముయొక్క పరిణామములగు వ్యాధులను, మరణమును మనము వారసత్వముగా పొందియున్నామని బైబిలు వివరించుచున్నది. అయితే దేవునిరాజ్య పరిపాలనలో, దేవుని ప్రేమించి, ఆయనను సేవించువారందరి పాపములను యేసు క్షమించును, కాగా పాపము తీసివేయబడును. అది ఎంత శ్రేష్ఠమైయుండును! మార్కు 2:1-12; లూకా 5:17-26; మత్తయి 9:1-8; రోమీయులు 5:12, 17-19.
▪ ఏ సందర్భములో నిజముగా గుర్తుంచుకొనదగు ఒక సంఘటన జరుగును?
▪ పక్షవాయువుగల వ్యక్తి యేసును ఎట్లుచేరెను?
▪ మనమందరము ఎందుకు పాపులమైయున్నాము, అయితే మన పాపక్షమాపణ మరియు పరిపూర్ణ ఆరోగ్యము సాధ్యమను నిరీక్షణను యేసు ఎట్లు ఇచ్చెను?