దేవుడు చెప్పిన సమస్తమును యేసు పూర్తిచేయును
అధ్యాయము 133
దేవుడు చెప్పిన సమస్తమును యేసు పూర్తిచేయును
యోధుడగు-రాజైన యేసుక్రీస్తు సాతానును అతని అవినీతి లోకమును సమూలంగా నిర్మూలించినప్పుడు, ఉల్లసించుటకు అది ఎంత మంచి కారణమో! చివరకు యేసుయొక్క సమాధానకరమైన వెయ్యేండ్ల పరిపాలన ఆరంభమగును!
యేసు మరియు ఆయన సహరాజుల నడిపింపు క్రింద, హార్‌మెగిద్దోను తప్పించుకొనువారు ఆ నీతియుక్త యుద్ధానంతర శిధిలాలను శుభ్రము చేయుదురు. బహుశః, భూమిమీద తప్పించుకున్నవారు కొంతకాలము వరకు పిల్లలనుకూడా కందురు, వీరుకూడ భూమిని సాగుచేసి దానిని శోభాయమానమైన ఉద్యానవనముగా మార్చు పనిలో భాగము వహింతురు.
తగిన సమయమున, ఈ అందమైన పరదైసులో ఆనందమును అనుభవించుటకు యేసు అసంఖ్యాకులైన ప్రజలను సమాధులలోనుండి లేపును. తన స్వంత అభయము ప్రకారము ఆయన దీనిని చేయును: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు . . . బయటికి వచ్చెదరు.”
యేసు పునరుత్థానము చేయువారిలో ఆయన ప్రక్కనే హింసాకొయ్యపై వ్రేలాదీయబడి మరణించిన ఆ నేరస్థుడును ఉండును. యేసు అతనికి ఇలా వాగ్దానము చేసిన విషయాన్ని గుర్తుతెచ్చుకొనుము: “నిజముగా నేడు నేను నీతో చెప్పుచున్నాను, నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.” యేసుతోపాటు రాజుగా పరిపాలించుటకు ఆ మనుష్యుడు పరలోకమునకు తీసుకొనివెళ్లబడడు, లేక యేసు మరలా మానవుడై పరదైసు భూమిలో ఆ మనుష్యునితోపాటు జీవించడు. గానీ, యేసు ఆ పాతనేరస్థునితో ఎలా ఉండునంటే, ఆయన అతనిని పరదైసులోని జీవమునకు పునరుత్థానునిచేసి, తర్వాతి పేజీలో దృష్టాంతపరచినట్లు, అతని భౌతిక మరియు ఆత్మీయ అవసరతలు తీరునట్లు చూచును.
దానిని ఆలోచించుము! యేసు ప్రేమపూర్వక శ్రద్ధక్రింద, యావత్ మానవజాతి—హార్‌మెగిద్దోనును తప్పించుకొనువారు, వారి సంతానము, మరియు ఆయనకు లోబడు మృతులై పునరుత్థానులగు కోట్లాదిమంది—మానవ పరిపూర్ణతకు ఎదుగుదురు. రాజైన తనకుమారుడగు యేసుక్రీస్తు ద్వారా, యెహోవా ఆత్మీయముగా మానవజాతితో నివసించును. పరలోకమునుండి ఒక స్వరము ఈలాగు చెప్పుట యోహాను వినెను: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” భూమిపైనున్న ఏ మనుష్యుడును బాధనొందడు లేక రోగియైయుండడు.
విస్తరించి భూమిని నిండించుడని మొదటి మానవ జతయైన ఆదాము హవ్వలకు దేవుడు చెప్పినప్పుడు, ఆయన ఆది సంకల్పము ఏమైయుండెనో, అదే పరిస్థితి యేసు వెయ్యేండ్ల పరిపాలన ముగియునాటికి ఉండును. అవును, ఈ భూమి నీతిమంతులైన పరిపూర్ణ మానవులచే నింపబడును. ఇట్లెందుకు ఉండుననగా, యేసు విమోచన క్రయధన బలి విలువలు ప్రతివారికి అన్వయింపబడును. ఆదాము పాపమువలన కలిగిన మరణము ఇక ఉండదు!
ఆ విధముగా, యెహోవా తనను అడిగిన సమస్తమును యేసు నెరవేర్చినవాడై యుండును. కాబట్టి, వెయ్యేండ్ల పరిపాలనాంతమున, ఆయన రాజ్యమును, పరిపూర్ణ మానవ కుటుంబమును తన తండ్రికి అప్పగించును. అప్పుడు దేవుడు సాతానును అతని దయ్యములను మరణమువంటి నిష్క్రియతోకూడిన అగాధములోనుండి విడుదల చేయును. ఎందుకొరకు?
వెయ్యేండ్ల పరిపాలనాంతమునకు, పరదైసులో జీవించు వారిలో అనేకులు ఎన్నడును తమ విశ్వాసము పరీక్షింపబడని పునరుత్థానులే. చనిపోకముందు వారు ఎన్నడును దేవుని వాగ్దానములను ఎరిగియుండలేదు కావున వారు వాటియందు విశ్వాసమును ప్రదర్శించలేకపోయిరి. అందుచే, పునరుత్థానము చేయబడి బైబిలు సత్యములు బోధింపబడిన తర్వాత, ఎలాంటి వ్యతిరేకత లేకుండా పరదైసునందు దేవుని సేవించుట వారికి సులభముగా యుండును. అయితే దేవుని ఎడతెగక సేవించకుండ వారిని ఆపుజేయ ప్రయత్నించుటకు సాతానుకు అవకాశమిచ్చినట్లయితే, ఆ పరీక్షలో వారు నమ్మకస్థులని నిరూపించుకొందురా? ఈ ప్రశ్నను పరిష్కరించుటకే, సాతాను విడుదల చేయబడును.
యేసు వెయ్యేండ్ల పరిపాలన తర్వాత, సాతాను లెక్కకు విస్తారమైనంత మందిని దేవుని సేవింపకుండా త్రిప్పివేయుటలో సఫలుడగునని యోహాను కివ్వబడిన ప్రకటన వెల్లడిచేయుచున్నది. అయితే కడవరి పరీక్ష పూర్తియైనప్పుడు, సాతాను, అతని దయ్యములు, మరియు అతనిచే మోసము చేయబడిన వారందరు శాశ్వతముగా నాశనము చేయబడుదురు. మరొకవైపున, పూర్తిగా పరీక్షింపబడి నమ్మకస్థులుగా తప్పింపబడువారు యుగయుగముల వరకు తమ పరలోకపు తండ్రి ఆశీర్వాదములను అనుభవించుటకు జీవింతురు.
దేవుని దివ్య సంకల్పములను నెరవేర్చుటలో స్పష్టముగా యేసు, ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించెను, ఇంకను పోషించును. దేవుని గొప్ప పరలోక రాజుగా ఆయన నెరవేర్చు సమస్తమునుండి మనమెంతటి గొప్ప భవిష్యత్తును అనుభవించవచ్చును. అయినను, మానవునిగా ఆయన చేసిన యావత్తును మనము మర్చిపోలేము.
యేసు ఇష్టపూర్వకముగా భూమికివచ్చి ఆయన తండ్రినిగూర్చి మనకు బోధించెను. వీటన్నింటికిమించి ఆయన దేవుని ప్రశస్త లక్షణములకు మాదిరికర్తగా ఉండెను. ఆయన ఉతృష్టమైన ధైర్యమును, పురుషోచితత్వమును, ఆయన అసమానమైన జ్ఞానమును, బోధకునిగా ఆయన శ్రేష్ఠమైన సామర్థ్యమును, ఆయన సాహసవంతమగు నాయకత్వమును, ఆయన మృదువైన కనికరము మరియు సహానుభూతిని మనమాలోచించినప్పుడు మనహృదయములు కదిలింపబడును. మనము కేవలము దేనిద్వారా జీవము పొందగలమో, ఆ విమోచన క్రయధనమును చెల్లించునప్పుడు ఆయనెట్లు వర్ణననాతీతమైన బాధననుభవించెనో మనము గుర్తుచేసికొనినప్పుడు, ఆయనయెడల గుణగ్రహణముతో నిశ్చయముగా మన హృదయములు స్పందించబడును!
నిజముగా, యేసు జీవితమును గూర్చిన ఈ పఠనములో మనమెటువంటి మహామనుష్యుని చూచితిమి! ఆయన గొప్పతనము మహోన్నతమైనది, దృగ్గోచరమైనది. “ఇదిగో ఈ మనుష్యుడు” అని పలికిన రోమా గవర్నయిన పొంతి పిలాతు మాటలను మనమూ ప్రతిధ్వనించ ప్రేరేపించబడుచున్నాము. అవును, నిజముగా, “ఈ మనుష్యుడు,” జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి!
ఆయన విమోచన క్రయధన బలిని మనమంగీకరించుట ద్వారా, ఆదాము నుండి సంక్రమించిన పాపమరణముల భారము మననుండి తొలగింపబడగలదు మరియు యేసు మన “నిత్యుడగు తండ్రి” కాగలడు. నిత్యజీవము పొందు వారందరు తప్పక దేవుని గూర్చియే కాకుండా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకొనవలెను. మీరీ పుస్తకమును చదివి పఠించుట వలన అటువంటి జీవమునిచ్చు జ్ఞానమును సంపాదించుటకు అది మీకు సహాయము చేయును గాక! 1 యోహాను 2:17; 1:7; యోహాను 5:28, 29; 3:16; 17:3; 19:5; లూకా 23:43; ఆదికాండము 1:28; 1 కొరింథీయులు 15:24-28; ప్రకటన 20:1-3, 6-10; 21:3, 4; యెషయా 9:6.
▪ హార్‌మెగిద్దోనును తప్పించుకొనువారు మరియు వారి సంతానము యొక్క సంతోషదాయకమైన ఆధిక్యత ఏమైయుండును?
▪ హార్‌మెగిద్దోనును తప్పించుకొనువారికి, వారి సంతానమునకు తోడు మరెవరుకూడ పరదైసు ఆనందము ననుభవింతురు, మరియు ఏ విధముగా యేసు వారితోకూడ ఉండును?
▪ వెయ్యేండ్ల పరిపాలనాంతమున పరిస్థితి ఏమైయుండును, అప్పుడు యేసు ఏమిచేయును?
▪ అగాధమునుండి సాతాను ఎందుకు విడుదల చేయబడును, చివరకు అతనికి అతని ననుసరించువారికి ఏమి సంభవించును?
▪ యేసు మన “నిత్యుడగు తండ్రి” ఎట్లు కాగలడు?