కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్భవతియే గానీ అవివాహిత

గర్భవతియే గానీ అవివాహిత

అధ్యాయము 4

గర్భవతియే గానీ అవివాహిత

మరియ ఇప్పుడు మూడు నెలల గర్భవతి. ఎలీసబెతును దర్శించవెళ్లినప్పుడు గర్భవతిగా ఆమె తన తొలి దినములను అక్కడ గడిపెనను విషయమును మీరు గుర్తుతెచ్చుకొందురు, అయితే నజరేతులోని తన ఇంటికి తిరిగివచ్చినది. త్వరలోనే ఆమె పరిస్థితి తన స్వంత ఊరిలో అందరికి తెలిసిపోవును. ఆమె నిజముగా దిగులుతో నిండివున్నది.

పరిస్థితిని మరీ విషమంగాచేయు సంగతి ఏమనగా, మరియ వడ్రంగివాడైన యోసేపుకు భార్యగా ప్రధానము చేయబడినది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ప్రకారం, ఒకరికి ప్రధానము చేయబడిన స్త్రీ, ఇష్టపూర్వకముగా వేరొకరితో లైంగిక సంబంధములను కలిగియున్నట్లయిన ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడునని ఆమెకు తెలుసు. తన గర్భమునుగూర్చి ఆమె యోసేపుకు ఎట్లు తెలియజేయగలదు?

మరియ వెళ్లి మూడునెలలైనందున, ఆమెను చూచుటకు యోసేపు ఎంతో ఆతురత గలవాడైయుండునని మనము నిశ్చయముగా ఊహించవచ్చును. వారు కలిసికొనినప్పుడు, మరియ ఆయనతో ఈ విషయం చెప్పియుండవచ్చును. దేవుని పరిశుద్ధాత్మద్వారా తాను గర్భవతియైనదని వివరించుటకు ఆమె తన శాయశక్తులా ప్రయత్నించును. అయితే, మీరు ఊహించగలుగునట్లు, నమ్ముటకు ఇది యోసేపుకు చాలా కష్టమైన విషయమే.

మరియ సద్గుణరాశియని యోసేపుకు తెలుసు. మరియు ఆయన ఆమెను గాఢముగా ప్రేమించుచున్నాడు. అయినను, ఆమె ఏమిచెప్పినను, నిజముగా ఎవరో ఒక పురుషునిద్వారా ఆమె గర్భవతియైనట్లుగానే కన్పించుచున్నది. అందుకే, ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడవలెనని లేక బాహాటముగా అవమానపరచబడవలెనని యోసేపు కోరలేదు. కాబట్టి ఆయన రహస్యముగా ఆమెను విడనాడ నుద్దేశించును. ఆ దినములలో, ప్రధానము చేయబడిన వ్యక్తులు వివాహితులుగానే లెక్కింపబడెడివారు, మరియు ప్రధానమును తెంచుకొనుటకు విడాకులు అవసరమై యుండెను.

ఆ తర్వాత, యోసేపు ఈ విషయములను ఇంకను ఆలోచిస్తూనే, నిద్రపోగా స్వప్నమందు యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమై ఇట్లు చెప్పును: “నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.”

యోసేపు మేల్కొనినప్పుడు, ఆయనెంత కృతజ్ఞతగలవాడాయెను! ఇక ఎంతమాత్రము ఆలస్యము చేయకుండ ఆయన, దూత తనకిచ్చిన నడిపింపు ప్రకారము చేయును. ఆయన మరియను తన ఇంటికి తీసికొనివెళ్లును. అందరియెదుట చేసిన ఈ పని, నిజానికి వారికి వివాహమైనట్లుగానే లెక్కించబడును. అలా యోసేపు మరియలు అధికారికముగా వివాహితులైనట్లు గుర్తింపబడుదురు. అయితే యేసు, మరియ గర్భమందున్నంత కాలము యోసేపు ఆమెతో లైంగిక సంబంధమును కలిగియుండలేదు.

ఇదిగో! మరియ నిండుచూలాలై యున్నది, అయినను యోసేపు ఆమెను గాడిదపై కూర్చుండబెట్టుచున్నాడు. వారెక్కడికి వెళ్లుచున్నారు, మరియ ప్రసవించుటకు సిద్ధమైయుండగా వారెక్కడికి ప్రయాణమగుచున్నారు? లూకా 1:39-41, 56; మత్తయి 1:18-25; ద్వితీయోపదేశకాండము 22:23, 24.

మరియ గర్భవతియని తెలిసికొన్నంతనే యోసేపు మానసిక స్థితి ఎట్లున్నది, ఎందుకున్నది?

వారి వివాహము జరగకుండానే యోసేపు, మరియకు ఎట్లు విడాకులివ్వగలడు?

అందరియెదుట చేసిన ఏ పనిమూలంగా యోసేపు మరియల వివాహమైనట్లుగానే లెక్కించబడుతుంది?