కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవాలయములో పరిచర్య పూర్తిచేయబడెను

దేవాలయములో పరిచర్య పూర్తిచేయబడెను

అధ్యాయము 110

దేవాలయములో పరిచర్య పూర్తిచేయబడెను

యేసు దేవాలయములో చివరిసారిగా కన్పించును. వాస్తవానికి, ఆయన ఇక మూడు రోజులలో జరగనైయున్న తన న్యాయవిచారణ మరియు చంపబడుట మినహా భూమిపై తన బహిరంగ పరిచర్యను ముగించుచున్నాడు. ఆయనిప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఖండించుటను ఇంకను కొనసాగించును.

మరి మూడుసార్లు కూడ ఆయనిట్లనును: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా!” మొదట ఆయన వారిమీద శ్రమను ప్రకటించెను, ఎందుకనగా వారు “గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురుగాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.” కావున ఆయనిట్లు బుద్ధిచెప్పును: “గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.”

ఆ పిమ్మట ఆయన, పైకిభక్తిని ప్రదర్శించుటద్వారా దాచిపెట్టుటకు ప్రయత్నించుచున్న శాస్త్రుల, పరిసయ్యుల లోపలగల కుళ్లు మరియు మురుగునుబట్టి వారి మీద శ్రమను ప్రకటించును. “మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడునుగాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి” అని ఆయన అనును.

చివరగా, తమ దాతృత్వక్రియలవైపు దృష్టి మళ్లించుటకు ప్రవక్తల సమాధులను కట్టించి వాటిని అలంకరించుటకు ఇష్టపడుటతో వారి వేషధారణ వెల్లడియగుచున్నది. అయినను, యేసు బహిర్గతము చేయునట్లుగా, వారు “ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారు.” వారి వేషధారణను బహిర్గతము చేయుటకు సాహసించువారు నిజముగా అపాయమందున్నారు!

యేసు ఇంకను కొనసాగించుచు, వారిని అతి తీవ్రముగా ఖండించు మాటలను పలుకును. “సర్పములారా, సర్పసంతానమా, గెహెన్నా శిక్షను మీరేలాగు తప్పించుకొందురు?” (NW) అని ఆయన అనును. గెహెన్నా యెరూషలేముయొక్క కసువుదొడ్డిగా ఉపయోగింపబడుచున్న లోయయైయుండెను. కావున దుష్టమార్గమును వెంబడించుచున్న శాస్త్రులు, పరిసయ్యులు నిత్యనాశనము ననుభవింతురని యేసు చెప్పుచున్నాడు.

తన ప్రతినిధులుగా తాను పంపుచున్న వారి విషయమై, యేసు ఇట్లనును: “మీరు వారిలో కొందరిని చంపి వ్రేలాడదీయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన, బరకీయ [రెండవ దినవృత్తాంతములలో యెహోయాదా అని పిలువబడెను] కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరము వారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

జెకర్యా ఇశ్రాయేలీయుల మతనాయకులను దండించినందున, “వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాతివేతలచేత అతని చావగొట్టిరి.” అయితే యేసు ముందే చెప్పునట్లుగా, అటువంటి నీతిమంతుల రక్తమును చిందించినందుకు ఇశ్రాయేలు తగిన మూల్యము చెల్లించును. 37 సంవత్సరముల తర్వాత అనగా సా.శ. 70లో రోమా సైన్యము యెరూషలేమును నాశనముచేసి పదిలక్షలకంటె ఎక్కువమంది యూదులను హతమార్చినప్పుడు వారు ఆ మూల్యమును చెల్లింతురు.

ఈ భయంకరమైన పరిస్థితిని యేసు ఆలోచించినప్పుడు, ఆయనెంతో కృంగిపోవును. “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తనపిల్లలను రెక్కలక్రిందికి కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటినిగాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది,” అని ఆయన మరలా ఒకసారి ప్రకటించును.

ఆ పిమ్మట యేసు ఇంకను ఇట్లనును: “ఇది మొదలుకొని, ‘యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని’ మీరు చెప్పువరకు నన్ను చూడరు.” (NW) ఆ దినము క్రీస్తు ప్రత్యక్షతా కాలమైయుండును, అప్పుడు ఆయన తన పరలోక రాజ్యమందు వచ్చును కాగా ప్రజలు తమ విశ్వాస నేత్రములతో ఆయనను చూతురు.

యేసు ఇప్పుడు తాను చూడగలుగునట్లు దేవాలయములో కానుకలపెట్టెలుండు స్థలమునకు వచ్చును, కాగా అక్కడ ప్రజలు వాటిలో డబ్బులు వేయసాగుదురు. ధనవంతులు అనేక నాణెములు వేయుదురు. అయితే ఒక బీద విధవరాలువచ్చి చాలా కొద్దివిలువగల రెండు చిన్న నాణెములను వాటిలో వేయును.

యేసు తన శిష్యులను పిలిచి, ఇట్లనును: “కానుకపెట్టెలో డబ్బు వేసినవారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఇది ఎట్లు కాగలదో వారు ఆశ్చర్యపడియుండవచ్చును. కావున యేసు వారికిట్లు వివరించును: “వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరిగాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను.” ఈ మాటలు చెప్పిన తరువాత, చివరిసారిగా యేసు దేవాలయమునుండి వెళ్లిపోవును.

ఆలయ విస్తీర్ణత, మనోహరత్వమునకు ఆశ్చర్యపడి, ఆయన శిష్యులు, “బోధకుడా, ఈ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని” ఆయనతో అందురు. నిజమే ఆ రాళ్లు 11 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, 3 మీటర్లకంటే ఎక్కువ ఎత్తుగలవిగా యుండెను.

దానికి జవాబుగా, “ఈ గొప్ప కట్టడములు చూచుచున్నారే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని” యేసు చెప్పును.

ఈ మాటలు చెప్పిన తరువాత, యేసు ఆయన అపొస్తలులు కిద్రోను లోయదాటి ఒలీవల కొండమీదకు వెళ్లుదురు. ఇక్కడనుండి వారు క్రిందగల మహాద్భుతమైన దేవాలయమును చూడగలరు. మత్తయి 23:25–24:3; మార్కు 12:41–13:3; లూకా 21:1-6; 2 దినవృత్తాంతములు 24:20-22.

దేవాలయమునకు చివరిసారి వెళ్లినప్పుడు యేసు ఏమిచేయును?

శాస్త్రుల, పరిసయ్యుల వేషధారణ ఎట్లు ప్రదర్శింపబడును?

“గెహెన్నా తీర్పు” అనగా దాని భావమేమి?

ధనవంతులకంటె విధవరాలు ఎక్కువ వేసెనని యేసు ఎందుకు చెప్పును?