“నిజముగా ఈయన దేవుని కుమారుడు”
అధ్యాయము 126
“నిజముగా ఈయన దేవుని కుమారుడు”
యేసు మ్రానుపై ఉండి ఎక్కువ సమయము కాకమునుపే, మధ్యాహ్నము మూడుగంటలపాటు, ఎవరికీ అంతుబట్టని చీకటికమ్మును. దానికి కారణము సూర్యగ్రహణము కాదు, ఎందుకంటే అది అమావాస్య దినములలోనే జరుగును, కానీ అది నిండుపున్నమి గల పస్కాదినము. అంతేకాకుండా, సూర్యగ్రహణములు కొద్ది నిమిషములు మాత్రమే ఉండును. కావున దేవునివలననే ఆ చీకటి కమ్మింది! అది బహుశః యేసును హేళనచేస్తున్న వారు అలాచేయకుండా వుండుటకును, వారి నిందలు సహితము ఆగిపోవుటకును చీకటికమ్మి యుండవచ్చును.
ఈ భయానక సంఘటన, ఆ నేరస్థుడు తన సహవాసిని గద్దించి తనను గుర్తుచేసికొమ్మని అడుగుక ముందు జరిగివుంటే అది అతడు మారుమనస్సు పొందుటకు జరిగిన సంఘటనయై యుండవచ్చును. బహుశ ఈ చీకటి సమయముననే ఆ నలుగురు స్త్రీలు అనగా యేసు తల్లియైన మరియ, ఆమె సోదరియైన సలోమేయు, మగ్దలేనే మరియ, అపొస్తలుడైన చిన్నయాకోబు తల్లియైన మరియ ఆ హింసాకొయ్యకు సమీపముగా వెళ్లియుందురు. యేసు ప్రేమించిన అపొస్తలుడైన యోహాను వారితో ఉన్నాడు.
పాలిచ్చి పెంచి పోషించిన కుమారుడు బహువేదనతో వ్రేలాడుట చూచిన యేసు తల్లి హృదయములో ఖడ్గము ఎంతగా ‘దూసుకుపోయెను’! అయినను యేసు తన నొప్పినిగూర్చి కాదుగాని, ఆమె సంక్షేమమును గూర్చి ఆలోచించుచున్నాడు. అతికష్టముతో ఆయన యోహానువైపు తలను ఊపి తన తల్లితో ఇట్లనును: “అమ్మా, యిదిగో నీ కుమారుడు.” తరువాత మరియవైపు తలను ఊపి ఆయన, “యిదిగో నీ తల్లి” అని యోహానుతో చెప్పును.
నిజముగా ఇప్పుడు విధవరాలిగాయున్న తన తల్లి బాధ్యతను యేసు తాను ప్రత్యేకముగా ప్రేమించిన అపొస్తలునికి అప్పగించును. ఆయనిట్లు ఎందుకు చేయుననగా మరియయొక్క ఇతర కుమారులు ఆయనయందు ఇంకను విశ్వాసము కనబరచలేదు. ఆ విధముగా ఆయన తన తల్లియొక్క భౌతిక అవసరతలే కాకుండా ఆమె ఆత్మీయ అవసరతల కొరకు ఏర్పాటుచేయుటలో శ్రేష్ఠమైన మాదిరిచూపును.
మధ్యాహ్నము రమారమి మూడుగంటలప్పుడు, యేసు “నేను దప్పిగొనుచున్నాను” అనును. తుదివరకు తను యథార్థతను కాపాడుకొనవలెనన్నట్లు ఆయననుండి తండ్రి తన కాపుదలను దూరము చేసెనని యేసు గ్రహించును. కావున ఆయన బిగ్గరగా, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి?” అని కేకవేయును. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని, “అదిగో, ఏలీయాను పిలుచుచున్నాడు” అందురు. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తిపోయి, ఒక స్పంజిని చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించును. అయితే తక్కినవారు, “ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతము” అందురు.
యేసు ఆ చిరక పుచ్చుకొని, “సమాప్తమైనది” అని కేకవేయును. అవును, భూమిపై జరిగించుటకు తండ్రి తనను పంపిన యావత్తును ఆయన ముగించెను. చివరగా, ఆయన ఇట్లనును: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను.” అలా యేసు, దేవుడు తనలో మరలా దానిని పునరుద్ధరించగలడను మనోనిశ్చయముతో దేవునికి తన జీవ-శక్తిని అప్పగించును. ఆ పిమ్మట ఆయన తలవాల్చి ప్రాణము విడుచును.
యేసు తన తుదిశ్వాస విడిచిన మరుక్షణమే, భయంకరమైన భూకంపము కలుగగా, దాని తాకిడికి బండలు బ్రద్దలగును. ఆ ప్రకంపనము ఎంత శక్తివంతముగా ఉండునంటే, యెరూషలేముకు వెలుపటగల సమాధులు పగిలి వాటిలోనుండి శవములు బయటకు విసిరివేయబడును. బయటపడిన కళేబరములను చూచిన బాటసారులు పట్టణములో ప్రవేశించి దానినిగూర్చి తెలియజేయుదురు.
అంతేకాకుండా, యేసు మరణించిన మరుక్షణము, దేవుని ఆలయములో పరిశుద్ధ, అతిపరిశుద్ధ స్థలములను వేరుచేయు అతి పెద్దతెర పైనుండి క్రిందివరకు రెండుగా చిరుగును. అందముగా అల్లికలతో నేయబడిన ఈ తెర దాదాపు 18 మీటర్ల పొడవుతో ఎంత బరువుగా ఉండెనో! ఆశ్చర్యకరమైన ఆ అద్భుతము తన కుమారుని హంతకులపై దేవుని ఉగ్రతను వెల్లడిచేయుటయే గాకుండ, యేసు మరణముద్వారా ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలము, అనగా పరలోకమునకు మార్గము సుగమము చేయబడినదని సూచించుచున్నది.
భూకంపమును, జరుగుచున్న సంఘటనలను చూచినప్పుడు, ప్రజలు విపరీతముగా భయబ్రాంతులగుదురు. శిక్ష అమలుచేయుటను పర్యవేక్షించు సైనికాధికారి దేవుని మహిమపరచును. “నిజముగా ఈయన దేవుని కుమారుడు” అని అతడు ప్రకటించును. పిలాతుయెదుట యేసు విచారణలో ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనుటను గూర్చి చర్చించినప్పుడు బహుశ ఇతడు అక్కడ ఉండవచ్చును. ఇప్పుడతను యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు, అవును ఆయన నిజముగా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి.
ఇతరులును ఈ అద్భుత సంఘటనలచే ప్రభావితులై, తమ దుఃఖానికి, సిగ్గుకు సూచనగా రొమ్ముకొట్టుకొనుచు తమ ఇండ్లకు తిరిగివెళ్లుదురు. దూరమునుండి ఈ వింతకార్యమును చూస్తున్న యేసుయొక్క మహిళా శిష్యురాండ్రు ఈ అసాధారణ సంఘటనచే మిక్కిలి కదిలింపబడుదురు. అపొస్తలుడైన యోహాను కూడ అక్కడే వున్నాడు. మత్తయి 27:45-56; మార్కు 15:33-41; లూకా 23:44-49; 2:34, 35; యోహాను 19:25-30.
▪ మూడుగంటల చీకటికి సూర్యగ్రహణము ఎందుకు కారణము కాదు?
▪ తన మరణమునకు కొద్దిగా ముందు, వృద్ధ తలిదండ్రులుగల వారికి యేసు ఎటువంటి శ్రేష్ఠమైన మాదిరిచూపును?
▪ మరణించుటకు ముందు యేసు పలికిన చివరి నాలుగు మాటలు ఏమైయున్నవి?
▪ భూకంపము ఏమి సంభవింపజేయును, మరియు దేవాలయపు తెర రెండుగా చీలిపోవుటయొక్క సూచన ఏమి?
▪ శిక్ష అమలుచేయుటను పర్యవేక్షించు సైనికాధికారి ఆ అద్భుతములచే ఎట్లు ప్రభావితుడగును?