పరిసయ్యునితో కలిసి భోజనము చేయుట
అధ్యాయము 76
పరిసయ్యునితో కలిసి భోజనము చేయుట
మూగ వానిని స్వస్థపరచిన తన శక్తికి మూలమెవ్వరని ప్రశ్నించిన విమర్శకులకు యేసు జవాబిచ్చిన తర్వాత, ఒక పరిసయ్యుడు ఆయనను భోజనము చేయుటకు ఆహ్వానించును. వారు భోజనము చేయుటకు ముందు, పరిసయ్యులు ఆచారము చొప్పున మోచేతులవరకు చేతులను కడుగుకొందురు. వారు భోజనమునకు ముందు ఆ తర్వాత మరియు మధ్యమధ్యనకూడ అట్లు చేయుదురు. ఆ ఆచారము దేవుని వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రమును ఉల్లంఘించకపోయినను, అది ఆచార సంబంధమైన పరిశుద్ధత విషయములో దేవుడు కోరు దానిని మీరుచున్నది.
యేసు ఆ ఆచారమును పాటించనందుకు, ఆయన అతిథేయుడు ఆశ్చర్యపడును. ఆయన తన ఆశ్చర్యమును మాటలద్వారా వెలిబుచ్చకపోయినను, యేసు దీనిని కనిపెట్టి, ఇట్లనును: “పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధిచేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా?”
ఆచారము చొప్పున తమచేతులను కడుగుకొని దుష్టత్వము విషయములో తమ హృదయములను శుభ్రపరచుకొనని పరిసయ్యుల వేషధారణను యేసు ఆ విధముగా బయటపెట్టును. ఆయనిట్లు హెచ్చరించును: “మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును.” నీతితో నటించుచు ఇతరులను ప్రభావితము చేయవలెననే కోరికతో కాకుండ, వారు ఇచ్చుదానిని ప్రేమగల హృదయముతో ఇవ్వవలెను.
యేసు ఇంకను ఇట్లనును: “అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతికూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది.” ఇశ్రాయేలీయులు తమపంటలోని పదియవ భాగమును లేక పదియవ వంతును చెల్లించవలెనని దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రము కోరుచున్నది. పుదీన సదాప చిన్నమొక్కలు, ఆహారమును రుచికరముగా చేయుటకు వాటిని ఉపయోగింతురు. అంతగా పట్టించుకోని ఈ మొక్కల విషయములోను పరిసయ్యులు జాగ్రత్తగా పదియవవంతు చెల్లింతురు, గానీ ప్రేమ చూపించుట, దయ కలిగియుండుట, నమ్రతగా యుండుటయను అంతకంటే ప్రాముఖ్యమైన వాటిని లక్ష్యపెట్టనందుకు యేసు వారిని ఖండించును.
వారిని ఇంకను ఖండించుచు, యేసు ఇట్లనును: “అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరు.” వాటి అశుద్ధత బయటకు కన్పించదు. పరిసయ్యుల మతము బయటకు మాత్రమే బాగుండును, అయితే దానిలోపల ఎటువంటి విలువయు లేదు. అది వేషధారణపై ఆధారపడియున్నది.
అటువంటి ఖండనను విని, ఒక న్యాయవాది, దేవుని ధర్మశాస్త్రోపదేశకుడు, ఇట్లు ఫిర్యాదుచేయును: “బోధకుడా, యిలాగుచెప్పి మమ్మునుకూడ అవమానపరచుచున్నావు.”—NW.
ధర్మశాస్త్రములో ప్రావీణ్యులైన వీరుకూడ బాధ్యులైయున్నారని చెప్పుచు యేసు ఇట్లనును: “అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.”
యేసు చెప్పుచున్న బరువులు నోటిమాటగా చెప్పు ఆచారములైయున్నవి, ప్రజలకు వాటిని సులభము చేయుటకు ఈ న్యాయవాదులు వాటిలో ఒక చిన్న నియమముకైనను సడలింపునియ్యరు. ప్రవక్తల హత్యలను వారు సమ్మతించుచున్నారని యేసు బయల్పరచుచు, ఆయన ఇట్లు హెచ్చరించును: “లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.”
విమోచింపబడగల మానవలోకం, ఆదాము హవ్వలకు కలిగిన సంతానముతో ప్రారంభమైంది; ఆ విధముగా, హేబెలు “లోకము పుట్టినప్పుడు” జీవించెను. జెకర్యా క్రూరంగా హత్యచేయబడిన తరువాత, సిరియా సైన్యము యూదాను కొల్లగొట్టెను. అయితే మరియెక్కువ దుష్టత్వము కారణముగా ఆయన తరము ఘోరముగా కొల్లగొట్టబడునని యేసు ముందుగనే చెప్పును. ఈ కొల్లగొట్టబడుట దాదాపు 38 సంవత్సరముల తర్వాత, అనగా సా.శ. 70లో జరుగును.
యేసు వారిని ఇంకను ఖండించుచు, “అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.” ధర్మశాస్త్రమందు ప్రవీణులైన వారు ప్రజలకు దాని అర్థమును విడమర్చిచెప్పుచు, దేవుని వాక్యమును వివరించు బాధ్యతను కలిగియున్నారు. అయితే దీనిని చేయుటలోవారు తప్పిపోయిరి మరియు దానిని అర్థము చేసికొను అవకాశమును సహితము వారు ప్రజలనుండి తొలగించుదురు.
యేసు వారి బండారము బయటపెట్టినందుకు పరిసయ్యులు, న్యాయశాస్త్ర ప్రవీణులు, ఆయనమీద బహుగా కోపగింతురు. ఆయన ఆ ఇంటినుండి వెళ్లునప్పుడు, వారాయనను వ్యతిరేకించుచు, ప్రశ్నల వర్షం కురిపింతురు. ఆయనను బంధించగలుగునట్లు, ఆయనచేత ఏదైనా తప్పుడు సమాధానము చెప్పించవలెనని వారు ప్రయత్నించుదురు. లూకా 11:37-54; ద్వితీయోపదేశకాండము 14:22; మీకా 6:8; 2 దినవృత్తాంతములు 24:20-25.
▪ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను యేసు ఎందుకు ఖండించును?
▪ న్యాయవాదులు ప్రజలపై ఏ భారములను మోపుచున్నారు?
▪ “లోకముపుట్టిన” దెప్పుడు?