కోరదగిన మానవాతీత పరిపాలకుడు
అధ్యాయము 53
కోరదగిన మానవాతీత పరిపాలకుడు
వేలాది మందికి యేసు, అద్భుతరీతిగా భోజనము పెట్టినప్పుడు, ప్రజలు ఆశ్చర్యచకితులగుదురు. “నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే,” అని వారందురు. యేసు, మోషేకంటె గొప్పప్రవక్త మాత్రమేకాక, ఆయన అత్యంత కోరదగిన పరిపాలకుడుకాగలడని వారనుకొందురు. కనుక వారు ఆయనను పట్టుకొని రాజుగా చేయదలంచుదురు.
అయితే, యేసు వారిపథకమును పసిగట్టును. గనుక వారిచే బలవంతముగా పట్టబడకుండ తప్పించుకొనుటకు ఆయన వెంటనే అచ్చటినుండి వెళ్లిపోవును. ఆయన జనసమూహమును పంపివేసి తన శిష్యులను తమపడవ ఎక్కి కపెర్నహూముకు వెళ్లుడని బలవంతపెట్టి, ప్రార్థించుటకు కొండకు వెళ్లును. ఆ రాత్రంతయు యేసు అచ్చట ఒంటరిగానే ఉండును.
తెల్లవారుటకు కొంచెము ముందు, సముద్రము మీద పెద్ద గాలి విసరగా సముద్ర అలలు రేగుటను యేసు తానున్న ఎత్తయిన ప్రదేశమునుండి గమనించును. అది పస్కాపండుగకు సమీపము గనుక పున్నమిచంద్రుని వెలుతురులో, తనశిష్యులు పడవలో కెరటములకు ఎదురు వెళ్లుటకు ప్రయాసపడుటను యేసు చూచును. వారు తమ శక్తికొలది పడవను నడుపుచున్నారు.
దీనిని గమనించి, యేసు కొండదిగి పడవయొద్దకు ఆ అలలపై నడచుటకు ప్రారంభించును. ఆయన పడవను చేరునప్పటికి అది సుమారు ఐదారు కి.మీ. దూరమువెళ్లును. అయితే దానిని దాటిపోవుటకన్నట్లు ఆయన ఇంకను వెళ్లుచుండగా, శిష్యులు ఆయనను చూచి “ఇది ఒక భూతము!” అని కేకలు వేయుదురు.
యేసు ఓదార్పుగా: “నేనే భయపడకుడి,” అనును.
అందుకు పేతురు, “ప్రభువా నీవే అయితే నీళ్లమీద నడచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని” అడుగును.
దానికి యేసు, “రమ్ము!” అని ప్రత్యుత్తరమిచ్చును.
అప్పుడు పేతురు దోనెదిగి యేసునొద్దకు నీళ్లమీద నడచి వెళ్లును. కాని గాలితుపానును చూచి పేతురు భయపడి, మునిగిపోసాగి, “ప్రభువా నన్ను రక్షించుము!” అని కేకవేయును.
వెంటనే యేసు చేయిచాచి అతనిని పట్టుకొని: “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడితివి?” అని అడుగును.
పిమ్మట యేసు, పేతురు పడవ ఎక్కినప్పుడు గాలి సద్దుమణిగెను, కాగా శిష్యులు ఆశ్చర్యపడిరి. కాని వారు ఆశ్చర్యపడవలెనా? కొన్నిగంటల క్రితం కేవలం ఐదురొట్టెలు రెండు చిన్నచేపలతో వేలాదిమందికి ఆహారముపెట్టిన ఆ గొప్ప అద్భుతమును మెచ్చుకొన్నవారై “రొట్టెలయొక్క భావమును” గ్రహించియుంటే ఆయన నీటిపై నడచి గాలిని అణచివేసిన సంగతికి ఆశ్చర్యపడనవసరములేదు. అయినను, యిప్పుడు శిష్యులు యేసుకు వందనముచేసి “నీవు నిజముగా దేవునికుమారుడవు” అందురు.
కొద్దిసేపట్లోనే వారు గెన్నేసరెతు చేరుకొందురు, యిది కపెర్నహూము సమీపమున గల ఒక అందమైన ఫలవంతమైన ప్రాంతము. వారు తమపడవకు అక్కడ లంగరువేసారు. అయితే వారు ఒడ్డునకు వచ్చినప్పుడు, అక్కడి ప్రజలు యేసును గుర్తుపట్టి, చుట్టుపట్ల ఉన్న ప్రాంతమునకు రోగులైనవారిని కనుగొనడానికి వెళ్లుదురు. వారందరిని తమ మంచములమీదనే తీసికొనివచ్చినప్పుడు వారు యేసు వస్త్రపుచెంగును ముట్టిన వెంటనే సంపూర్ణ స్వస్థతపొందుదురు.
అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టినదానిని, కన్నులారాచూచిన జనసమూహము అప్పటికే యేసు వెళ్లిపోయెనని తెలిసికొందురు. తిబెరయనుండి చిన్నపడవలు వచ్చినప్పుడు వారు వాటిలో ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు బయలుదేరారు. వారు ఆయనను కనుగొన్నప్పుడు, “బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి?” అని అడుగుదురు. మనము త్వరలోనే చూడబోవునట్లు, యేసు వారిని గద్దించును. యోహాను 6:14-25; మత్తయి 14:22-36; మార్కు 6:45-56.
▪ వేలాదిమందికి యేసు అద్భుతరీతిగా ఆహారముపెట్టిన తరువాత ప్రజలు ఆయనను ఏమిచేయాలని తలంచుదురు?
▪ తాను వెళ్లిన కొండమీదనుండి యేసు ఏమిచూచును, అప్పుడు ఆయన ఏమిచేయును?
▪ ఈ సంగతుల విషయములో శిష్యులు ఎందుకు అంత ఆశ్చర్యపడనవసరములేదు?
▪ వారు తీరమును చేరుకున్నప్పుడు ఏమి జరుగును?