కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గలిలయ సముద్రము దగ్గర

గలిలయ సముద్రము దగ్గర

అధ్యాయము 130

గలిలయ సముద్రము దగ్గర

యేసు అంతకుముందు వారికి ఆజ్ఞాపించినట్లుగా, అపొస్తలులు ఇప్పుడు గలిలయకు తిరిగివత్తురు. అయితే వారక్కడ ఏమిచేయవలెనో ఏమియు తోచకయున్నారు. కొంతసేపైన తర్వాత, పేతురు, “నేను చేపలు పట్టబోదునని” తోమా, నతనయేలు, యాకోబు, యోహాను మరియు మరియిద్దరు అపొస్తలులతో చెప్పును.

ఆ ఆరుగురు, “మేమును నీతుకూడ వచ్చెదమని” ప్రత్యుత్తరమిత్తురు.

ఆ రాత్రంతయు, వారు ఏమియు పట్టలేకపోవుదురు. అయితే, తెల్లవారుతూ సూర్యోదయమగుచుండగా, యేసు దరిని ప్రత్యక్షమగును, అయితే ఆయన యేసని అపొస్తలులు గ్రహింపరు. ఆయన, “పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైనా ఉన్నదా?” అని కేకవేయును.

“లేదు” అని వారు కేకవేసి సముద్రములోనుండే జవాబిచ్చుదురు.

అప్పుడాయన, “దోనె కుడిప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని” చెప్పును. గనుక వారట్లు చేసినప్పుడు, చేపలు విస్తారముగా పడినందున వారు వల లాగలేకపోవుదురు.

“ఆయన ప్రభువు” అని యోహాను బిగ్గరగా అరుచును.

దీనిని వినిన వెంటనే, తన వస్త్రములు తీసివేసి యున్నందున పేతురు తన పైవస్త్రమును కట్టుకొని, సముద్రములో దూకును. అలా అతడు దాదాపు 90 మీటర్లు నీటిలో ఈది ఒడ్డుచేరును. చేపలతో నిండియున్న వలను లాగుతూ ఇతర అపొస్తలులు ఆ చిన్న దోనేలోనే ఒడ్డుకు చేరుదురు.

వారు దిగి దరికి రాగానే, అక్కడ బొగ్గునిప్పులును, వాటిమీద చేపలును రొట్టెయు ఉండును. “మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొనిరండని” యేసు వారితో చెప్పును. పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగును. దానిలో 153 పెద్ద చేపలుండును.

“రండి భోజనము చేయుడి” అని యేసు వారి నాహ్వానించును.

ఆయన యేసని ప్రతివారికి తెలిసినందున, వారిలో ఎవరును ఆయనను “నీవెవడవని?” అడుగ సాహసించలేదు. పునరుత్థానమైన తరువాత ఆయన ప్రత్యక్షమగుట ఇది ఏడవసారి, అయితే అపొస్తలులకు ఒక గుంపుగా కన్పించుట ఇది మూడవసారి. వారిలో ప్రతివానికి రొట్టెను, చేపలను ఇచ్చుచు, ఆయనిప్పుడు వారికి ప్రాతఃకాల భోజనము పెట్టును.

వారు తినుట ముగించినప్పుడు, యేసు బహుశ వలలోని చేపలను చూస్తూ, పేతురును ఇట్లడుగును: “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే (వీటికంటే NW) నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” నిస్సందేహముగా ఆయన భావమేమనగా, నీవు చేయుటకు నేను సిద్ధపరచిన పనికంటే చేపల వ్యాపారమునకే ఎక్కువ హత్తుకొందువా?

“నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని పేతురు ప్రత్యుత్తరమిచ్చును.

అప్పుడు యేసు, “నా గొర్రె పిల్లలను మేపుము” అనును.

రెండవసారి, మరలా ఆయన, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?” అని అడుగును.

“అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని పేతురు మనస్ఫూర్తిగా చెప్పును.

“నా గొర్రెలను కాయుమని” యేసు మరలా ఆజ్ఞాపించును.

ఆ పిమ్మట మూడవసారి, ఆయనిట్లడుగును: “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా?”

ఈసారి పేతురు బాధపడును. యేసు తన నమ్మకత్వమును శంకించుచున్నాడాయని అతడు ఆశ్చర్యపడును. ఏమైనా, యేసు ఇటీవలనే మరణశిక్ష కొరకైన న్యాయవిచారణలో ఉన్నప్పుడు, పేతురు ఆయనెవరో తనకు తెలియదని మూడుసార్లు బొంకెను. కావున పేతురు ఇట్లనును: “ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు.”

మూడవసారి, “నా గొర్రెలను మేపుము” అని యేసు ఆజ్ఞాపించును.

ఆ విధముగా, వారు చేయవలెనని తానిష్టపడు పని విషయములో ఇతరులపై ముద్రవేయుటకు యేసు, పేతురును మాట్లాడుటకు ఉపయోగించుకొనును. ఆయన త్వరలోనే భూమిని విడిచిపెట్టును, కావున దేవుని గొర్రెల దొడ్డిలోనికి ఆకర్షింపబడు వారికి పరిచర్య చేయుటలో వారు నాయకత్వము వహించవలెనని ఆయన కోరుచున్నాడు.

తాను చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించిన పనిచేసినందుకు, యేసు బంధింపబడి, సంహరింపబడినట్లుగానే, పేతురును అటువంటి అనుభవమునే కలిగియుండునని ఆయన వెల్లడిచేయుచున్నాడు. “నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొనిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” పేతురు హతసాక్షిగా మరణించ వలసియున్నను, యేసు అతనికిట్లు నొక్కిచెప్పును: “నన్ను వెంబడించుము.”

పేతురు వెనుకకు తిరిగి, యోహానును చూసి, “ప్రభువా, ఇతని సంగతి ఏమగును?” అని అడుగును.

అందుకు యేసు, “నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమని” జవాబిచ్చును. యేసు చెప్పిన ఈ మాటలనుబట్టి అపొస్తలుడైన యోహాను ఎన్నడు మరణించడని అనేకమంది శిష్యులు భావించిరి. అయితే, ఆ తర్వాత అపొస్తలుడైన యోహాను వివరించినట్లుగా, అతడు ఎన్నడు మరణించడని యేసు చెప్పలేదు, గానీ యేసు కేవలము ఇట్లనెను: “నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి?”

ఆ తర్వాత యోహానుకూడ ఈ ప్రాముఖ్యమైన మాటచెప్పెను: “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల, అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” యోహాను 21:1-25; మత్తయి 26:32; 28:7, 10.

గలిలయలో తామేమి చేయవలెనో తెలియక అపొస్తలులు అనిశ్చయముగా ఉన్నారని ఏమి చూపుచున్నది?

గలిలయ సముద్రమునొద్ద, యేసును అపొస్తలులు ఎట్లు గుర్తింతురు?

పునరుత్థానమైన దగ్గరనుండి ఇప్పటివరకు యేసు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు?

అపొస్తలులు చేయవలెనని తాను కోరినదానిని యేసు ఎట్లు నొక్కిచెప్పును?

పేతురు చనిపోయే పద్ధతినిగూర్చి యేసు ఎట్లు సూచించును?

యోహానును గూర్చి యేసుచెప్పిన ఏ మాటలను శిష్యులనేకులు తప్పుగా అర్థముచేసికొనిరి?