తన అపొస్తలులను ఎన్నుకొనుట
అధ్యాయము 34
తన అపొస్తలులను ఎన్నుకొనుట
బాప్తిస్మమిచ్చు యోహాను యేసును దేవుని గొర్రెపిల్లగా పరిచయము చేసినదగ్గరనుండి, మరియు యేసు బహిరంగముగా తన పరిచర్యను ప్రారంభించిన దగ్గరనుండి ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరము అయినది. ఆ సమయమునకు అంద్రెయ, పేతురనబడిన సీమోను, యోహాను, బహుశ యాకోబు (యోహాను సహోదరుడు), ఆలాగే ఫిలిప్పు మరియు నతనయేలు (బర్తెలొమయి అనికూడ పిలువబడెను), ఆయన మొదటి శిష్యులైరి. తగిన సమయమునకు, క్రీస్తును వెంబడించుటలో అనేకమంది ఇతరులును వారితో కలిసిరి.
ఇప్పుడు యేసు తన అపొస్తలులను ఎన్నుకొను సమయము వచ్చును. వీరు ఆయనకు అత్యంత సన్నిహితులైయుందురు, కాగా వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అయితే వారిని ఎన్నుకొనుటకు ముందు, యేసు కొండమీదకువెళ్లి, బహుశ జ్ఞానము కొరకు మరియు దేవుని ఆశీర్వాదము కొరకు ఆ రాత్రంతయు ప్రార్థనలో గడుపును. ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలోనుండి 12 మందిని ఎన్నుకొనును. అయితే వారు ఇంకను యేసుయొక్క విద్యార్థులే గనుక, వారు ఇంకను శిష్యులనే పిలువబడిరి.
యేసు ఏర్పరచుకొనిన ఆరుగురిలో, ముందు చెప్పబడిన పేర్లుగల, ఆయన మొదట శిష్యులైనవారే. సుంకపు మెట్టునుండి యేసు పిలిచిన మత్తయికూడ ఎంపికచేసికొనబడెను. ఎన్నుకొనబడిన మిగతా ఐదుగురు ఎవరనగా, యూదా (తద్దయి అనికూడ పిలువబడెను), ఇస్కరియోతు యూదా, కనానీయుడైన సీమోను, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు. బహుశ ఈయన ఎత్తుతక్కువగా యున్నందువలన లేక వేరొక అపొస్తలుడైన యాకోబుకంటె వయస్సులో చిన్నవాడైనందువలన ఈ యాకోబు చిన్నయాకోబు అనికూడ పిలువబడెను.
ఇప్పటికి కొంతకాలముగా ఈ 12 మంది యేసుతో ఉన్నందువలన, ఆయన వారందరిని బాగుగా ఎరిగియుండెను. వాస్తవానికి వారిలో చాలామంది ఆయన స్వంత బంధువులైయున్నారు. యాకోబు ఆయన సహోదరుడైన యోహాను సాక్ష్యాధారముగా యేసు సమీపజ్ఞాతులై యున్నారు. అల్ఫయి బహుశ యేసును పెంచిన తండ్రియగు యోసేపు సహోదరుడై యుండవచ్చును. కాబట్టి అల్ఫయి కుమారుడైన అపొస్తలుడగు యాకోబుకూడ యేసుకు సమీపజ్ఞాతియైయున్నాడు.
యేసుకు తన అపొస్తలుల పేర్లను జ్ఞాపకముంచుకొనుట పెద్దసమస్య కాదు. అయితే వారిని మీరు గుర్తుపెట్టుకొనగలరా? సరే, మీరు ఇలా వారిని గుర్తుపెట్టుకొనవచ్చును, వారిలో ఇద్దరి పేర్లు సీమోను, ఇద్దరి పేర్లు యాకోబు, ఇద్దరి పేర్లు యూదా, అందులో సీమోను సహోదరుడు అంద్రెయ, యాకోబు సహోదరుడు యోహాను. ఇది ఎనిమిది మంది అపొస్తలులను గుర్తుపెట్టుకొనుటకు సుళువైన మార్గము. మిగిలిన నలుగురు ఎవరనగా, సుంకము వసూలుచేయువాడైన (మత్తయి), ఆ తరువాత ఆయనను సందేహించిన (తోమా), చెట్టుక్రిందనుండి పిలువబడిన (నతనయేలు), మరియు అతని స్నేహితుడైన ఫిలిప్పు.
వీరిలో 11 మంది అపొస్తలులు యేసు స్వదేశమైన గలిలయనుండి వచ్చినవారు. నతనయేలు కానానుండి, ఫిలిప్పు, పేతురు, అంద్రెయ మొదట బెత్సయిదా నుండి వచ్చినవారు. అయితే ఆ తర్వాత పేతురు, అంద్రెయలు మత్తయి నివసించిన ప్రదేశముగా కన్పించు కపెర్నహూముకు కదలివెళ్లారు. యాకోబు యోహానులుకూడ చేపలుపట్టు వృత్తిలో బహుశ కపెర్నహూములో లేక దానికి సమీపములో నివసించియుందురు. తదుపరి యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా మాత్రము, యూదయనుండి వచ్చిన ఒకేఒక అపొస్తలునిగా కన్పించుచున్నది. మార్కు 3:13-19; లూకా 6:12-16.
▪ ఏ అపొస్తలులు యేసుకు బంధువులై యుండవచ్చును?
▪ యేసుయొక్క అపొస్తలులు ఎవరు, మరియు మీరు వారి పేర్లను ఎట్లు గుర్తుపెట్టుకొనగలరు?
▪ అపొస్తలులు ఏయే ప్రాంతములనుండి వచ్చిరి?