దేవుని కుడిపార్శ్వమున ఉండుట
అధ్యాయము 132
దేవుని కుడిపార్శ్వమున ఉండుట
పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట యేసు తిరిగి పరలోకమునకు చేరుకొనెననుటకు రుజువైయున్నది. ఆ తర్వాత కొద్ది దినములకే శిష్యుడైన స్తెఫనుకు ఇవ్వబడిన దర్శన భాగ్యంకూడ ఆయన అక్కడకు చేరుకొనెనని నిరూపించుచున్నది. ఆయన నమ్మకముగా సాక్ష్యమిచ్చినందుకే రాళ్లతో కొట్టబడుటకు ముందు స్తెఫను, “ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని” చెప్పును.
దేవుని కుడిపార్శ్వమున ఉండగా, యేసు తన తండ్రియొక్క ఈ ఆజ్ఞ కొరకు వేచియుండును: “నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.” అయితే అంతవరకు, అనగా తన శత్రువులపై చర్యగైకొను పర్యంతము, యేసు ఏమిచేయును? ఆయన రాజ్యంచేయును, లేక ప్రకటించు పనిలో వారిని నడిపించుచు, పునరుత్థానము ద్వారా, తన తండ్రి రాజ్యములో తనతోటి రాజులుగా తయారగుటకు వారిని సిద్ధముచేయుచు తన అభిషక్తులైన శిష్యులపై ఆయన అధికారము చేయును.
ఉదాహరణకు, ఇతర దేశములలో శిష్యులనుచేయు పనిలో నాయకత్వం వహించుటకై యేసు సౌలును (ఆ తర్వాత అతడు పౌలు అనే రోమా పేరుతోనే అధికంగా పిలువబడెను) ఎన్నుకొనును. సౌలు దేవుని ధర్మశాస్త్రము యెడల మిగల ఆసక్తిగలవాడు, అయితే యూదా మతనాయకులు అతనిని తప్పుదోవ పట్టింతురు. తత్ఫలితముగా, సౌలు స్తెఫను హత్యను ఆమోదించుటయే గాకుండ, యేసు అనుచరులనబడిన స్త్రీపురుషులు ఎవరైనా కనబడితే వారిని బంధించి యెరూషలేమునకు తీసికొనివచ్చులాగున ప్రధాన యాజకుడైన కయపనొద్ద అధికారము పుచ్చుకొని దమస్కుకు వెళ్లును. అయితే, సౌలు మార్గమున నుండగా, అకస్మాత్తుగా ప్రకాశమానమైన వెలుగు అతనిచుట్టు ప్రకాశింపగా అతడు నేలపై పడును.
“సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?” అని ఒక అదృశ్య స్వరము అడుగగా, “ప్రభువా, నీవెవడవు?” అని సౌలు ప్రశ్నించును.
“నేను నీవు హింసించుచున్న యేసును” అని జవాబువచ్చును.
ఆ అద్భుతమైన వెలుగువలన గ్రుడ్డివాడైన సౌలు, దమస్కులో ప్రవేశించి ఏమిచేయవలెనో తెల్పువరకు అక్కడే ఉండవలెనని యేసు ఆయనకు చెప్పును. ఆ పిమ్మట, యేసు తన శిష్యుడైన అననీయకు దర్శనమందు కన్పించును. సౌలును గూర్చి యేసు అననీయకు ఇట్లు తెల్పును: “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.”
నిజముగా, యేసు తోడ్పాటుతో, సౌలు (ఇప్పుడు పౌలు అని తెలియబడిన) ఇతర సువార్తికులు వారి ప్రకటించు, బోధించు పనిలో మహత్తరమైన విజయము సాధింతురు. వాస్తవానికి, దమస్కునకు వెళ్లుదారిలో యేసు ఆయనకు కన్పించిన 25 సంవత్సరముల తర్వాత పౌలు, “సువార్త” “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడెనని” వ్రాయుచున్నాడు.
ఇంకా అనేక సంవత్సరాలు గడచిన తర్వాత, తాను ప్రేమించిన అపొస్తలుడగు యోహానుకు యేసు వరుసగా దర్శనములను అనుగ్రహించును. బైబిలు పుస్తకమగు ప్రకటనలో యోహాను వర్ణించిన ఈ దర్శనములద్వారా, నిజానికి అతడు యేసు రాజ్యధికారమునకు వచ్చు సంఘటనను చూచుటకై జీవించును. “ఆత్మవశుడై” తాను “ప్రభువు దిన” కాలమునకు కొనిపోబడెనని యోహాను చెప్పుచున్నాడు. ఈ “దినము” ఏమైయున్నది?
అంత్యదినములను గూర్చి యేసుచెప్పిన ప్రవచనముతోపాటు బైబిలు ప్రవచనములను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆ “ప్రభువు దినము” చరిత్ర సృష్టించిన 1914వ సంవత్సరములో, అవును, ఈ తరములోనే ఆరంభమాయెనని బయల్పడుచున్నది. కావున ప్రజలందరి ఆర్భాటము లేకుండా, ఆయన తిరిగివచ్చే విషయాన్ని కేవలము ఆయన నమ్మకమైన సేవకులు మాత్రమే గ్రహించునట్లు 1914లో యేసు అదృశ్యముగా తిరిగివచ్చెను. ఆ సంవత్సరములోనే యెహోవా యేసుకు తన శత్రువుల మధ్యను పరిపాలించుమని ఆజ్ఞాపించెను.
యేసు తన తండ్రి ఆజ్ఞకులోబడి, సాతాను అతని దయ్యములను భూమికి పడద్రోసి పరలోకమును శుభ్రము చేశాడు. దర్శనములో ఇది జరుగుటను చూచిన పిదప, పరలోకమునుండి వెలువడిన ఒక స్వరాన్ని యోహాను వినును: “ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.” అవును, 1914లో క్రీస్తు రాజుగా పరిపాలించుటకు ఆరంభించెను!
పరలోకమందున్న యెహోవా ఆరాధికులకు ఇది ఎంతటి సువార్తయో! వారిట్లు ఉపదేశింపబడిరి: “పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి.” అయితే భూమిపై నివసించువారి పరిస్థితి ఏమైయుండును? పరలోకమందలి ఆ స్వరము ఇంకను ఇట్లనెను: “భూమి, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”
మనమిప్పుడు ఆ కొద్దిసమయములోనే జీవించుచున్నాము. ప్రజలు ప్రస్తుతము దేవుని నూతన విధానములోనికి ప్రవేశించుటకుగానీ, నాశనమగుటకుగానీ వేరుచేయ బడుచున్నారు. సత్యమేమనగా, క్రీస్తు నడిపింపు క్రింద ప్రపంచవ్యాప్తముగా ప్రకటింపబడుచున్న దేవుని రాజ్యసువార్తకు నీవెట్లు ప్రత్యుత్తరమిత్తువను దానిపై ఆధారపడి నీ స్వంత భవిష్యత్ జీవితం ఇప్పుడు తీర్మానించబడుచున్నది.
ప్రజలను వేరుచేయుట పూర్తియైనప్పుడు, దేవుని ప్రతినిధిగా యేసుక్రీస్తు ఈ భూమినుండి సాతాను సమస్త విధానమును, దానికి మద్దతునిచ్చు వారిని తొలగించును. బైబిలులో హార్‌మెగిద్దోను, లేక అర్మమెగిద్దోను అని పిలువబడిన యుద్ధములో యేసు ఈ దుష్టత్వమును తొలగించు పని పూర్తిచేస్తాడు. ఆ తర్వాత, విశ్వములో యెహోవా దేవుని తర్వాత మహాగొప్ప వ్యక్తియగు యేసు, సాతానును అతని దయ్యములను బంధించి వెయ్యిసంవత్సరములు “అగాధములో,” అనగా మరణమును పోలిన నిష్క్రియా స్థితిలో పడవేయును. అపొ. కార్యములు 7:55-60; 8:1-3; 9:1-19; 16:6-10; కీర్తన 110:1, 2; హెబ్రీయులు 10:12, 13; 1 పేతురు 3:22; లూకా 22:28-30; కొలొస్సయులు 1:3, 23; ప్రకటన 1:1, 10; 12:7-12; 16:14-16; 20:1-3; మత్తయి 24:14; 25:31-33.
▪ యేసు పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత, ఆయన ఎక్కడ ఉన్నాడు, దేనికొరకు ఆయన వేచి ఉండును?
▪ పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత యేసు ఎవరిపై పరిపాలించును, ఆయన పరిపాలన ఎట్లు కనబడుతుంది?
▪ “ప్రభువు దినము” ఎప్పుడు ఆరంభమాయెను, దాని ఆరంభములో ఏమి జరిగెను?
▪ మనలో వ్యక్తిగతముగా ప్రతివారిపై ప్రభావముచూపు ఏ వేరుచేయుపని ఈనాడు కొనసాగుచున్నది, మరియు దేని ఆధారముగా ఈ వేరుచేయు పని జరుగుచున్నది?
▪ వేరుచేయు పని ముగించబడిన, తర్వాత ఏ సంఘటనలు జరుగును?