కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్షమించుటను గూర్చి ఒక పాఠము

క్షమించుటను గూర్చి ఒక పాఠము

అధ్యాయము 64

క్షమించుటను గూర్చి ఒక పాఠము

యేసు తన శిష్యులతో ఇంకను కపెర్నహూము గృహమునందే ఉన్నట్లు స్పష్టమగుచున్నది. ఆయన వారితో సహోదరుల మధ్య విబేధములను ఎట్లు చక్కబెట్టుకొనవలెనో చర్చించుచుండెను, కావున పేతురు ఆయనను ఇట్లడుగును: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను?” యూదా మత బోధకులు మూడుసార్లవరకు క్షమించుటను అనుమతించినందున, పేతురు బహుశ దానిని దృష్టిలో పెట్టుకొని తాను సూచించబోవునది ఎంతో ఔదార్యమని అనుకొని “ఏడు మారులమట్టుకా?” అని అడుగును.

అయితే అట్లు లెక్కపెట్టు ఆలోచనయే పూర్తిగా తప్పు. యేసు పేతురును ఇలా సరిదిద్దును: “ఏడుమారుల మట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను.” పేతురు తన సహోదరుని క్షమించుటకు ఎటువంటి సంఖ్యయు హద్దుగా పెట్టరాదని ఆయన చూపించుచున్నాడు.

క్షమించుట విషయములో తమ బాధ్యతయేమిటో తన శిష్యులపై ముద్రవేయుటకు, యేసు వారికి ఒక దృష్టాంతము చెప్పును. అది తన దాసులతో లెక్క చూచుకొనగోరిన ఒక రాజును గూర్చియే. 6,00,00,000 దేనారములు అచ్చియున్న యొక దాసుడు ఆయనయొద్దకు తేబడును. దానిని తిరిగి చెల్లించు మార్గమేమియు అతని దగ్గరలేదు. కావున, వానిని వానిభార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆ రాజు ఆజ్ఞాపించును అని యేసు వివరించును.

కాబట్టి ఆ దాసుడు యజమాని కాళ్లపైబడి, “నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని” యాచించును.

దానితో ఆ యజమాని కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు మొత్తమును క్షమించును. యేసు ఇంకను తెల్పినదేమనగా, అట్లు చేసి ఎంతో సమయము గడవకముందే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని “నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను.”

ఆ తోడిదాసుని దగ్గర డబ్బులేదు. కావున అతడు తాను అచ్చియున్న దాసుని కాళ్లపైబడి, “నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వేడుకొనెను.” కాని అతని యజమానివలె ఈ దాసుడు కనికరించలేదు, పైగా అతడు అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించును.

సరే, జరిగినదానిని చూసిన ఇతరు దాసులు దీనినంతటిని తమ యజమానికి తెలియచేయుదురు. ఆయన కోపముతో ఆ దాసుని పిలిపించి, “చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెనుగదా” అని వానితో చెప్పి, కోపముతో కనికరము చూపని ఆ దాసుని తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు చెరసాల అధికారులకు అప్పగించెనని యేసు తెలియజేయును.

ఆ పిమ్మట యేసు దృష్టాంతమును ముగిస్తూ ఇలాచెప్పును: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.”

క్షమించుట విషయములో ఎంత శ్రేష్ఠమైన పాఠము! మన విషయములో దేవుడు క్షమించిన పాపముతో పోల్చినట్లయిన, క్రైస్తవ సహోదరుడు మనకు వ్యతిరేకముగా చేసిన ఎటువంటి తప్పిదమైనను నిజముగా చిన్నదైయున్నది. అంతేకాకుండ, యెహోవా దేవుడు మనలను వేలకొలదిసార్లు క్షమించియున్నాడు. తరచుగా, ఆయనకు వ్యతిరేకముగా మనము చేసిన పాపములు మనకు గుర్తుకూడావుండవు. కాబట్టి, న్యాయబద్ధమైన ఫిర్యాదుకు మనకు కారణమున్నను, కొన్నిసార్లయినను మనము మన సహోదరుని క్షమించలేమా? గుర్తుతెచ్చుకొనుము, కొండమీద ప్రసంగములో యేసు బోధించినట్లు, మన ‘ఋణస్థులను మనము క్షమించియున్న ప్రకారము మన ఋణములను దేవుడు క్షమించును.’ మత్తయి 18:21-35; 6:12; కొలొస్సయులు 3:13.

తన సహోదరుని క్షమించుటనుగూర్చి ప్రశ్నించుటకు పేతురును ఏది పురికొల్పును, ఎవరినైనను ఏడుసార్లు క్షమించు తన సూచన ఔదార్యముతో కూడినదని అతడెందుకు తలంచును?

కరుణకొరకు తన దాసుడు చేసిన వినతికి రాజుయిచ్చిన ప్రత్యుత్తరము, ఆ దాసుడు తోటి దాసుడు చేసిన వినతికి యిచ్చిన ప్రత్యుత్తరమునకు ఎట్లు భిన్నమై యున్నది?

యేసుచెప్పిన దృష్టాంతమునుండి మనమేమి నేర్చుకొందుము?