కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిసయ్యుని చేత ఆతిథ్యమివ్వబడుట

పరిసయ్యుని చేత ఆతిథ్యమివ్వబడుట

అధ్యాయము 83

పరిసయ్యుని చేత ఆతిథ్యమివ్వబడుట

యేసు ఇంకను ప్రముఖుడైన ఆ పరిసయ్యుని ఇంటనే ఉన్నాడు, మరియు ఆయన ఇంతకుముందే జలోదర రోగముతో బాధపడుచున్న వానిని బాగుచేసెను. తోటి అతిథులు భోజన పంక్తిలో అగ్రపీఠములను ఎంచుకొనుట ఆయన గమనించి, వారికి వినయమునుగూర్చి ఒక పాఠమును బోధించును.

యేసు వారికిట్లు వివరించును: “నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠముమీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ‘ఇతనికి చోటిమ్మని’ నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.”

కావున యేసు సలహా ఇచ్చినదేమనగా, “అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడువచ్చి ‘స్నేహితుడా, పైచోటికి పొమ్మని’ నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండు వారందరియెదుట నీకు ఘనత కలుగును.” యేసు ముగింపుగా ఇట్లనును: “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”

ఆ తర్వాత యేసు తనను ఆహ్వానించిన పరిసయ్యుని ఉద్దేశించి మాట్లాడుచు, దేవునియెదుట నిజమైన యోగ్యతగల విందును ఎట్లు అందజేయవలెనో వివరించును. “నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు.”

దురదృష్టవంతులకు అటువంటి విందునిచ్చుటవల్ల దానినిచ్చువానికి ధన్యతవచ్చును గనుక, తనకు ఆతిథ్యమిచ్చిన వ్యక్తికి యేసు వివరించినట్లు, “నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు.” యోగ్యతగల ఈ విందునుగూర్చిన యేసు వివరణ మరొక తోటి అతిథికి వేరొక విధమైన విందును గుర్తుచేయును. ఈ అతిథి, “దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు” అని అనును. అయితే, అందరు సరియైన రీతిలో ఆ ఆనందదాయకమైన ఉత్తరాపేక్షను మూల్యమైనదిగా ఎంచరు అని యేసు మరొక ఉపమానము ద్వారా చూపును.

“ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను. విందుకాలమందు అతడు, ‘ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని’ పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ‘నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నా’ ననెను. మరియొకడు ‘నేను అయిదు యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నా’ ననెను. మరియొకడు ‘నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేను అనెను.”

ఎటువంటి కుంటిసాకులో! పొలము లేక పశువులను కొనకముందే సాధారణముగా పరీక్షిస్తారు, గనుక నిజానికి వాటిని ఆ తర్వాత చూడవలసిన అవసరము అంతగా ఉండదు. అదేప్రకారము, ఒకని వివాహము అటువంటి ప్రాముఖ్యమైన ఆహ్వానమును అంగీకరించుటకు అతని ఆపుజేయకూడదు. కావున ఈ సాకులు వినినమీదట, యజమాని ఆగ్రహించి తన దాసునికి ఇట్లు ఆజ్ఞాపించును:

“‘నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్ము.’ అంతట దాసుడు, ‘ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని’ చెప్పెను. అందుకు యజమానుడు, ‘నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము, ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడకూడదు’ అని ఆ దాసునితో చెప్పెను.”

ఈ ఉపమానము ఏ పరిస్థితిని వర్ణించినది? విందు ఏర్పాటుచేసిన “యజమానుడు” యెహోవా దేవునిని; ఆహ్వానమిచ్చు “దాసుడు” యేసుక్రీస్తును; “గొప్పవిందు” పరలోక రాజ్యము కొరకు వరుసలోవుండు అవకాశములను సూచిస్తున్నవి.

రాజ్యము కొరకైన ఆహ్వానమును అందుకొనుటకు అందరికంటె ముందుగా వరుసలో ఉన్నవారు, యేసు కాలమందలి యూదా మతనాయకులై యుండిరి. అయితే, వారు ఆ ఆహ్వానమును తృణీకరించిరి. ఆ విధముగా ప్రత్యేకించి సా.శ. 33 పెంతెకొస్తుతో ఆరంభించి, తక్కువచూపు చూడబడిన, దీనులైన యూదా జనాంగమునకు రెండవ ఆహ్వానము అందింపబడెను. అయితే దేవుని పరలోక రాజ్యమందలి 1,44,000 స్థానములను నింపుటకు కావలిసినంతమంది ప్రతిస్పందించలేదు, కావున మూడున్నర సంవత్సరముల తర్వాత, సా.శ. 36లో మూడవదైన చివరి ఆహ్వానమును సున్నతిపొందని యూదులుకాని వారికి ఇవ్వబడెను, కాగా అటువంటి వారిని సమకూర్చుట మనకాలమువరకు కొనసాగినది. లూకా 14:1-24 .

యేసు వినయమునుగూర్చి ఏ పాఠమును బోధించును?

ఆతిథ్యమిచ్చువాడు దేవుని యెదుట యోగ్యతగల విందును ఎట్లు ఏర్పాటు చేయగలడు మరియు అదెట్లు అతనికి ఆనందాన్నిచ్చును?

ఆహ్వానింపబడిన అతిథుల సాకులు ఎందుకు కుంటివైయున్నవి?

“గొప్పవిందును” గూర్చిన యేసు ఉపమానము దేనికి సూచనయైయున్నది?