కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్విష్ఠులు మరియు దీనులు

గర్విష్ఠులు మరియు దీనులు

అధ్యాయము 39

గర్విష్ఠులు మరియు దీనులు

బాప్తిస్మమిచ్చు యోహానుయొక్క ఉన్నత గుణములనుగూర్చి తెల్పిన తర్వాత, యేసు తన చుట్టువున్న గర్విష్ఠులు మరియు చంచల మనస్కులైన వారిమీదకు తన అవధానము మళ్లించి, వారికి ఇట్లు ప్రకటించెను: “ఈ తరము వారు . . . సంత వీధులలో కూర్చునియుండి ‘మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమిగాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని’ తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.”

ఆయన భావమేమి? ఆయన ఇట్లు వివరించుచున్నాడు: “యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక, ‘వీడు దయ్యముపట్టిన వాడని’ వారనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక, ‘వీడు తిండిబోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడునని’ వారనుచున్నారు.”

ప్రజలను తృప్తిపరచుట అసాధ్యము. వారిని ఏదియు ప్రీతిపరచుట లేదు. దూత ప్రకటించిన దానిననుసరించి, “ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక,” యోహాను నాజీరుగా తన్నుతాను త్యజించుకొని కఠోర నియమనిష్ఠలతో జీవించెను. అయినను ప్రజలు ఆయనను దయ్యము పట్టినవాడని అనిరి. మరొకప్రక్క, యేసు ఇతర ప్రజలవలెనే జీవించును, కాగా వారు ఆయన మితిమీరి ప్రవర్తించుచున్నాడని నిందించుదురు.

ప్రజలను ప్రీతిపరచుట ఎంతకష్టము! వారు పిల్లనగ్రోవి ఊదినను తమతో నాట్యముచేయక, ఏడ్చినను తమతో ఏడ్వకయుండు కొంతమంది చెలికాండ్రను పోలియున్నారు. అయినను, యేసు ఇట్లనుచున్నాడు: “జ్ఞానము జ్ఞానమని (నీతియని) దాని క్రియలనుబట్టి తీర్పుపొందును.” అవును, రుజువు—అనగా క్రియలు—యోహాను మరియు యేసు మీదవేసిన నిందలు అబద్ధమని స్పష్టముచేయును.

యేసు తాను ఏయే ప్రాంతములలో విస్తారముగా అద్భుతములు చేసెనో ఆ పట్టణములగు కొరజీనా, బెత్సయిదా, కపెర్నహూము మీద నిందమోపుచున్నాడు. ఒకవేళ ఆయన ఈ సూచకక్రియలను ఫెనికయ పట్టణములైన తూరు, సీదోనులలో చేసియున్నట్లయిన, ఈ పట్టణవాసులు గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనస్సు పొందియుందురని యేసు చెప్పును. తన పరిచర్య కాలములో స్పష్టముగా తనకు ఒక స్థావరమైయున్న కపెర్నహూముమీద నేరస్థాపనచేయుచు, యేసు ఇట్లు ప్రకటించును: “విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారిగతి ఓర్వదగినదై యుండును.”

ఆ పిమ్మట బహిరంగముగా తన పరలోకపు తండ్రిని స్తుతించును. ఆయనట్లు చేయుటకు ఎందుకు కదిలింపబడెననగా, దేవుడు ప్రశస్తమైన ఆత్మీయ సత్యములను జ్ఞానులకు, మేధావులకు మరుగుచేసి ఈ అద్భుత సంగతులను పిల్లలవంటి, దీనులకు బయలుపరచెను.

చివరగా, యేసు వినతిపూర్వకముగా వారినిట్లు ఆహ్వానించును: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”

యేసు ఎట్లు విశ్రాంతిని కలుగజేయును? వ్యక్తులను బానిసలుగాచేయు ఆచారములనుండి, ఉదాహరణకు, విశ్రాంతిదిన నియమముల ఆచరణను కఠినతరము చేయుటవంటి వాటితోసహా, మతనాయకులు ప్రజలపై మోపిన భారమునుండి వారికి స్వాతంత్ర్యమునిచ్చుటద్వారా ఆయనట్లు చేయును. అంతేకాకుండ, రాజకీయ ప్రభుత్వముల అణచివేతయను భారమునకు గురియగుచున్నామని భావించుచున్నవారికి మరియు తమ పాపముల భారముచే నలిగిన మనస్సాక్షి గలవారికి ఆయన విడుదల మార్గమును చూపించుచున్నాడు. అలా బాధనొందు వారి పాపములు ఎట్లు క్షమింపబడగలవో, మరియు వారు దేవునితో ఎట్లు ప్రశస్తమైన సంబంధమును అనుభవించగలరో కూడ ఆయన బయల్పరచుచున్నాడు.

యేసు అందించు సుళువైన కాడి ఏదనగా, దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని, జాలి, కనికరముగల మన పరలోకపు తండ్రిని సేవించగల్గుటయై యున్నది. తనయొద్దకు వచ్చువారికి యేసు అందించు తేలికైన కాడి ఏదనగా, బైబిలునందు వ్రాయబడియున్న దేవుని ఆజ్ఞలకు, అనగా జీవము కొరకైన ఆయన నియమములకు లోబడుటయై యున్నది. వీటికి లోబడుట ఎంతమాత్రము భారము కాదు. మత్తయి 11:16-30; లూకా 1:15; 7:31-35;1 యోహాను 5:3.

యేసు తరములోని గర్విష్ఠులు, చంచల మనస్సుగల ప్రజలు ఎట్లు పిల్లలవలెనున్నారు?

తన పరలోకపు తండ్రిని స్తుతించుటకు యేసు ఎందుకు కదిలింపబడెను?

ఏ విధములుగా ప్రజలు భారముతో కృంగియున్నారు, యేసు వారికి ఏ విశ్రాంతిని దయచేయును?