కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞాపకార్థ రాత్రి భోజనము

జ్ఞాపకార్థ రాత్రి భోజనము

అధ్యాయము 114

జ్ఞాపకార్థ రాత్రి భోజనము

యేసు తన అపొస్తలుల పాదములు కడిగిన తర్వాత, ఆయన కీర్తన 41:9లోని లేఖనమును ఎత్తిచూపుచు, ఇట్లనును: “నాతో కూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను.” అ తర్వాత ఆయన ఆత్మలో కలవరపడి, “మీలో ఒకడు నన్ను అప్పగించును” అని చెప్పును.

అపొస్తలులు దుఃఖపడుచు ఒకరి తర్వాత ఒకరు యేసుతో ఇట్లందురు: “నేనా?” ఇస్కరియోతు యూదా సహితము కూడ అట్లడుగును. బల్లయొద్ద యేసుకు ప్రక్కగావుండి యేసు రొమ్మున ఆనుకొనుటకు వెనుకకు వాలి యెహాను, “ప్రభువా వాడెవడు?” అని అడుగును.

“పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే” అని యేసు సమాధానమిచ్చును. “నిజముగా మనుష్యకుమారుడు ఆయిననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలు.” దుష్టమైనదిగా మారిన యూదా ఆలోచనను అవకాశముగా తీసికొని సాతాను అతనిలో ప్రవేశించును. ఆ రాత్రి మరొక సమయములో యేసు చివరికి యూదాను, “నాశనపుత్రుడు” అని పిలుచును.

ఇప్పుడు యేసు యూదాతో ఇట్లనును: “నీవు చేయుచున్నది త్వరగా చేయుము.” యేసు చెప్పిన విషయమును అపొస్తలులలో ఎవరికిని అర్థము కాలేదు. డబ్బుసంచి యూదా దగ్గరయున్నందున, “పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని” లేక అతడు వెళ్లి బీదలకేమైనా ఇవ్వవలెనని యేసు అతనికి చెప్పుచున్నాడని వారిలో కొందరు ఊహింతురు.

యూదా వెళ్లిపోయిన తర్వాత, యేసు పూర్తిగా ఒక క్రొత్త ఆచరణను, లేక జ్ఞాపకముంచుకొనవలసిన సంగతిని తన అపొస్తలులకు పరిచయము చేయును. ఆయనొక రొట్టెను చేతబట్టుకొని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, దానిని విరిచి వారికిచ్చి, “మీరు తీసికొని తినుడి” అనును. ఆ పిమ్మట ఆయన వారికిట్లు వివరించును: “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”

ప్రతివాడును రొట్టెను భుజించిన మీదట, యేసు పస్కా ఆచరణలో ఉపయోగించు నాల్గవ కప్పులో ద్రాక్షారసమును తీసికొనును. ఆయన దాని విషయమైకూడ కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, వారికి దానిని త్రాగుమని చెప్పుచు ఇట్లనును: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలననైన క్రొత్త నిబంధన.”

కావున ఇది వాస్తవానికి, యేసు మరణముయొక్క జ్ఞాపకార్థ ఆచరణయైయున్నది. తనను జ్ఞాపకము చేసికొనుమని యేసు చెప్పునట్లుగా, ఇది ప్రతి సంవత్సరము నీసాను 14న మరలామరలా చేయబడును. ఇది మానవజాతిని మరణస్థితినుండి విడిపించుటకు యేసు మరియు ఆయన పరలోకపుతండ్రి ఏమిచేసిరో దానిని ఆచరించువారికి తిరిగి జ్ఞాపకమునకు తెచ్చును. క్రీస్తు అనుచరులుగా మారు యూదులకు, ఈ ఆచరణ పస్కాపండుగ స్థానమున వచ్చును.

యేసు రక్తముద్వారా క్రియారూపమునకు తీసికొని రాబడిన క్రొత్తనిబంధన, పాత ధర్మశాస్త్రముయొక్క స్థానమున వచ్చును. ఇది రెండు వర్గముల మధ్య—ఒకవైపు యెహోవా దేవుడు మరొకవైపు ఆత్మాభిషక్తులైన 1,44,000 మంది క్రైస్తవులు—యేసుక్రీస్తు మధ్యవర్తిత్వమున జరిగింపబడెను. పాపములకు క్షమాపణను దయచేయుటయే కాకుండా, ఈ నిబంధన పరలోక రాజులైన-యాజక జనాంగమును రూపొందించుటను అనుమతించును. మత్తయి 26:21-29; మార్కు 14:18-25; లూకా 22:19-23; యోహాను 13:18-30; 17:12; 1 కొరింథీయులు 5:7.

ఒక సహవాసి విషయమై యేసు ఏ బైబిలు ప్రవచనమును ఎత్తిచూపును, ఆయన దానికి ఏ అన్వయింపు ఇచ్చును?

అపొస్తలులు ఎందుకు బహు దుఃఖక్రాంతులైరి, వారిలో ప్రతివాడును ఏమని అడుగుదురు?

యూదాను ఏమి చేయుమని యేసు అడుగును, అయితే ఇతర అపొస్తలులు దీనికి ఎట్లు భావము చెప్పుదురు?

యూదా వెళ్లిపోయిన తరువాత యేసు ఏ ఆచరణను పరిచయము చేయును, ఏ ఉద్దేశ్యముతో అది పనిచేయును?

ఈ క్రొత్త నిబంధనకు చెందిన రెండు వర్గముల వారు ఎవరు, ఈ నిబంధన ఏమి నెరవేర్చును?