కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్రాక్షతోట ఉపమానముల ద్వారా బయల్పరచబడుట

ద్రాక్షతోట ఉపమానముల ద్వారా బయల్పరచబడుట

అధ్యాయము 106

ద్రాక్షతోట ఉపమానముల ద్వారా బయల్పరచబడుట

యేసు ఆలయములో ఉన్నాడు. తాను ఏ అధికారముతో ఆ పనులు చేయుచున్నాడని అడిగిన మతనాయకులను ఆయన ఇంతకుముందే భంగపరచెను. తమ కలవరమునుండి వారు తేరుకోకముందే, యేసు వారినిట్లగును: “మీకేమి తోచుచున్నది?” ఆ తర్వాత ఒక ఉపమానముద్వారా, ఆయన వారెటువంటివారో చూపించును.

యేసు ఇట్లు వివరించును: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకువచ్చి, ‘కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుమని’ చెప్పగా వాడు ‘పోను’ అని యుత్తరమిచ్చెనుగాని పిమ్మట మనస్సు మార్చుకొనిపోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు ‘అయ్యా, పోదుననెను’ గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడు?” అని యేసు అడుగును.

అందుకు ఆ వ్యతిరేకులు, “మొదటివాడే” అని జవాబిచ్చుదురు.

కావున యేసు ఇంకను ఇట్లు వివరించును: “సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” నిజానికి మొదట, సుంకరులు, వేశ్యలు దేవుని సేవించుటకు నిరాకరించిరి. అయితే ఆ పిమ్మట వారు, మొదటి కుమారునిపోలి మనస్సు మార్చుకొని ఆయనను సేవించిరి. మరొకవైపున, మతనాయకులు రెండవ కుమారునిపోలి, దేవుని సేవించుచున్నామని చెప్పుకొనిరి, అయినను యేసు చెప్పునట్లుగా, “[స్నానికుడైన] యెహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్యలును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి.”

ఆ తర్వాత యేసు, మతనాయకుల విఫలత కేవలము దేవుని సేవించుటను నిర్లక్ష్యముచేయుట మాత్రమే కాదని చూపించును. అయితే వారు వాస్తవముగా కీడుచేయువారును దుష్టులునైయున్నారు. “ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపులనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులును పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి” అని యేసు వివరించును.

“ఇంటి యజమానుడైన” యెహోవా తన “ద్రాక్షతోట” కొరకు ఉంచిన “కాపుల” యొద్దకు పంపిన “దాసులు” ప్రవక్తలైయున్నారు. ఈ కాపులు ఇశ్రాయేలు జనాంగమును నడిపించు ప్రతినిధులై యున్నారు, ఈ జనాంగమును బైబిలు దేవుని “ద్రాక్షతోటగా” గుర్తించుచున్నది.

ఈ “కాపులు” “దాసులను” కొట్టి చంపినందున, “‘వారు తన కుమారుని సన్మానించెదరనుకొని’ తుదకు [ఆ ద్రాక్షతోట యజమాని] వారియొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ‘ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని’ తమలోతాము చెప్పుకొని, అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరని” యేసు వివరించును.

ఇప్పుడు యేసు మతనాయకులనుద్దేశించి వారినిట్లడుగును: “కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును?”

అందుకు ఆ మతనాయకులు, “ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని,” జవాబిచ్చుదురు.

ఇశ్రాయేలు జనాంగమనబడిన యెహోవా “ద్రాక్షతోట” “కాపులలో” వారును చేరియున్నందున, ఆ విధముగా వారు అనుకోకుండానే తమకైతామే తమమీద తీర్పును ప్రకటించుకొనిరి. నిజమైన మెస్సీయయగు, తన కుమారునియందు అటువంటి కాపులు విశ్వాసముంచవలెననుటయే యెహోవా అపేక్షించు ఫలములై యున్నవి. అటువంటి ఫలములనిచ్చుటలో విఫలమైనందున, యేసు ఇట్లు హెచ్చరించును: “‘ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది యెహోవా వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము’ అనుమాట మీరు లేఖనములలో [కీర్తన 118:22, 23లో] ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీయొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయును.”—NW.

శాస్త్రులు ప్రధానయాజకులు ఇప్పుడు, యేసు తమనుగూర్చియే మాట్లాడుచున్నాడని గ్రహించినవారై ఆయనను, అనగా సరియైన “స్వాస్థ్యమును” చంపగోరుదురు. కావున దేవుని రాజ్యములో పరిపాలకులుగావుండు ఆధిక్యత ఒక జనాంగముగా వారినుండి తొలగింపబడి, సరియైన ఫలమిచ్చు ‘ద్రాక్షతోట కాపుల’ ఒకక్రొత్త జనాంగము సృష్టింపబడును.

ఆయనను ప్రవక్తగా పరిగణించిన జనులకు భయపడినందున, మతనాయకులు యేసును ఈ సమయములో చంపుటకు ప్రయత్నించరు. మత్తయి 21: 28-46; మార్కు 12:1-12; లూకా 20:9-19; యెషయా 5:1-7.

యేసు ఉపమానములోని ఇద్దరు కుమారులు ఎవరిని సూచించుచున్నారు?

రెండవ ఉపమానములో, “ఇంటి యజమానుడు,” “ద్రాక్షతోట,” “కాపులు,” “దాసులు,” మరియు “స్వాస్థ్యము” ఎవరెవరిని సూచించెను?

‘ద్రాక్షతోట కాపులకు’ ఏమి జరుగును, మరియు వారి స్థానమెవరికి ఇవ్వబడును?