కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్ణాయకమైన దినము ఆరంభమగుట

నిర్ణాయకమైన దినము ఆరంభమగుట

అధ్యాయము 105

నిర్ణాయకమైన దినము ఆరంభమగుట

యేసు సోమవారము సాయంకాలము యెరూషలేమును విడిచి, ఒలీవ కొండకు తూర్పు పల్లపు ప్రాంతమందలి బేతనియకు తిరిగివెళ్లును. యెరూషలేములో తన కడవరి పరిచర్యలోని రెండు దినములు పూర్తియైనవి. యేసు మరల నిస్సందేహముగా ఆ రాత్రి తన స్నేహితుడైన లాజరుతో గడుపును. శుక్రవారము యెరికోనుండి వచ్చినదగ్గరనుండి ఆయన బేతనియలో గడిపిన రాత్రులలో ఇది నాల్గవది.

ఇప్పుడు, మంగళవారము ఉదయము అనగా నీసాను 11న, ఆయన తన శిష్యులు మరలా ప్రయాణమగుదురు. ఇప్పటివరకున్న దినములన్నింటిలో ఈ దినము ఎక్కువపనిగల దినముగా, యేసు పరిచర్యలో ఇది క్లిష్టమైన దినమైయున్నది. దేవాలయములో ఆయన కన్పించుటకు ఇది చివరిదినము. ఆయన న్యాయవిచారణ, మరణమునకు ముందు ఇది ఆయన బహిరంగ పరిచర్యలో చివరి దినమైయున్నది.

యేసు ఆయన శిష్యులు అదే దారిలో ఒలీవకొండ మీదుగా యెరూషలేముకు వెళ్లుదురు. బేతనియనుండి వచ్చు ఆ దారిలో అంతకుముందు రోజు ఉదయమున యేసు శపించిన వృక్షమును పేతురు గమనించి, “బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.”

అయితే యేసు ఆ చెట్టును ఎందుకు నశింపజేసెను? ఎందుకో సూచించుచు ఆయనిట్లనును: “మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను [వారు నిలువబడిన ఒలీవకొండను] చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

కావున చెట్టు ఎండిపోవునట్లు చేయుటద్వారా, శిష్యులు దేవునియందు విశ్వాసముంచు అవసరతను గూర్చి యేసు వారికి అక్షరార్థమైన పాఠమును నేర్పుచున్నాడు. ఆయన చెప్పునట్లుగా, “మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురు.” ప్రత్యేకముగా త్వరలోనే రానైయున్న భయంకరమైన శోధనల దృష్ట్యా, వారు నేర్చుకొనుటకు ఇది ఎంత ప్రాముఖ్యమైన పాఠము! అయినను, అంజూరపు చెట్టు ఎండిపోవుటకును, విశ్వాస నాణ్యతకును మధ్య మరొక సంబంధము కలదు.

ఇశ్రాయేలు జనాంగము, ఈ అంజూరపు చెట్టువలెనే మోసకరమైన రూపమును కలిగియున్నది. ఆ జనాంగము దేవునితో ధర్మశాస్త్ర సంబంధమును కలిగియుండి, దాని నియమములను పాటించుచున్నట్లు బయటకు కన్పించుచున్నను, అది విశ్వాసములేనిదిగా, మంచి ఫలములను ఫలించనదిగా నిరూపించబడెను. విశ్వాసములేనందున అది దేవుని స్వంత కుమారుని తిరస్కరించు మార్గములో ఉన్నది! కాబట్టి, ఫలింపని అంజూరపు వృక్షమును ఎండిపోవునట్లు శపించుటద్వారా, యేసు ఈ ఫలశూన్యమైన, విశ్వాసములేని జనాంగమునకు చివరకు కలుగు ఫలితమును సజీవముగా ప్రదర్శించుచున్నాడు.

త్వరలోనే, యేసు ఆయన శిష్యులు యెరూషలేములో ప్రవేశించి, వారు తమవాడుక చొప్పున దేవాలయమునకు వెళ్లగా, యేసు అక్కడ బోధింపనారంభించును. ప్రధానయాజకులు, ప్రజలలోని పెద్దలు నిస్సందేహముగా, యేసు అంతకుముందు రోజే రూకలు మార్చువారిపై తీసుకొనిన చర్యను మనస్సునందుంచుకొని, ఆయననిట్లు సవాలుచేయుదురు: “ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకెచ్చెను?”

అందుకు యేసు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును: “నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా?”

అప్పుడు ప్రధానయాజకులును పెద్దలును తామెట్లు సమాధానమీయవలెనో తమలోతాము ఆలోచించుకొందురు. “మనము ‘పరలోకమునుండి’ అని చెప్పితిమా, ఆయన, ‘ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని’ మనల నడుగును; ‘మనుష్యులవలననని’ చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారు.”

ఏమి జవాబు చెప్పవలెనో ఆ నాయకులకు తోచదు. కావున వారు యేసుకు ఇట్లు జవాబిత్తురు: “మాకు తెలియదు.”

బదులుగా యేసు వారితో ఇట్లనును: “ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.” మత్తయి 21:19-27; మార్కు 11:19-33; లూకా 20:1-8.

నీసాను 11, మంగళవారము యొక్క ప్రాముఖ్యత ఏమైయున్నది?

అంజూరపు వృక్షము ఎండిపోవునట్లు చేసినప్పుడు యేసు ఏ పాఠములను నేర్పును?

ఆయన ఏ అధికారముతో పనులు చేయుచున్నాడని అడిగిన వారికి యేసు ఎట్లు సమాధానమిచ్చును?