కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చివరి ప్రత్యక్షతలు, మరియు సా.శ. 33 పెంతెకొస్తు

చివరి ప్రత్యక్షతలు, మరియు సా.శ. 33 పెంతెకొస్తు

అధ్యాయము 131

చివరి ప్రత్యక్షతలు, మరియు సా.శ. 33 పెంతెకొస్తు

యేసు ఏదో ఒక సమయమందు తన మొత్తము 11 మంది అపొస్తలులు గలిలయ కొండమీద తనను కలిసికొను ఏర్పాట్లుచేయును. ఇతర శిష్యులకును ఈ కూటము విషయము చెప్పినప్పుడు, అక్కడ మొత్తం 500 మందికంటే ఎక్కువమంది సమావేశమగుదురు. అప్పుడు యేసు ప్రత్యక్షమై వారికి బోధింప నారంభించుటతో ఆ సమావేశము ఎంత సంతోషముగా యుండెనో!

ఇతర సంగతులతోపాటు, యేసు తనకు దేవుడు పరలోకమందును భూమిమీదను సర్వాధికారమును ఇచ్చెనని యేసు ఆ పెద్దగుంపుకు వివరించును. “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని ఆయన ఉద్బోధించెను.

దానిని ఆలోచించుము! పురుషులు, స్త్రీలు పిల్లలు అందరు శిష్యులనుచేయు పనిలో భాగము వహించవలెనని ఆజ్ఞాపించబడిరి. వ్యతిరేకులు వారు ప్రకటించకుండ, బోధించకుండ ఆపుటకు ప్రయత్నించవచ్చును, కానీ యేసు వారినిట్లు ఓదార్చుచున్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” వారు వారి పరిచర్యను నెరవేర్చుటకు సహాయపడునట్లు, యేసు పరిశుద్ధాత్మ మూలముగా తన అనుచరులతో ఉండును.

పునరుత్థానమైన తర్వాత యేసు తన శిష్యులకు సజీవముగా కనబడుచు మొత్తము 40 దినములుండును. ఇలా కన్పించినప్పుడల్లా ఆయన వారికి దేవుని రాజ్యమునుగూర్చి ఉపదేశించుచు, తన శిష్యులుగా వారికున్న బాధ్యతలను నొక్కితెలియజేయును. ఒక సందర్భములో ఆయన తన తమ్ముడును, ఒకప్పటి అవిశ్వాసియైన యాకోబుకు కన్పించి, తాను నిజముగా క్రీస్తునని అతనిని ఒప్పించును.

అపొస్తలులు ఇంకను గలిలయలోనే ఉండగా, యేసు వారిని యెరూషలేము వెళ్లవలెనని ఆజ్ఞాపించును. వారినక్కడ కలిసికొనినప్పుడు, ఆయన వారితో ఇట్లనును: “మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి; యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు.”

ఆ తర్వాత యేసు మరలా తన అపొస్తలులను కలిసికొని వారిని ఒలీవల కొండకు తూర్పువైపు దిగువునగల బేతనియ వరకు తీసికొనిపోవును. తాను త్వరలో పరలోకమునకు పోవుదునని ఆయన ఇంత చెప్పినను, వారు ఇంకను ఆయన భూమిపై రాజ్యము స్థాపించునని నమ్ముట ఆశ్చర్యకరంగా ఉన్నది. కావున వారిట్లు అడుగుదురు: “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?”

వారి అపోహలను సరిదిద్దుటకు మరలా ప్రయత్నించుటకు బదులు, యేసు సులభరీతిలో వారికిట్లు సమాధానమిచ్చును: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” ఆ పిమ్మట, వారు చేయవలసిన పనిని మరలా నొక్కిచెప్పుచు ఆయనిట్లనును: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”

వారింకను చూచుచుండగా, యేసు పరలోకమునకు ఆరోహణమగుటకు ఆరంభించును, ఆ పిమ్మట వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను మరుగుచేయును. తన భౌతిక శరీరమును విడిచి ఆయన ఆత్మీయ వ్యక్తిగా పరలోకమునకు ఎక్కిపోవును. ఆ 11 మంది ఇంకను ఆకాశమువైపు తేరిచూచుండగా, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన ప్రత్యక్షమగుదురు. భౌతిక శరీరములు ధరించిన ఈ దేవదూతలు, “గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని” చెప్పుదురు.

ఇప్పుడు యేసు భూమిని విడిచిన రీతి ఏదనగా, ప్రజలందరు వింతగా చూచురీతిలో గాక, కేవలము ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే దానిని గమనించునట్లు ఆరోహణమయ్యాడు. కావున అదే రీతిన—ప్రజల ఆర్భాటము లేకుండా, తాను తిరిగివచ్చి రాజ్యాధికార సాన్నిధ్యమందున్నాడని కేవలము తన నమ్మకమైన అనుచరులు గ్రహించులాగున ఆయన తిరిగివచ్చును.

అపొస్తలులు ఇప్పుడు ఒలీవల కొండ దిగి, కిద్రోను లోయదాటి మరలా యెరూషలేములో ప్రవేశింతురు. యేసు ఆజ్ఞకులోబడి వారు యెరూషలేములోనే ఉందురు. పది దినములైన తర్వాత, యూదుల పండుగైన సా.శ. 33 పెంతెకొస్తునాడు దాదాపు 120 మంది శిష్యులు యెరూషలేములో ఒక మేడగదిలో సమావేశమై యుండగా, వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఇల్లంతయు నిండును. అగ్నిజ్వాలలవంటి నాలుకలు కనబడి, అక్కడున్న ప్రతివారిపై వ్రాలగా, శిష్యులందరు వివిధ భాషలలో మాట్లాడ నారంభింతురు. యేసు వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట అనగా ఇదే! మత్తయి 28:16-20; లూకా 24:49-52; 1 కొరింథీయులు 15:5-7; అపొ. కార్యములు 1:3-15; 2:1-4.

తాను వెళ్లిపోవుటకు ముందు, గలిలయలోని కొండపై యేసు ఎవరికి ఉపదేశములనిచ్చును, ఈ ఉపదేశములేమై యున్నవి?

యేసు తన శిష్యులకు ఏ ఓదార్పునిచ్చును, మరియు ఆయనెట్లు వారితో ఉండును?

పునరుత్థానము తర్వాత యేసు ఎంతకాలము తన శిష్యులకు కన్పించును, ఆయన వారికేమి బోధించును?

తన మరణమునకు ముందు నిజంగా తన శిష్యుడు కానటువంటి ఏవ్యక్తికి యేసు ఇప్పుడు ప్రత్యక్షమగును?

తన అపొస్తలులతో యేసు ఏ చివరి రెండు సమావేశములను కలిగియుండును, ఈ సందర్భములలో ఏమి సంభవించును?

ఆయన వెళ్లుచున్నట్లుగానే అదే రీతిలో యేసు ఎట్లు తిరిగివచ్చును?

సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏమి సంభవించును?