కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధన్యతకు మూలము

ధన్యతకు మూలము

అధ్యాయము 75

ధన్యతకు మూలము

గలిలయలో తన పరిచర్య కాలములో, యేసు అద్భుతములు చేసెను, ఆయన ఇప్పుడు వాటిని తిరిగి యూదయలో చేయును. ఉదాహరణకు, ఒక మనుష్యుని మూగవానిగా చేసిన దయ్యమును ఆయన వెళ్లగొట్టును. జనసమూహములు ఆశ్చర్యపడుదురు, అయితే విమర్శకులు గలిలయలో లేవదీసిన అభ్యంతరమునే లేవదీయుదురు. “వీడు దయ్యముల అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని” చెప్పుకొందురు. ఇతరులు తన గుర్తింపుకొరకు మరి ఎక్కువ రుజువును కోరుచు, పరలోకమునుండి తమకొక సూచన చూపించమని యేసును శోధించుటకు వారు ప్రయత్నించుదురు.

వారి ఆలోచనను ఎరిగినవాడై, యేసు గలిలయలోని వారికిచ్చిన సమాధానమునే యూదయలోని తన విమర్శకులకును ఇచ్చును. తనకుతానే వేరుపడిన ప్రతి రాజ్యము పడిపోవునని ఆయన అభిప్రాయపడును. కావున, ఆయన వారినిట్లడుగును: “సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నదని” చెప్పుచు ఆయన తన విమర్శకులున్న ప్రమాదకరమైన స్థానమును చూపించును.

యేసుచేసే అద్భుతములను చూచువారు, శతాబ్దముల పూర్వము మోషే అద్భుతము చేసినప్పుడు స్పందించిన ప్రజలవలెనే ప్రతిస్పందించవలెను. అది “దేవుని వ్రేలు” అని వారు బిగ్గరగా కేకవేసిరి. అంతేకాకుండ, “దేవుని వ్రేలు” రాతిపలకలపై పదిఆజ్ఞలను వ్రాసియిచ్చెను. “దేవుని వ్రేలు”—ఆయన పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తి—యేసు దయ్యములను వెళ్లగొట్టుటకు మరియు రోగులను బాగుచేయుటకు శక్తిమంతుని చేసెను. కావున ఆ రాజ్యమునకు రాజైన యేసు వారి మధ్యనేయున్నందున, దేవుని రాజ్యము నిజముగా ఈ విమర్శకులను అధిగమించెను.

ఆ తర్వాత యేసు, ఆయుధములు ధరించిన ఒకడు తన భవనమును కాచుకొనుచున్నప్పుడు, బలవంతుడు వచ్చిన అతని జయించునని చెప్పుచు, దయ్యములను వెళ్లగొట్టు తనశక్తి సాతానుపై తనకున్న అధికారమునకు రుజువుని ఉదహరించును. అంతేకాకుండ అపవిత్రాత్మను గూర్చి గలిలయలో చెప్పిన దృష్టాంతమునే ఆయన మరలా చెప్పును. ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచిపెట్టును, అయితే ఆ మనుష్యుడు ఆ ఖాళీని మంచిసంగతులతో నింపనియెడల, ఆ అపవిత్రాత్మ మరియేడు ఆత్మలతో తిరిగివచ్చును, అప్పుడు ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగును.

ఈ సంగతులను ఆ సమూహములోనుండి వినుచు, యొక స్త్రీ ఆయనను చూచి, “నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని” కేకలు వేసి చెప్పును. యూదురాలైన ప్రతి స్త్రీయు తను ఒక ప్రవక్తకు, ప్రత్యేకముగా మెస్సీయకు తల్లి కావలెనని కోరును గనుక, ఈ స్త్రీ ఇలా చెప్పుటలో అర్థమున్నది. యేసు తల్లియైనందుకు మరియ ప్రత్యేకముగా ధన్యురాలని ఆమె స్పష్టముగా తలంచెను.

అయితే, యేసు నిజమైన ధన్యతయొక్క మూలమును చెప్పి ఆమెను వెంటనే సరిదిద్దును. “కాదుగాని, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” అని ఆయన చెప్పును.” (NW) యేసు ఎన్నడును తన తల్లియైన మరియకు ప్రత్యేకమైన ఘనతనివ్వవలెనని చెప్పియుండలేదు. అయితే, దేవునికి నమ్మకమైన సేవకునిగా వుండుటలో నిజమైన ధన్యత కలదుగాని ఏ భౌతికబంధాలలోను, కార్యసాధకములలోను ఉండదని ఆయన చూపించును.

ఆయన గలిలయలో చేసిన మాదిరిగానే, పరలోకమునుండి తమకొక సూచన చూపించుమని అడిగిన యూదయలోని జనులనుకూడ యేసు గద్దించును. యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయు వారికివ్వబడదని ఆయన చెప్పును. చేప కడుపులో మూడు దినములుండుటయే కాకుండ, నీనెవె పట్టణస్థులు పశ్చాత్తాపము చెందునట్లు ధైర్యముగా ప్రకటించుటద్వారా యోనా ఒక సూచనగా ఉన్నాడు. “ఇదిగో యోనాకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు” అని యేసు చెప్పును. అదేప్రకారము, షేబదేశపురాణి సొలొమోను జ్ఞానమునకు ఆశ్చర్యపడెను. “ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు” అనికూడ యేసు చెప్పును.

మనుష్యుడు దీపము వెలిగించి చాటుచోటునైనను లేక కుంచము క్రిందనైనను పెట్టడుగాని, లోనికివచ్చువారికి వెలుగు కనబడునట్లు దానిని దీపస్తంభముమీద పెట్టునని యేసు వివరించును. మూర్ఖులైన ఈ ప్రజలయెదుట బోధించుట మరియు అద్భుతములు చేయుట ఒకడు దీపమును చాటుచోటున పెట్టుటను పోలియున్నదని యేసు బహుశ తెలియజేయుచున్నాడు. ఆ వెలుగును చూచువారి కన్నులు తేటగా, లేక స్పష్టముగా లేవు, గనుకనే తన అద్భుతములు అనుకున్న ఉద్దేశ్యమును నెరవేర్చలేదు.

యేసు ఇంతకుముందే ఒక దయ్యమును వెళ్లగొట్టి ఆ మూగవాడు మాట్లాడునట్లు చేసెను. ఈ మహత్కార్యమును కొనియాడి, సువార్తను ప్రకటించునట్లు ఇది ప్రజల కన్నులు తేటగాను, లేక స్పష్టముగాను చూచుటకు ప్రేరేపించవలెను. కానీ, ఈ విమర్శకులతో ఆ పని జరుగలేదు. కావున యేసు ఇట్లు తేల్చిచెప్పును: “కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగే దేహమంతయు వెలుగుమయమై యుండును.” లూకా 11:14-36; నిర్గమకాండము 8:18, 19; 31:18; మత్తయి 12:22, 28.

యేసు ఒక మనుష్యుని స్వస్థపరచినప్పుడు దాని ప్రతిస్పందన ఏలావుండెను?

“దేవుని వ్రేలు” ఏమైయున్నది, మరియు ఎట్లు దేవుని రాజ్యము యేసును వినువారిని అధిగమించెను?

నిజమైన ధన్యతయొక్క మూలము ఏమైయున్నది?

ఒకవ్యక్తి తన కంటిని ఎట్లు తేటగా ఉంచుకొనగలడు?