ద్రాక్షతోటలోని పనివారు
అధ్యాయము 97
ద్రాక్షతోటలోని పనివారు
“మొదటివారు అనేకులు కడపడివారగుదురు, కడపటివారు మొదటివారగుదురని” యేసు ఇంతకుముందే చెప్పెను. ఇప్పుడు ఆయన ఒక కథను చెప్పుటద్వారా దీనిని దృష్టాంతపరచును. “పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరెను” అని ఆయన ఆరంభించును.
యేసు ఇట్లు కొనసాగించును: “[ఆ యజమానుడు] దినమునకు ఒక దేనారముచొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరలవెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఉరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకోలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.”
ద్రాక్షతోట యజమాని, లేక స్వంతదారుడు యెహోవా దేవుడు, కాగా ఇశ్రాయేలు జనాంగము ద్రాక్షతోటయైయున్నది. ద్రాక్షతోట పనివారు, ధర్మశాస్త్ర నిబంధనలోనికి తీసుకురాబడిన వ్యక్తులు; వారు ప్రత్యేకముగా అపొస్తలుల కాలములో జీవించిన యూదులైయున్నారు. పూర్తిదినము పనిచేయు పనివారితోనే జీతపుబత్తెము ఒడబడి చేసికొనబడినది. ఒక దినమునకు కూలి ఒక దేనారము. పనివారు 9, 12, 3, మరియు 5 గంటలకు పనికి పిలువబడినవారు. నిజానికి దినములో కేవలము వారు వరుసగా 9, 6, 3 మరియు 1 గంట మాత్రమే పనిచేయుదురు.
పన్నెండు గంటలు, లేక పూర్తి దినము పనిచేయు పనివారు, ఎడతెగక మతసేవయందు మునిగియున్న యూదా మతనాయకులను సూచించుచున్నారు. వారు చేపలు పట్టుట లేక ఇతర లౌకిక ఉద్యోగములలో ఎక్కువభాగము తమ జీవితములను గడిపిన యేసు శిష్యులవలె లేరు. ఆయనకు శిష్యులుగా తయారగునట్లు వీరిని సమకూర్చుటకు “యజమానుడు” సా.శ. 29 ఆకురాలు కాలము వరకు యేసుక్రీస్తును పంపలేదు. ఆ విధముగా వారు “కడపటివారు,” లేక 5 గంటలకు వచ్చిన ద్రాక్షతోట పనివారిగా తయారయిరి.
చివరకు, సూచనార్థకమైన పనిదినము యేసు మరణముతో ముగించబడును, అప్పుడు పనివారికి జీతబత్తెము చెల్లించు సమయము వచ్చును. ఇక్కడ వివరింపబడినట్లుగా, చివరివాడికి మొదట జీతము చెల్లించు అసాధారణమైన నియమము అనుసరించబడును. “సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి, పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదటవచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. మొదటివారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసికొని, చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యాజమానునిమీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకనిచూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొనిపొమ్ము; నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా?” ముగింపునందు యేసు అంతకుముందు చెప్పిన అంశమునే మరలా చెప్పుచు, ఇట్లనును: “ఈ ప్రకారమే కడపడివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.”
యేసు మరణమప్పుడు దేనారము పొందలేదుగాని, సా.శ. 33 పెంతెకొస్తునాడు, “గృహనిర్వాహకుడైన” క్రీస్తు తన శిష్యులపై పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు, పొందెదరు. యేసుయొక్క ఈ శిష్యులు “చివరి గంటలో” లేక ఐదు గంటలకు వచ్చిన కూలివారిని పోలియున్నారు. దేనారము పరిశుద్ధాత్మ వరమును సూచించుట లేదు. దేనారము శిష్యులు ఈ భూమిపై ఉపయోగించవలసినదై యున్నది. అది వారి జీవనమని, వారి నిజ్యజీవమని భావము. అది దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుటకు అభిషేకించబడిన, ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉండు ఆధిక్యతయైయున్నది.
త్వరలోనే మొదట కూలికి పిలువబడినవారు యేసు శిష్యులు జీతము తీసికొనుట గమనింతురు, వారు ఆ సూచనార్థక దేనారమును ఉపయోగించుటను వీరు చూతురు. అయితే వారు పరిశుద్ధాత్మ మరియు రాజ్యసంబంధ ఆధిక్యతలకంటె ఎక్కువ కోరుచున్నారు. వారి సణగుడు, అభ్యంతరములు, ద్రాక్షాతోటలోనికి “చివరగా” వచ్చిన కూలివారైన క్రీస్తు శిష్యులను హింసించుటకు దారితీయును.
యేసు ఉపమానమునకు కేవలము మొదటి శతాబ్దములోనే నెరవేర్పుకలదా? లేదు, ఈ 20వ శతాబ్ద క్రీస్తుమతాల మతనాయకులు, వారి స్థానములు మరియు బాధ్యతలనుబట్టి దేవుని సూచనార్థక ద్రాక్షతోటలో పనికొరకు “మొదట” కూలికి పెట్టుకొనబడిరి. వారు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటితో సహవాసముచేయుచున్న సమర్పిత ప్రచారకులను, దేవుని సేవలో దేనికి కొరగాని “చివరి” వారిగా పరిగణించారు. అయితే వాస్తవానికి, మతనాయకులు నిర్లక్ష్యముచేసిన వీరే—దేవుని పరలోక రాజ్యమునకు అభిషక్త రాయబారులుగా సేవచేయు ఘనత అను దేనారమును పొందిరి. మత్తయి 19:30–20:16.
▪ ద్రాక్షతోట దేనిని సూచించును? ద్రాక్షతోట యజమానుడు, 12-గంటలకు, 1-గంటకు చేరిన పనివారు ఎవరిని సూచించుచున్నారు?
▪ సూచనార్థక పనిదినము ఎప్పుడు ముగిసెను, మరియు ఎప్పుడు జీతము ఇవ్వబడెను?
▪ దేనారము ఇవ్వబడుట దేనిని సూచించుచున్నది?