కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీకొదేమునకు బోధించుట

నీకొదేమునకు బోధించుట

అధ్యాయము 17

నీకొదేమునకు బోధించుట

సా.శ. 30 వ సంవత్సరములో పస్కాపండుగకు హాజరగునప్పుడు, యేసు గొప్ప సూచక క్రియలు, లేక అద్భుతములను చేయును. తత్ఫలితముగా అనేకులు ఆయనయందు విశ్వాసముంచుదురు. యూదుల ఉన్నత న్యాయస్థానములో, (హైకోర్టు) సభ్యుడైన నీకొదేము ఆయన బోధకు ముగ్ధుడై, ఇంకను నేర్చుకొనగోరును. కావున అతడు యేసును రాత్రివేళ సందర్శించును, బహుశ ఎవరైన తననుచూస్తే ఇతర యూదా అధికారులతో తనకున్న ఖ్యాతి చెడిపోవునేమోనను భయముతో అతడట్లు చేయును.

అతడు, “బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనేగాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని” ఆయనతో చెప్పును. అందుకు సమాధానముగా యేసు నీకొదేముతో ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించవలెనంటే, ఆ వ్యక్తి “క్రొత్తగా జన్మించవలెనని” చెప్పును.

అయితే ఒకడెట్లు తిరిగి జన్మించగలడు? “రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా?” అని నీకొదేము అడుగును.

కాదు, క్రొత్తగా జన్మించుట అంటే అర్థము అదికాదు. “ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు” అని యేసు వివరించును. యేసు బాప్తిస్మము తీసికొనినప్పుడు ఆయన మీదికి పరిశుద్ధాత్మ వచ్చెను, ఆ విధముగా ఆయన “నీటిమూలముగాను, ఆత్మమూలముగాను” జన్మించెను. దానితోపాటు పరలోకమునుండి, ‘ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అని చెప్పుటద్వారా, పరలోక రాజ్యములో ప్రవేశించు ఉత్తరాపేక్షగల ఆత్మీయ కుమారుని తాను తయారుచేసినట్లు దేవుడు ప్రకటించెను. ఆ తర్వాత సా.శ. 30లో బాప్తిస్మము తీసికొను ఇతరులు పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మను పొందిరి, ఆ విధముగా వారును దేవుని ఆత్మీయ కుమారులుగా తిరిగి జన్మించుదురు.

అయితే దేవుని ప్రత్యేక మానవ కుమారుని పాత్ర ప్రాముఖ్యమైనది. నీకొదేముతో యేసు ఇట్లనును: “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయనద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.” అవును, విషసర్పములచే కాటువేయబడిన ఇశ్రాయేలీయులు రక్షింపబడుటకు ఇత్తడి సర్పమువైపు చూడవలసి యున్నట్లుగానే, మానవులందరు తమ మరణకరమైన పరిస్థితినుండి రక్షింపబడుటకు దేవుని కుమారునియందు విశ్వసింపవలసి యున్నారు.

ఇందులో యెహోవాయొక్క ప్రేమపూర్వక పాత్రయెంతో నొక్కితెల్పుచు నీకొదేముతో యేసు ఇట్లనుచున్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” ఆ విధముగా, తన పరిచర్య ఆరంభించిన కేవలము ఆరునెలలకే, ఇక్కడ యెరూషలేములో యేసు, మానవుల రక్షణార్థమై యెహోవాచేసిన ఏర్పాటు తానేయని స్పష్టము చేయుచున్నాడు.

యేసు ఇంకను నీకొదేముకు ఇలా వివరించుచున్నాడు: “లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు,” అనగా దానిని తీవ్రముగా విమర్శించుటకు, లేక నేరస్థాపన చేయుటకు, మానవజాతికి నాశనమును విధించుటకు కాదు. కానీ, యేసు చెప్పునట్లుగా, “లోకము కుమారునిద్వారా రక్షణపొందుటకు,” ఆయన పంపబడెను.

నీకొదేము భయముతో రాత్రిపూట యేసునొద్దకు వచ్చెను. కాబట్టి యేసు ఆయనతో ఇలాచెప్పుచు తన సంభాషణను ముగించుట ఆసక్తికరముగా ఉన్నది: “ఆ తీర్పు ఇదే; వెలుగు [దీనికి యేసు తన జీవితమందు, బోధలయందు మానవరూపమిచ్చెను] లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” యోహాను 2:23–3:21; మత్తయి 3:16, 17; అపొ.కార్యములు 2:1-4; సంఖ్యాకాండము 21:9.

నీకొదేము వచ్చుటకు ఏది పురికొల్పినది, ఆయనెందుకు రాత్రిపూట వచ్చును?

“క్రొత్తగా జన్మించుట” అనగా దాని భావమేమి?

మన రక్షణలో తన పాత్రను యేసు ఎట్లు వివరించుచున్నాడు?

యేసు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదనుటలో భావమేమిటి?