దయ్యముపట్టిన బాలుడు స్వస్థపరచబడెను
అధ్యాయము 61
దయ్యముపట్టిన బాలుడు స్వస్థపరచబడెను
యేసు, పేతురు, యాకోబు మరియు యోహాను బహుశ హెర్మోను పర్వతచరియనుండి దూరముగా వెళ్లుచుండగా, ఇతర శిష్యులు ఒక సమస్యలో చిక్కుకొందురు. తిరిగివచ్చిన వెంటనే యేసు ఏదో తప్పిదమున్నట్లు గమనిస్తాడు. తన శిష్యులచుట్టు ఒక జనసమూహము గుమికూడియుండగా, శాస్త్రులు వారితో వాదించుచుండిరి. ప్రజలు యేసును చూచినవెంటనే, బహుగా ఆశ్చర్యపడి ఆయనయొద్దకు పరుగెత్తికొనివచ్చి ఆయనకు వందనము చేయుదురు. “మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారు?” అని ఆయన వారినడుగును.
ఆ గుంపులోనుండి ఒకడు ముందుకువచ్చి యేసు ఎదుట మోకాళ్లూని, “బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడువాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్చిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని” వివరించును.
తన శిష్యులలో అనేకులు ఆ బాలుని స్వస్థపరచలేక పోయినందుకు నిశ్చయంగా శాస్త్రులు దానిని ఆసరాగా తీసుకొని, బహుశ వారి ప్రయత్నాలను అపహసించుచున్నారు, ఈ క్లిష్టసమయములో యేసు అక్కడికి చేరుకొని వారితో, “విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతోనుందును? ఎంతవరకు మిమ్మును సహింతును?” అని అనును.
యేసు ఈ మాటలను అక్కడ చేరియున్న వారందరిని ఉద్దేశించి మాట్లాడినట్లు కన్పించుచున్నది, గానీ నిస్సందేహముగా ఆయన తన శిష్యులను ఇబ్బందిపెట్టుచున్న శాస్త్రులను ప్రత్యేకముగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడును. ఆ పిమ్మట, యేసు ఆ బాలుని విషయమై మాట్లాడుచు, “వానిని నాయొద్దకు తీసుకొని రండని” చెప్పును. అయితే ఆ బాలుడు యేసునొద్దకు వచ్చుచుండగా, వానిలోని దయ్యము వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండును.
“ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని” యేసు అడుగును.
దానికి అతని తండ్రి, “బాల్యమునుండియే; అది (దయ్యము) వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును” అని జవాబిచ్చి, ఆ పిమ్మట “ఏమైనను, నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమని” వేడుకొనును.
బహుశ కొన్నియేండ్లుగా ఆ తండ్రి సహాయము కొరకు వెదకుచుండవచ్చును. ఇప్పుడు యేసు శిష్యులు విఫలమగుటతో, అతని నిరాశ అధికమగును. నిరాశతో నిండిన అతని విన్నపమును మరలా ప్రస్తావించి, ప్రోత్సాహకరమైన రీతిలో యేసు ఇట్లనును: “‘నీవలననైతే,’ అనుమాట ఎందుకు! నమ్మువానికి సమస్తమును సాధ్యమే.” (NW)
వెంటనే ఆ తండ్రి, “నమ్ముచున్నాను!” అని బిగ్గరగా చెప్పును. అయితే “నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని” బ్రదిమిలాడును.
జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొని వచ్చుట గమనించి యేసు, “మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని” ఆ దయ్యమును గద్దించును. అది వానిని విడిచిపెట్టుచు, మరలా వానినెంతో విలవిలలాడించి క్రిందపడవేయును. అందువలన, ఆ బాలుడు కదలకుండ నేలమీద పడియుండగా, అనేకులు “వాడు చనిపోయెనని” చెప్పుకొనసాగిరి. అయితే యేసు ఆ బాలుని చెయ్యి పట్టుకొనగా అతడు లేచును.
అంతకుముందు, ప్రకటించుటకు శిష్యులు పంపబడినప్పుడు, వారు దయ్యములను వెళ్లగొట్టిరి. కావున వారు ఒక ఇంటిలో ప్రవేశించునప్పుడు, వారు యేసును ఏకాంతముగా ఇట్లడుగుదురు: “మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమి?”
అది వారి విశ్వాసలోపమువలన జరిగినదని సూచించుచు, యేసు వారికిట్లు జవాబిచ్చును: “ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము.” ఈ విషయములో జరిగినట్లు, ప్రత్యేకముగా శక్తివంతమైన దయ్యములను వెళ్లగొట్టుటకు నిజమైన సిద్ధపాటు అవసరమని అది చూపించెను. ధృఢమైన విశ్వాసము, దానికితోడు శక్తిమంతులనుచేయు దేవుని సహాయము కొరకైన ప్రార్థన అవసరమైయుండెను.
మరియు యేసు ఇంకను ఇట్లు చెప్పును: “మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండనుచూచి ‘ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే’ అదిపోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” విశ్వాసము ఎంత శక్తివంతముగా ఉండగలదు!
యెహోవా సేవలో అభివృద్ధిని అడ్డగించే ఆటంకములు, కష్టములు, అక్షరార్థమైన ఒక పెద్ద పర్వతమును దాటలేని మరియు తొలగింపలేని విధముగా కనిపించవచ్చును. అయినను, మనము మనహృదయములలో విశ్వాసమును సాగుచేసి, నీరుపోయుచు, పెరుగుటకు దానిని ప్రోత్సహించినట్లయిన, అది పరిపక్వతకు చేరి మనము అటువంటి పర్వతములను పోలిన ఆటంకములను మరియు కష్టములను దాటుకొనివచ్చుటకు మనలను శక్తిమంతులను చేయునని యేసు చూపుచున్నాడు. మార్కు 9:14-29; మత్తయి 17:19, 20; లూకా 9:37-43.
▪ హెర్మోను పర్వతమునుండి తిరిగివచ్చినప్పుడు యేసు ఏ పరిస్థితిని ఎదుర్కొనును?
▪ దయ్యము పట్టిన బాలుని తండ్రికి యేసు ఎటువంటి ప్రోత్సాహమును ఇచ్చును?
▪ శిష్యులు దయ్యమును ఎందుకు వెళ్లగొట్టలేకపోవుదురు?
▪ విశ్వాసము ఎంత బలముగా తయారు కాగలదని యేసు చూపించును?