కానాలో ఉండగా చేసిన రెండవ అద్భుతము
అధ్యాయము 20
కానాలో ఉండగా చేసిన రెండవ అద్భుతము
యూదయలో విస్తృతముగా ప్రచారసేవను జరిగించి, తన స్వంత ఊరికి తిరిగివచ్చినప్పుడు యేసు విశ్రాంతి తీసికొనలేదు. బదులుగా తాను పెరిగిన ప్రాంతమగు గలిలయలో ఆయన మరి గొప్పదైన పరిచర్యను ఆరంభించును. అయితే ఆయన శిష్యులు ఆయనతో ఉండుటకు బదులు, తమ స్వంత కుటుంబములకు మరియు తమ పూర్వ వృత్తులకు తిరిగివెళ్లుదురు.
యేసు ఏ వర్తమానమును ప్రకటించుటకు ఆరంభించును? దీనిని: “దేవుని రాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొంది సువార్తయందు విశ్వాసముంచుడి.” వచ్చిన ప్రతిస్పందన ఎలావున్నది? గలిలయులు యేసును చేర్చుకొందురు. అందరు ఆయనను గౌరవింతురు. అయితే ప్రత్యేకముగా ఆయన వర్తమానమునుబట్టి కాదు, గాని వారిలో అనేకులు కొన్నినెలల క్రితము పస్కాపండుగ సమయమున యెరూషలేములో ఆయన చేసిన సూచకక్రియలను చూసిరి గనుక వారట్లు చేసారు.
యేసు తన గొప్ప గలిలయ పరిచర్యను స్పష్టముగా కానాలో ఆరంభిస్తాడు. మీరు గుర్తుతెచ్చుకొనవచ్చును, అంతకుముందు, యూదయనుండి తిరిగివచ్చినప్పుడు వివాహ విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చెను. ఈ రెండవ పర్యాయము, రాజైన హేరోదు అంతిప ప్రభుత్వ అధికారి కుమారుడు బహు రోగియైయుండెను. యేసు యూదయనుండి కానాకు వచ్చెనను సంగతివిని, ఆ అధికారి కపెర్నహూములోని తనయింటినుండి ప్రయాణమై యేసును కలిసికొనుటకు వచ్చును. దుఃఖక్రాంతుడై అతడు ఇట్లు వేడుకొనును: ‘నా కుమారుడు చనిపోకముందే, దయచేసి వెంటనే రావలెను.’
‘ఇంటికి తిరిగి వెళ్లుము, నీ కుమారుడు స్వస్థపరచబడెను!’ అని యేసు అతనికి ప్రత్యుత్తరమిచ్చును. హేరోదుయొక్క ఆ అధికారి అది నమ్మి తన ఇంటికి తిరుగు ప్రయాణమగును. మార్గ మధ్యములోనే అతని సేవకులు అతనికి ఎదురువచ్చి, అతని కుమారుడు బాగుపడెనని, అంతా సక్రమముగా ఉన్నదని అతనికి తెలియజేయుదురు. ‘ఏ గంటకు వాడు బాగుపడెనని’ ఆయన వారిని అడుగును.
‘నిన్న రమారమి ఒంటిగంటకు’ అని వారు జవాబిత్తురు.
‘నీ కుమారుడు బాగుపడెను!’ అని యేసు తనతో చెప్పిన గంట అదేయని ఆ అధికారి గ్రహించెను. ఆ పిమ్మట ఆ అధికారి, అతని యావత్ కుటుంబము క్రీస్తు శిష్యులైరి.
ఆ విధముగా యేసు యూదయనుండి తిరిగివచ్చెనని సూచించుచు కానాలో రెండుమార్లు అద్భుతకార్యములను జరిగించెను గనుక అది అనుగ్రహము పొందిన ప్రదేశమాయెను. అయితే, అప్పటివరకు ఆయన చేసిన అద్భుతకార్యములు అవిమాత్రమే కావు గాని, ఆయన గలిలయకు తిరిగివచ్చిన సంగతిని అవి సూచించినందున అవి గుర్తించదగినవాయెను.
యేసు ఇప్పుడు నజరేతులో తన ఇంటికి బయలుదేరును. ఆయన కొరకు అక్కడ ఏమివేచియున్నది? యోహాను 4:43-54; మార్కు 1:14, 15; లూకా 4:14, 15.
▪ యేసు గలిలయకు తిరిగివచ్చినప్పుడు, తన శిష్యులకు ఏమి జరుగును, మరియు ప్రజలు ఆయనను ఎట్లు చేర్చుకొందురు?
▪ యేసు ఏ అద్భుతము చేయును, అందు చేరియున్నవారిపై అది ఎలాంటి ప్రభావము చూపును?
▪ అట్లు కానా యేసువలన ఎట్లు అనుగ్రహం పొందును?