ధనవంతుడు మరియు లాజరు
అధ్యాయము 88
ధనవంతుడు మరియు లాజరు
యేసు తన శిష్యులతో వస్తుదాయక సంపత్తిని సరియైన రీతిలో ఉపయోగించుటను గూర్చి మాట్లాడుచు, ఒకే సమయములో వీటికిని దేవునికిని దాసులమై యుండలేమని వివరించుచున్నాడు. పరిసయ్యులుకూడ ధనాపేక్షులైనందున, ఈ మాటలు విని, యేసును అపహసించసాగుదురు. కాగా ఆయన వారితో ఇట్లనును: “మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.”
లోకములో ధనవంతులై, రాజకీయ అధికారము, మరియు మతాధిపత్యముగల ప్రజల ఆలోచనలకు విరుద్ధమైనది సంభవించు సమయము ఆసన్నమైనది. వారు అణచివేయబడుదురు. అయితే, తమ ఆత్మీయ అవసరతను గుర్తించు ప్రజలు హెచ్చింపబడనైయున్నారు. పరిసయ్యులతో మాట్లాడుచు యేసు అటువంటి మార్పునుగూర్చియే సూచించును:
“[బాప్తిస్మమిచ్చు] యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యమువైపు త్వరపడి ముందుకు వచ్చుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.”—NW.
మోషే ధర్మశాస్త్రమునకు తాము హత్తుకొనియున్నామని శాస్త్రులు పరిసయ్యులు గర్వముగా చెప్పుకొనుచున్నారు. యెరూషలేములో యేసు అద్భుతరీతిన ఒకనికి చూపువచ్చునట్లు చేసినప్పుడు, వారు “మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము,” అని గొప్పలు చెప్పుకొనుటను గుర్తుతెచ్చుకొనుము. అయితే దేవుడు నియమించిన రాజగు యేసుక్రీస్తునొద్దకు దీనులను నడిపించు ఉద్దేశిత సంకల్పమును ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము నెరవేర్చినది. కావున యోహాను పరిచర్య ఆరంభముతో, అన్నివర్గముల ప్రజలు, ప్రత్యేకించి దీనులు, బీదలు దేవునిరాజ్యములో ప్రజలయ్యేందుకు తీవ్రముగా కృషిచేయుచున్నారు.
మోషే ధర్మశాస్త్రము ఇప్పుడు నెరవేరుచున్నందున, దానిని పాటించు బాధ్యత తీసివేయబడనైయున్నది. ధర్మశాస్త్రము వివిధ ఆధారములనుబట్టి విడాకులను అనుమతించును, అయితే యేసు ఇప్పుడు ఇట్లనును: “తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.” పరిసయ్యులు అనేక ఆధారములనుబట్టి విడాకులను అనుమతించుదురు గనుక, ఆ మాటలు వారికెంత కోపము రప్పించునో!
పరిసయ్యులకు ఇంకా చెప్పుచూ, యేసు ఇద్దరు మనుష్యుల పరిస్థితిలో లేక స్థానములో చివరిగావచ్చిన గొప్ప మార్పుకు సంబంధించిన ఉపమానమును వివరించును. ఆ వ్యక్తులు ఎవరిని సూచించుచున్నారు, మరియు మారిన వారి పరిస్థితుల భావమేమైయున్నదో మీరు తీర్మానించగలరా?
యేసు ఇలా వివరించును: “ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీదనుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను; అంతేకాక కుక్కలువచ్చి వాని కురుపులు నాకెను.”
యేసు ఇక్కడ ధనవంతుని, కేవలము పరిసయ్యులు శాస్త్రులే కాకుండ, సద్దూకయ్యులు మరియు ప్రధానయాజకులు చేరియున్న యూదా మతనాయకులకు సూచనగా ఉపయోగించును. వారు ఆత్మీయ ఆధిక్యతలు మరియు అవకాశములతో ధనవంతులైయున్నారు మరియు వారు ధనవంతుడైన మనుష్యునివలెనే ప్రవర్తించుచున్నారు. వారి ఊదారంగు రాజవస్త్రములు వారి ఉన్నతస్థానమును సూచించుచున్నవి, మరియు తెల్లని సన్నని నారవస్త్రములు వారి స్వనీతికి చిత్రీకరణగా యున్నవి.
గర్వముగల ఈ ధనవంతుని తరగతి, దరిద్రులైన సామాన్యప్రజలను ‘ఆమ్‌హారెట్స్, లేక మట్టి మనుష్యులని పిలుచుచు, వారిని నీచముగా దృష్టించుదురు. ఆ విధముగా దరిద్రుడైయున్న లాజరు, సరియైన ఆత్మీయ పోషణ మరియు ఆధిక్యతల విషయములో మతనాయకులచే తృణీకరింపబడిన ప్రజలను సూచించును. కావున, లాజరు కురుపులతో నిండియున్నట్లుగా, సామాన్యప్రజలు ఆత్మీయ రోగగ్రస్తులని కేవలము కుక్కలతో సహవసించుటకు మాత్రమే పనికివచ్చువారిగా చూడబడిరి. అయినను, లాజరు తరగతివారు ఆత్మీయ పోషణకొరకై ఆకలిదప్పులు కలిగి ధనవంతుని బల్లమీదనుండి జారిపడు ఆత్మీయాహారపు చిన్నముక్కలను ఏరుకొనుటకు వెదకుచు వాకిట పడివుందురు.
యేసు ఇప్పుడు ధనవంతుడు మరియు లాజరు పరిస్థితిలో కలుగు మార్పును వర్ణించును. ఈ మార్పులు ఏమైయున్నవి, మరియు అవి వేటిని సూచించును?
ధనవంతుడు మరియు లాజరు మార్పును అనుభవించుట
ధనవంతుడు, ఆత్మీయ ఆధిక్యతలు, అవకాశములతో అనుగ్రహింపబడిన మతనాయకులను సూచిస్తుండగా, లాజరు ఆత్మీయ పోషణకొరకు ఆకలితోయున్న సామాన్య ప్రజలకు చిత్రీకరణయైయున్నాడు. వారిద్దరి పరిస్థితులలో జరిగిన గొప్పమార్పును వర్ణించుచు యేసు తన కథను కొనసాగించును.
యేసు ఇట్లనును: “ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడుకూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు హేడిస్‌లోని అగ్నిలో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచెను.”—NW.
ధనవంతుడు మరియు లాజరు అక్షరార్థమైన వ్యక్తులుకాదు గాని ప్రజలను సూచిస్తున్నందున, న్యాయసమ్మతముగా వారి మరణములు కూడ సూచనార్థకమైయున్నవి. వారి మరణములు దేనికి చిహ్నములు, లేక సూచనయైయున్నవి?
‘బాప్తిస్మమిచ్చు యోహాను కాలమువరకు, ధర్మశాస్త్రము ప్రవక్తలును ఉండిరి, అయితే అప్పటినుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుచున్నది’ అని చెప్పుటద్వారా వారి పరిస్థితులలోని మార్పును సూచించుచూ యేసు ఇంతకుముందే ఆ ఉపమానమును పూర్తిచేసెను. కాబట్టి, యోహాను మరియు యేసుక్రీస్తు ప్రచారముతో ధనవంతుడు, లాజరు అను వీరిద్దరును వారి పూర్వపు పరిస్థితులయందు లేక స్థితియందు మరణింతురు.
దీనులైన, పశ్చాత్తాపము చూపిన ఆ లాజరు తరగతి తమ పూర్వపు దిగజారిన ఆత్మీయ పరిస్థితి విషయములో మరణించి దైవానుగ్రహ స్థితిలోనికి వచ్చుదురు. వారింతకుముందు ఆత్మీయ బల్లనుండి జారిపడు ముక్కలకొరకు మతనాయకులవైపు చూచెడివారు, ఇప్పుడైతే యేసు వారికందించిన లేఖనసత్యములు వారి అవసరతను తీర్చుచున్నవి. ఆ విధముగా వారు, గొప్ప అబ్రాహామగు, యెహోవా దేవుని రొమ్మున ఆనుకొనుటకు, లేక అనుగ్రహస్థానము పొందుటకు తేబడిరి.
మరోవైపున, యేసు బోధించిన రాజ్య వర్తమానమును అంగీకరించుటకు మొండిగా నిరాకరించినందున, ధనవంతుని తరగతికి చెందిన దైవిక అయిష్టము క్రిందికి వచ్చుదురు. ఆ విధముగా వారు, అనుగ్రహ స్థానములో ఉన్నట్లుగా కన్పించిన తమ పూర్వస్థితి విషయములో మరణించుదురు. నిజానికి వారు సాదృశ్యమగు అగ్నిబాధలతో వున్నట్లు తెలుపబడియున్నారు. ఇప్పుడు, ధనవంతుడు మాట్లాడుచుండగా వినుము:
“తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను.” యేసు శిష్యులు ప్రకటించిన దేవుని ఉగ్రతాతీర్పు వర్తమానములు ఈ ధనవంతుని తరగతిలోని ఆయావ్యక్తులను బాధించును. వారి బాధాకరమైన మాటలనుండి తమకు కొంత ఉపశమనము దొరుకునట్లు, శిష్యులు ఈ వర్తమానములను ప్రకటించకుండ ఉండవలెనని వారు కోరుదురు.
“అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పు డైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడివారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నది.’”
లాజరు తరగతికి ధనవంతుని తరగతికి మధ్య అంత గొప్పమార్పు కలుగుట ఎంత న్యాయమైనది, సముచితమైనది! కొద్దినెలల తర్వాత సా.శ. 33 పెంతెకొస్తునాడు పాతధర్మశాస్త్ర నిబంధన స్థానములోనే క్రొత్తనిబంధన ఉంచబడినప్పుడు, వారి పరిస్థితులలో మార్పు వచ్చినది. అప్పుడు పరిసయ్యులను, ఇతర మతనాయకులను కాదుగాని, శిష్యులనే దేవుడు అనుగ్రహించెననుట తిరుగులేని విధముగా స్పష్టమయినది. గనుక, సాదృశ్యమైన ధనవంతునికి, యేసు శిష్యులకు మధ్యనున్న “మహా అగాధము,” దేవుని మార్పులేని, నీతియుక్తమైన తీర్పును సూచించుచున్నది.
ఆ తర్వాత ధనవంతుడు “తండ్రియైన అబ్రాహామును” ఇలా వేడుకొనును: “ఆలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు, . . . నా తండ్రి యింటికి వాని [లాజరును] పంపుము.” ఆ విధముగా ధనవంతుడు తనకు మరొక తండ్రితో, వాస్తవానికి అపవాదియగు సాతానుతో దగ్గర సంబంధమున్నదని ఒప్పుకొనును. తన “ఐదుగురు సహోదరులను,” తన మతసంబంధమైన మిత్రులను, “ఈ వేదనకరమైన స్థలములో” ఉంచకుండునట్లు, లాజరు దేవుని కఠినమైన తీర్పులు తీర్చకుండవలెనని ధనవంతుడు వేడుకొనును.
“అందుకు అబ్రాహాము, ‘వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెను.’” అవును, ఆ “ఐదుగురు సహోదరులు” వేదనను తప్పించుకొనవలెనంటే, వారు యేసును మెస్సీయగా గుర్తించిన, మోషే ఇతర ప్రవక్తల వ్రాతలను లక్ష్యపెట్టి ఆయన శిష్యులుగా తయారు కావలెను. అయితే ధనవంతుడు ఇట్లు అభ్యంతరము చెప్పును: “తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురు.”
అయితే, “మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని” అతనికి చెప్పబడును. ప్రజలను నమ్మించుటకు దేవుడు ప్రత్యేకమైన సూచనలను లేక అద్భుతములను దయచేయడు. వారు ఆయన అనుగ్రహము పొందవలెనంటే, వారు లేఖనములను చదివి వాటిని అన్వయించవలెను. లూకా 16:14-31; యోహాను 9:28, 29; మత్తయి 19:3-9; గలతీయులు 3:24; కొలొస్సయులు 2:14; యోహాను 8:44.
▪ ధనవంతుడు మరియు లాజరు మరణములు ఎందుకు సాదృశ్యమై యుండవలెను, వారి మరణములద్వారా ఏమి సూచించబడెను?
▪ యోహాను పరిచర్య ఆరంభముతో, యేసు సూచించిన ఏ మార్పు జరిగినది?
▪ యేసు మరణము తర్వాత ఏది తీసివేయబడవలెను, ఇది విడాకుల విషయముపై ఎట్లు ప్రభావము చూపును?
▪ యేసు ఉపమానములో, ధనవంతుడు మరియు లాజరుద్వారా ఎవరు సూచింపబడిరి?
▪ ధనవంతుడు ఎటువంటి వేదనలను అనుభవించును, అవి దేనివలన తొలగిపోవునని అతడు విన్నపము చేసెను?
▪ “మహా అగాధము” దేనిని సూచించుచున్నది?
▪ ధనవంతుని నిజమైన తండ్రి ఎవరు, మరియు అతని ఐదుగురు సహోదరులు ఎవరు?