పరలోకము నుండి వర్తమానములు
అధ్యాయము 1
పరలోకము నుండి వర్తమానములు
నిజానికి బైబిలంతయు, పరలోకమునుండి వచ్చిన వర్తమానమే. దీనిని మన పరలోకపు తండ్రి మన ఉపదేశముకొరకు ఇచ్చియున్నాడు. అయితే, దాదాపు 2,000 సంవత్సరముల క్రితము “దేవుని సముఖమందు నిలుచు” ఒక దేవదూతద్వారా రెండు విశేషమైన వర్తమానములు అందజేయబడెను. ఆయన పేరు గబ్రియేలు. ఆ దూత భూమికివచ్చిన ఈ రెండు ప్రాముఖ్యమైన సందర్భాలను గూర్చి మనమిప్పుడు పరిశీలించుదాము.
అది సా.శ. 3 వ సంవత్సరము. బహుశ యెరూషలేముకు ఎంతో దూరములోలేని, యూదయ పర్వతప్రాంతమందు, జెకర్యా అను పేరుగల యెహోవా యాజకుడు ఒకరు నివసించుచుండును. ఆయన అతని భార్యయగు ఎలీసబెతు, బహుకాలము గడచిన వృద్ధులు. వారికి పిల్లలు లేరు. జెకర్యా యెరూషలేమునందలి దేవుని ఆలయములో తనక్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచుండును. అప్పుడు అకస్మాత్తుగా ధూపవేదిక కుడివైపున గబ్రియేలు అతనికి ప్రత్యక్షమగును.
జెకర్యా ఎంతో భయపడును. అయితే గబ్రియేలు నెమ్మదిపరుస్తు, అతనితో “జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అనిపేరు పెట్టుదువు” అని చెప్పి, గబ్రియేలు ఇంకను, యెహాను “యెహోవా కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచునని” కూడ ప్రకటించును.
అయితే, జెకర్యా దీనిని నమ్మలేకపోవును. ఆ వయస్సులో తాను, ఎలీసబెతు ఒక శిశువును కలిగియుండగలరనుట ఆయనకు అసాధ్యముగా కన్పించును. అందువలన గబ్రియేలు: “నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగువరకు నీవు మాటలాడక మౌనివైయుందువని అతనితో చెప్పెను.”
అదే సమయములో బయటనున్న ప్రజలు జెకర్యా ఆలయములో ఎందుకంత సమయము తీసికొనుచుండెనోయని ఆశ్చర్యపడుదురు. చివరకాయన బయటకు వచ్చినప్పుడు, ఆయన మాటలాడలేక కేవలము సైగలు చేయుచుండును. దానితో వారు ఆయనేదో అద్భుతాన్ని చూచివుండవచ్చునని గ్రహింతురు.
ఆలయములో జెకర్యా తన సేవాకాలమును పూర్తిచేసి, ఇంటికి వెళ్లును. ఆ తర్వాత అది నిజముగా సంభవించును—ఎలీసబెతు గర్భవతియగును! శిశుజన్మము కొరకు ఎదురుచూచుచు, ఆమె అయిదు నెలలు ఇతరుల కంటబడకుండా ఇంట్లో ఉండును.
ఆ తర్వాత, గబ్రియేలు మరలా ప్రత్యక్షమగును. ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడును? ఆయన నజరేతను పట్టణములో మరియ అను పేరుగల కన్యకతో మాట్లాడును. ఈసారి ఆయన ఏ వర్తమానమును అందజేయును? గబ్రియేలు మరియతో, ఇదిగో! “దేవునివలన నీవు కృపనొందితివి,” అని చెప్పును. గబ్రియేలు ఇంకను ఇట్లనును: “నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; . . . ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును.”
గబ్రియేలు ఈ వర్తమానములను అందజేయుట ఒక ఆధిక్యతగా భావించియుండునని మనము నిశ్చయత కలిగియుండవచ్చును. మరియు మనము యోహాను, యేసులనుగూర్చి మరియెక్కువగా చదువుచుండగా, పరలోకమునుండి వచ్చిన ఈ వర్తమానములు ఎందుకంత ప్రాముఖ్యమైయున్నవో మనము మరిస్పష్టముగా గ్రహించుదుము. 2 తిమోతి 3:16; లూకా 1:5-33.
▪ పరలోకమునుండి ప్రాముఖ్యమైన ఏ రెండు వర్తమానములు అందజేయబడును?
▪ వర్తమానములను ఎవరు అందజేతురు, మరియు ఎవరికి అవి అందజేయబడును?
▪ వర్తమానములు నమ్ముటకు ఎందుకు అంత కష్టముగా ఉన్నవి?