కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తోటలో కలిగిన మానసిక వ్యధ

తోటలో కలిగిన మానసిక వ్యధ

అధ్యాయము 117

తోటలో కలిగిన మానసిక వ్యధ

యేసు ప్రార్థన చేయుటను ముగించినప్పుడు, ఆయన ఆయన నమ్మకమైన 11 మంది అపొస్తలులు యెహోవాకు స్తుతి కీర్తనలు పాడిరి. ఆ పిమ్మట వారు మేడగదినుండి దిగివచ్చి, ఆ చల్లని రాత్రి చీకటిలో బయలుదేరి, కిద్రోను లోయకు అడ్డముగా బేతనియ వైపు వెళ్లుదురు. అయితే మార్గమధ్యమున వారు వారికి ప్రీతిపాత్రమైన గెత్సేమను తోటలో ఆగుదురు. ఇది ఒలీవల కొండమీద లేక దాని పరిసరములలో ఉన్నది. ఇక్కడ ఒలీవ చెట్లమధ్య యేసు తరచు తన అపొస్తలులతో కలిసికొనెడివాడు.

ఎనిమిది మంది అపొస్తలులను—బహుశ తోట ద్వారమునొద్దనే—వదిలి, “నేను ప్రార్థన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడి” అని వారికి ఉపదేశించును. ఆ పిమ్మట ఆయన మిగిలిన ముగ్గురిని—పేతురు, యాకోబు, మరియు యోహాను—తనవెంట తీసికొని తోటలోనికి పోవును. యేసు దుఃఖముతో నిండినవాడై మిగుల చింతాక్రాంతుడగును. “నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని” ఆయన వారితో చెప్పును.

కొంతదూరము ముందుకు వెళ్లి, నేలపై సాగిలపడి మనసంతాపెట్టి ఇట్లు ప్రార్థించును: “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము.” ఆయన భావమేమై యున్నది? ఆయన ఎందుకు “మరణమగునంతగా దుఃఖములో మునిగి” యున్నాడు? చనిపోవుటకు మరియు విమోచన క్రయధనమును దయచేయుట కొరకైన తన తీర్మానమునుండి ఆయన వెనుకకు తగ్గుచున్నాడా?

ఎంతమాత్రము కాదు! మరణమునుండి తనను తప్పించుమని యేసు ప్రార్థించుట లేదు. పేతురు ఒకసారి సూచించినట్లు బలిగా మరణించుటను తప్పించుకొను ఆలోచనయే ఆయనకు విరుద్ధమైయున్నది. బదులుగా, ఆయన ఎంతో క్షోభ ననుభవించుచున్నాడు ఎందుకంటె తాను—ఒక నీచమైన నేరస్థునిగా—మరణించు విధము తన తండ్రి నామము మీదికి అవమానమును తెచ్చునేమోయని ఆయన భయపడుచున్నాడు. ఇక కొద్ది గంటలలో నీచాతినీచమైన—దేవునికి వ్యతిరేకముగా దైవదూషణ చేసిన—వ్యక్తిగా ఒక కొయ్యపై వ్రేలాడదీయబడునను విషయమును ఆయనిప్పుడు గ్రహించును. ఇది ఆయనను చింతాక్రాంతుని చేయును.

అలా చాలాసేపు ప్రార్థించిన తరువాత, యేసు మరలా వచ్చినప్పుడు తన ముగ్గురు అపొస్తలులు నిద్రించియుండుటను ఆయన కనుగొనును. పేతురు నుద్దేశించి మాట్లాడుచు, ఆయనిట్లనును: “ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” అయితే రాత్రిగడచి చాలాసేపయినందున వారి నిద్రాభారమును గుర్తించినవాడై, ఆయనిట్లనును: “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.”

ఆ పిమ్మట యేసు రెండవమారు వెళ్లి “ఈ గిన్నెను,” అనగా యెహోవా తనకొరకు ఏర్పరచిన భాగము, లేక చిత్తమును తనయొద్దనుండి తొలగించుమని దేవుని వేడుకొనును. ఆయన తిరిగి వచ్చినప్పుడు, శోధనలో ప్రవేశించకుండ ఉండుటకు ప్రార్థించవలసిన ఆ ముగ్గురు మరలా నిద్రించుటను ఆయన చూచును. యేసు వారితో మాట్లాడినప్పుడు, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచదు.

చివరగా, మూడవసారి యేసు కొంత దూరము అనగా రాతివేత దూరము వెళ్లి, మోకాళ్లూని మహారోదనముతోను కన్నీళ్లతోను ఇట్లు ప్రార్థించును: “తండ్రీ, ఈ గిన్నె నా యొద్దనుండి (తొలగించుట) నీ చిత్తమైతే తొలగించుము.” నేరస్థునిగా తన మరణము తన తండ్రి నామము మీదికి తీసికొనివచ్చు అవమానము విషయమై యేసు ఆలోచించుచు బహుగా బాధపడుచున్నాడు. దైవదూషణ చేయుచున్నాడను—దేవుని శపించువాడను—అభియోగము ఆయనకు భరింపరానిదై యున్నది!

విషయమట్లున్నను, యేసు “అయినను నా యిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక” అని ప్రార్థించును. యేసు విధేయతతో తన చిత్తమును దేవునికి లోబరచును. అప్పుడు, పరలోకమునుండి ఒక దూత ఆయనకు కనబడి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలతో ఆయనను బలపరచును. బహుశ ఆ దూత ఆయన తండ్రియొక్క చిరునవ్వుతోకూడిన ఆమోదమును గూర్చి యేసుకు చెప్పియుండవచ్చును.

అయినను, యేసు భుజాలపై ఎంత భారము ఉన్నది! తన స్వంత నిత్యజీవము మరియు యావత్‌ మానవజాతియొక్క నిత్యజీవము ఊగిసలాడుచున్నవి. భావోద్రేక వత్తిడి చెప్పనలవికానంతగా ఉన్నది. కావున యేసు మరింత వేదనతో ఆతురతతో ప్రార్థించుచుండగా, ఆయన చెమట, నేలమీద పడుచుండగా రక్తపు బిందువులాయెను. “ఇది చాలా అరుదైన ఆశ్చర్యాద్భుతమైన సంగతియైనను, రక్తపు చెమట . . . విపరీతమైన భావోద్రేక పరిస్థితిలో సంభవించునని” ది జార్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అభిప్రాయపడుచున్నది.

ఆ తర్వాత, యేసు మూడవసారి తన అపొస్తలుల యొద్దకు రాగా వారు మరలా నిద్రించియుండుటను ఆయన కనుగొనును. వారు దుఃఖముచేత డస్సిపోయారు. ‘ఈ సమయములోనా మీరు నిద్రించి అలసట తీర్చుకొనేది! ఇక చాలును,’ అని అంటూ ఆయన, “ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని” వారితో చెప్పును.

ఆయన ఇంకను మాటలాడుచుండగా, కాగడాలు, దీపములు ఆయుధములు చేతబూనిన జనసమూహము వెంటరాగా ఇస్కరియోతు యూదా ప్రవేశించి ఆయనను సమీపించును. మత్తయి 26:30, 36-47; 16:21-23; మార్కు 14:26, 32-43; లూకా 2:39-47; యోహాను 18:1-3; హెబ్రీయులు 5:7.

మేడగదిని విడిచిన తర్వాత, యేసు ఆయన అపొస్తలులు ఎక్కడికి వెళ్లిరి, ఆయన అక్కడ ఏమిచేయును?

యేసు ప్రార్థించుచుండగా, అపొస్తలులు ఏమిచేయుదురు?

యేసు ఎందుకు క్షోభపడుచున్నాడు, మరియు ఆయన దేవునికి ఏ విన్నపములు చేయును?

యేసు చెమట బిందువులు రక్తముగా మారుటద్వారా ఏమి సూచించబడెను?