కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుష్ఠరోగి యెడల కనికరము చూపుట

కుష్ఠరోగి యెడల కనికరము చూపుట

అధ్యాయము 25

కుష్ఠరోగి యెడల కనికరము చూపుట

యేసు, ఆయన నలుగురు శిష్యులు గలిలయ పట్టణములను సందర్శించుచుండగా, ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన కార్యములనుగూర్చిన సమాచారము ఆ ప్రాంతమంతయు వ్యాపించును. ఆయన కార్యములనుగూర్చిన వార్త ఒక కుష్ఠరోగివున్న పట్టణమునకును చేరును. వైద్యుడైన లూకా అతన్ని “కుష్ఠరోగముతో నిండిన” వాడని వర్ణించెను. ఈ భయంకరమైన వ్యాధి తీవ్రతరమైనప్పుడు నెమ్మదిగా శరీరమందలి వివిధ అవయవములు వికారముగా మారును. కావున ఈ కుష్ఠరోగి బహుదీన స్థితిలో వున్నాడు.

యేసు ఆ పట్టణము చేరినప్పుడు ఈ కుష్ఠరోగి ఆయనను సమీపించును. దేవుని నియమము ప్రకారము ఇతరులు అతనికి సమీపముగావచ్చి వ్యాధి వారికి సోకకుండ జాగ్రత్తపడునట్లు, హెచ్చరికగా కుష్ఠరోగి “అపవిత్రుడను, అపవిత్రుడను” అని కేకలు వేయవలెను. ఇప్పుడు అతడు సాగిలపడి యేసును, “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” వేడుకొనును.

యేసునందు ఇతనికి ఎంత విశ్వాసము కలదు! అయినను, అతని వ్యాధి అతనిని ఎంత జాలిపుట్టించు స్థితిలో ఉంచెను! యేసు ఏమిచేయును? మీరేమి చేయుదురు? కనికరముతో కదిలింపబడినవాడై, యేసు తన చెయ్యిచాచి అతని ముట్టి, “నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్ము” అని చెప్పును. ఆ వెంటనే అతని కుష్ఠరోగము అదృశ్యమగును.

ఇటువంటి కనికరముచూపు వ్యక్తిని మీ రాజుగా కలిగియుండుటకు మీరు ఇష్టపడుదురా? యేసు ఈ కుష్ఠరోగము గలవానితో వ్యవహరించిన విధము, తన రాజ్య పరిపాలనలో ఈ బైబిలు ప్రవచనము నెరవేర్చబడునను నమ్మకమును మనకు కల్గించుచున్నది: “నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.” అవును, యేసు అప్పుడు బాధలకు గురియైన వారందరికి సహాయము చేయవలెనను తన హృదయ కోరికను నెరవేర్చును.

కుష్ఠరోగిని స్వస్థపరచుటకు ముందుకూడ యేసు పరిచర్య ప్రజలలో ఎంతో ఉత్తేజమును కల్గించినది. యెషయా ప్రవచన నెరవేర్పుగా, యేసు ఇప్పుడు ఆ కుష్ఠరోగిని ఇలా ఆదేశించును: “ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ, నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుము.”

అయితే అతడు తనకు జరిగిన అద్భుతమును దాచుకోలేనంత సంతోషముతో నిండివుండును. అతడు వెళ్లి, ఆ వార్తను ప్రతిచోట వ్యాప్తిచేయుట వలన ప్రజలలో ఆసక్తిని, కుతూహలమును రేకెత్తించును, గనుక యేసు పట్టణములోనికి బహిరంగముగా వెళ్లలేకపోవును. ఆ విధముగా, యేసు ఎవరును నివసింపని ఏకాంత ప్రదేశములో ఉండును, అన్ని ప్రాంతముల ప్రజలు ఆయన బోధలు వినుటకును, వారి వ్యాధులను స్వస్థపరచుకొనుటకును ఆయనయొద్దకు వత్తురు. లూకా 5:12-16; మార్కు 1:40-45; మత్తయి 8:2-4; లేవీయకాండము 13:45; 14:10-13; కీర్తన 72:13; యెషయా 42:1, 2.

కుష్ఠరోగము ఎట్టి ప్రభావమును కలిగియుండగలదు, మరియు ఏ హెచ్చరిక కుష్ఠరోగి ఇవ్వవలెను?

ఒక కుష్ఠరోగి యేసును ఎట్లు వేడుకొనును, మరియు యేసు ప్రతిస్పందననుండి మనమేమి నేర్చుకొనగలము?

స్వస్థతపొందిన మనుష్యుడు ఎట్లు యేసు మాటవినలేదు, మరియు దాని పరిణామములు ఏమైయున్నవి?