క్రీస్తురాజ్యపు మహిమయొక్క పూర్వప్రదర్శన
అధ్యాయము 60
క్రీస్తురాజ్యపు మహిమయొక్క పూర్వప్రదర్శన
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకువచ్చి, తన అపొస్తలులును చేరియున్న ఒక జనసమూహమునకు బోధింపనారంభించును. ఆయన వారికి ఆశ్చర్యంకల్గించే ఈ ప్రకటన చేయును: “ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుటచూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”
‘దీని భావమేమై యుండవచ్చును?’ అని శిష్యులు ఆలోచించిరి. ఒక వారము తర్వాత పేతురు, యాకోబు, యోహాను ఆయనతోకూడ ఎత్తైన ఒక పర్వతము మీదికి పోయిరి. శిష్యులు నిద్రావస్థలో ఉన్నందున బహుశ అది రాత్రియైయుండవచ్చును. యేసు ప్రార్థించుచుండగా ఆయన వారి ఎదుట రూపాంతరము పొందును. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించును; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివగును.
ఆ పిమ్మట, గుర్తుపట్టు వీలగులాగున రెండు ఆకారములు, “మోషేయు, ఏలీయాయు” వారికి కన్పించి, వారు యేసుతో ‘యెరూషలేమునుండి ఆయన నిర్గమించు విషయాన్నిగూర్చి’ మాటలాడుదురు. ఈ నిర్గమము స్పష్టముగా యేసు మరణ పునరుత్థానములను సూచించుచున్నది. ఆ విధముగా, ఈ సంభాషణ పేతురు కోరినట్లుగా, అవమానకరమగు మరణమును ఆయన తప్పించుకొన వీలులేనిదని నిరూపించుచున్నది.
ఇప్పుడు పూర్తిగా మేలుకొనిన వారై, శిష్యులు ఆశ్చర్యముతో దానిని గమనించుచు ఆ మాటలను విందురు. ఇది దర్శనమైనను, పేతురుకు అది ఎంతగా నిజమైయుండెననగా అతడు ఆ దృశ్యమందు భాగము వహించుటకు ఆరంభించి, “ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీ కిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియ మూడు పర్ణశాలలు కట్టుదునని” అనును.
పేతురు ఇంకను మాట్లాడుచుండగా, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, మరియు ఆ మేఘములోనుండి ఒక స్వరము వారికిట్లు చెప్పును: “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను నేను అంగీకరిస్తున్నాను, ఈయన మాట వినుడి.” (NW) శిష్యులు ఆ మాటలు వినినవెంటనే బోర్లాపడిరి. అయితే యేసు, “లెండి, భయపడకుడి” అని వారితో చెప్పును. వారు లేచిచూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడరు.
మరుసటి దినము వారు కొండదిగి వచ్చుచుండగా, యేసు వారికిట్లు ఆజ్ఞాపించును: “మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడి.” దర్శనములో ఏలీయా కన్పించుట శిష్యుల మనస్సుల్లో ఒక ప్రశ్నను లేవదీసెను. “ఈలాగైతే, ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని” వారు ప్రశ్నింతురు.
అందుకు యేసు, “ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగలేదని” చెప్పును. అయితే యేసు, ఏలీయాకు పోలిన పాత్రను నెరవేర్చిన స్నానికుడైన యోహానునుగూర్చి మాట్లాడుచున్నాడు. ఎలీషా కొరకు ఏలీయా చేసినట్లుగానే, యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధముచేసెను.
యేసు మరియు శిష్యులకు ఈ దర్శనము ఎంత బలపరచునదిగా నిరూపింపబడెను! ఈ దర్శనము క్రీస్తురాజ్య మహిమనుగూర్చి ముందే కనబరచుట అన్నట్లు ఉండెను. నిజానికి, శిష్యులు ఒక వారము ముందు యేసు వాగ్దానము చేసినట్లుగా, “మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుటను” చూసిరి. యేసు మరణము తర్వాత, పేతురు ‘తాము పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినప్పుడు, క్రీస్తు మహిమను కన్నులారా చూచితిమని’ వ్రాసెను.
దేవుడు ఏర్పరచుకొనిన రాజు అని లేఖనములలో వాగ్దానము చేయబడినవాడు తానేయని నిరూపించుటకు పరిసయ్యులు యేసునుండి ఒక సూచనను అడిగిరి. వారికి అటువంటి సూచన ఏదియు ఇవ్వబడలేదు. అయితే, రాజ్య ప్రవచనములను స్థిరపరచుటకు, యేసు సన్నిహిత శిష్యులు రూపాంతరమును చూచుటకు అనుమతింపబడిరి. అందుకే పేతురు ఈ విధముగా వ్రాసెను: “కావున స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది.” మత్తయి 16:13, 28– మత్తయి 17:13; మార్కు 9:1-13; లూకా 9:27-37; 2 పేతురు 1:16-19.
▪ మరణము రుచి చూడకముందు, క్రీస్తు రాజ్యముతో వచ్చుటను కొందరెట్లు చూచెదరు?
▪ దర్శనములో, మోషే మరియు ఏలీయా యేసుతో దేనినిగూర్చి మాట్లాడుదురు?
▪ ఈ దర్శనము శిష్యులకు ఎందుకు అంత బలమునిచ్చునదై యున్నది?