కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర

గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర

అధ్యాయము 49

గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర

రెండు సంవత్సరములు తీవ్రముగా ప్రచారముచేసిన పిదప, యేసు యిప్పుడు దానిని విడిచి, చులకనగా ఎంచునా? దానికి బదులుగా, గలిలయకు మరొక యాత్ర అనగా మూడవ పర్యాయము వెళ్లుట మూలంగా తన ప్రచారపనిని విస్తృతపరచును. ఆ ప్రాంతమందలి అన్ని పట్టణములను, గ్రామములను ఆయన సందర్శించి సమాజమందిరములలో బోధించుచు, రాజ్యసువార్తను ప్రకటించును. ఈ యాత్రలో ఆయన గమనించినది, ప్రచారపు పనిని క్రితమెన్నటికంటె తీవ్రతరము చేయవలెనని ఆయనను ఒప్పించును.

యేసు ఎచ్చటికి వెళ్లినను, జనసమూహములు ఆత్మీయ స్వస్థత మరియు ఓదార్పు యొక్క అవసరతలో నున్నట్లు ఆయన గమనించును. వారు కాపరిలేని గొర్రెవలె విసికి చెదరియున్నారని ఆయన వారిని గూర్చి జాలిపడును. ఆయన తన శిష్యులతో యిలా చెప్పును: “కోతవిస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.”

యేసుకు కార్యాచరణ పథకమున్నది. దాదాపు సంవత్సరము క్రిందట తాను ఎంపిక చేసికొనిన 12 మంది అపొస్తలులను ఆయన పిలిచి, యిద్దరిద్దరినిగా విడదీసి, వారిని ఆరు ప్రచార జట్లుగాచేసి వారికిట్లు వివరించును: “మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలయొద్దకే వెళ్లుడి. వెళ్లుచు ‘పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.’”

మాదిరి ప్రార్థనలో యేసు వారిని ప్రార్థించుమని బోధించిన రాజ్యమును గూర్చియే వారు ప్రకటించవలెను. రాజ్యము సమీపించియున్నది అనగా దేవునిచే నియమించబడిన రాజైన, యేసుక్రీస్తు ప్రత్యక్షముగా ఉన్నాడని దాని భావము. ఆ మానవాతీత ప్రభుత్వము యొక్క ప్రతినిధులుగా తన శిష్యులకున్న ఆధిక్యతలను స్థిరపర్చుటకుగాను, రోగులను స్వస్థపరచుట మరియు చనిపోయిన వారినికూడ లేపుటకు యేసు వారికి శక్తిననుగ్రహించును. వారు ఈ సేవలను ఉచితముగా చేయవలెనని ఆయన వారికి ఆజ్ఞాపించును.

అటుతరువాత తమ ప్రచారయాత్రకొరకు ఏ వస్తు సామాగ్రిని సిద్ధంచేసికొనవద్దని ఆయన తన శిష్యులకు చెప్పును. “మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను ప్రయాణముకొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడే.” ఆ వర్తమానమును అభినందించేవారు ప్రతిస్పదించి ఆహారమును, వసతిని ఏర్పాటుచేస్తారు. యేసుచెప్పినట్లుగా: “మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతనియింటనే బసచేయుడి.”

ఆ పిమ్మట రాజ్యవర్తమానముతో గృహస్థులను ఎలా సమీపించాలో యేసు వారికి ఉపదేశించును. “మీరు ఒక యింటిలోనికి ప్రవేశించునప్పుడు ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను పట్టణమునైనను విడిచి పోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.”

వారి వర్తమానమును నిరాకరించు పట్టణముయొక్క తీర్పు నిజానికి చాలాతీవ్రముగా యుండునని యేసు వెల్లడిచేయుచు, ఆయనిట్లు వివరించును: “విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదైయుండును.” మత్తయి 9:35–10:15; మార్కు 6:6-12; లూకా 9:1-5.

గలిలయకు యేసు తన మూడవ ప్రచార యాత్రను ఎప్పుడు ప్రారంభించును, అది ఆయనను ఏ విషయము కొరకు ఒప్పింపజేయును?

తన 12 మంది అపొస్తలులను ప్రకటించుటకు పంపునప్పుడు, ఆయన వారికి ఏ ఉపదేశముల నిచ్చును?

రాజ్యము సమీపించియున్నదని శిష్యులు ఉపదేశించుట ఎందుకు సరియైయున్నది?