కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము”

“పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము”

అధ్యాయము 54

“పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము”

నిన్నటి దినము నిజముగా అనేక కార్యములతో నిండియుండెను. యేసు అద్భుతరీతిగా వేలాది మందికి ఆహారము పంచి, తనను రాజుగా చేయదలచిన జనుల ప్రయత్నములనుండి తప్పించుకొనిపోయెను. ఆ రాత్రి సుడిగాలులతో నిండిన గలిలయ సముద్రముపై ఆయన నడచి వచ్చెను; సుడిగాలి-అలలతో నిండిన గలిలయ సముద్రముపై నడచి మునుగుతూ ఉన్న పేతురును కాపాడెను; మరియు తన శిష్యులు పడవ పగిలి మునిగి పోకుండ అలలను నిమ్మళింపజేసెను.

గలిలయ సముద్రమునకు ఈశాన్య దిశలో యేసుచేత అద్భుతరీతిలో ఆహారము పెట్టబడిన ప్రజలు ఇప్పుడు, ఆయనను కపెర్నహూముకు సమీపములో కనుగొని ఇట్లడుగుదురు: “నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి?” మరియొకసారి ఉచితముగా రొట్టెలు భుజించుటకే వారు తనను వెదకుచున్నారని యేసు వారిని గద్దించును. క్షయమైన ఆహారము కొరకుకాదుగాని నిత్యజీవమునిచ్చు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడని ఆయన వారికి ఉద్బోధించును. అందుకు వారు, “మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమిచేయవలెనని” అడుగుదురు.”

అత్యంత విలువైన ఒక్కపనిని మాత్రమే యేసు వారికితెల్పెను. “దేవునిక్రియ ఏదనగా ఆయన పంపిన వానియందు విశ్వాసముంచుటయే” అని వారికి వివరించును.

అయితే యేసు అనేక అద్భుతములు చేసినను ప్రజలు ఆయనయందు విశ్వాసముంచరు. నమ్మశక్యముకాని రీతిలో, ఆయన అన్ని అద్భుతములుచేసిన తర్వాతకూడ వారు, “మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచకక్రియను నీవు చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? ‘భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను’ అని వ్రాయబడినట్లు మనపితరులు అరణ్యములో మన్నాను భుజించిరని” అడుగుదురు.

ఒక సూచకక్రియ నడిగినందుకు జవాబుగా, అట్టి అద్భుతములకు మూలమెవరో స్పష్టపర్చుచూ యేసు ఇట్లనును: “పరలోకమునుండివచ్చు ఆహారము మోషే మీ కియ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నది.”

“ప్రభువా, యీ ఆహారమును ఎల్లప్పుడును మా కనుగ్రహించుము” అని ప్రజలడుగుదురు.

దానికి యేసు ఇట్లు వివరించును: “జీవాహారము నేనే. నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను; నాయిష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని. ఆయన నాకనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నాతండ్రి చిత్తము.”

“నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని” యేసు చెప్పినందున యూదులు ఆయనపై సణుగనారంభింతురు. మానవ తలిదండ్రులకు జన్మించిన కుమారుని తప్ప, ఆయనయందేమియు వారు చూడలేకపోయిరి. కావున నజరేతు ప్రజలవలెనే వారును ఆయనను నిరాకరించుచు, “ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా? ఈయన తలిదండ్రులను మనమెరుగుదుముగదా? ‘నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని’ ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.”

అందుకు యేసు, “మీలో మీరు సణుగుకొనకుడి; నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడును నాయొద్దకురాలేడు. అంత్యదినమున నేనువానిని లేపుదును. ‘వారందరు యెహోవాచే బోధింపబడుదురని’, ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది. గనుక తండ్రివలన వినినేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవునియొద్దనుండి వచ్చినవాడు తప్పమరియెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు. విశ్వసించువాడు నిత్యజీవము గలవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”

యేసు ఇంకను పునరుద్ఘాటించుచు ఇట్లనును: “జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును.” అవును, దేవుడు పంపిన యేసునందు విశ్వాసముంచుటద్వారా, ప్రజలు నిత్యజీవముగలవారగుదురు. మన్నాగాని, లేక మరి ఏ రొట్టెయు దానిని ఇవ్వలేదు!

కపెర్నహూము నొద్ద జనులు యేసును కనుగొనిన పిదప పరలోకమునుండి వచ్చిన ఆహారమును గూర్చిన అసలు చర్చ ఆరంభమాయెను. అయితే ఆ చర్చ కొనసాగి, తదుపరి కపెర్నహూములోని సమాజమందిరములో యేసు బోధించుచుండగా తారాస్థాయికి చేరును. యోహాను 6:26-51, 59; కీర్తన 78:24; యెషయా 54:13; మత్తయి 13:55-57.

పరలోకమునుండి దిగివచ్చు రొట్టెనుగూర్చి యేసు చర్చించుటకు ముందు ఏ సంఘటనలు జరిగెను?

యేసు అంతకుముందే చేసినదాని దృష్ట్యా, మరొక సూచనకొరకు అడుగుట ఎందుకంత అనుచితమై యున్నది?

పరలోకమునుండి దిగివచ్చిన నిజమైన ఆహారము తానేయని యేసు చెప్పుకొనినందున, యూదులెందుకు సణుగుకొందురు?

పరలోకమునుండి వచ్చిన ఆహారమును గూర్చిన చర్చ ఎక్కడ జరుగును?