పరిసయ్యుల బుద్ధిపూర్వక అపనమ్మకము
అధ్యాయము 71
పరిసయ్యుల బుద్ధిపూర్వక అపనమ్మకము
పరిసయ్యులు ఒకప్పటి గ్రుడ్డివాని తలిదండ్రులను తమ ఎదుటకు పిలిపించినప్పుడు వారు భయపడిరి. యేసునందు విశ్వాసముంచు వారెవరైనను సమాజమందిరములోనుండి వెలివేయబడుదురని తీర్మానింపబడిన విషయమును వారు ఎరిగియున్నారు. ఆ విధముగా సమాజములోని ఇతరుల సహవాసమునుండి వెలివేయబడుట అత్యంత కష్టమును తీసుకువచ్చును, ప్రత్యేకముగా బీదకుటుంబము వారికి. కాబట్టి ఆ తలిదండ్రులు జాగ్రత్తపడుదురు.
“గ్రుడ్డివాడై పుట్టెనని మీరుచెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడు?” అని పరిసయ్యులు వారిని అడుగుదురు.
అందుకు వాని తలిదండ్రులు, “వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము” అని స్థిరముగా చెప్పుదురు. “అయితే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము.” నిశ్చయముగా వారి కుమారుడు జరిగినది యావత్తు వారికి చెప్పియుండవచ్చును, అయితే తెలివిగా ఆ తలిదండ్రులు ఇట్లందురు: “వీడు వయస్సు వచ్చినవాడు, వీనిని అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడు.”
కావున, పరిసయ్యులు మరలా ఆ మనుష్యుని పిలిపించుదురు. ఈసారి యేసుకు విరుద్ధముగా తాము దోషారోపణ చేయగల సాక్ష్యమును సమకూర్చామని సూచించుచు అతని భయపెట్టుటకు వారు ప్రయత్నించుదురు. “దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుము” అని వారు గద్దించి అడుగుదురు.
ఒకప్పటి గ్రుడ్డివాడు వారి ఆరోపణను కాదనలేదు, అయితే “ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాను” అని ఖచ్ఛితముగా చెప్పును.
అతడు చెప్పిన సాక్ష్యమందు తప్పుపట్టుటకు ప్రయత్నించుచు, పరిసయ్యులు మరలా ఇట్లడుగుదురు: “ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెను?”
“ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు?” అని అతడు ఫిర్యాదు చేయుచు, అతడు ఎత్తిపొడుస్తూ వారిని ఇట్లడుగును: “మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి?”
ఈ సమాధానము పరిసయ్యులకు కోపము రప్పించెను. “నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని” చెప్పి వానిని దూషించిరి.
విస్మయమొందుచు, దీనుడైన ఈ భిక్షకుడు, “ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను” అని ప్రత్యుత్తరమిచ్చును. దీనినుండి ఏమి తేల్చిచెప్పవచ్చును? భిక్షకుడు ముందుగనే నమ్మిన విషయమును సూచించుచు, “దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.” ఆ విధముగా “ఈయన దేవుని యొద్దనుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడనే” ముగింపు స్పష్టం.
అటువంటి సూటియైన మరియు స్పష్టమైన న్యాయతర్కనకు పరిసయ్యుల దగ్గర జవాబు లేదు. వారు సత్యము నెదిరించి నిలువలేరు, కావున వారు ఆ మనుష్యుని, “నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా?” అని దూషించి, అతనిని బయటకు నెట్టివేయుదురు, అనగా వారతనిని నిజంగా సమాజమందిరమునుండి వెలివేయుదురు.
వారు చేసినదానిని యేసు తెలిసికొనినప్పుడు, ఆయన ఆ మనుష్యుని కనుగొని, “నీవు మనుష్య కుమారునియందు విశ్వాసముంచుచున్నావా?” అని అడుగును.
దానికి ఒకప్పటి గ్రుడ్డివాడు, “ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు?” అని అడుగును.
“నీతో మాటలాడుచున్నవాడు ఆయనే” అని యేసు ప్రత్యుత్తరమిచ్చును.
వెంటనే, ఆ మనుష్యుడు యేసుకు వంగి నమస్కరించి ఇట్లనును: “ప్రభువా, నేను విశ్వసించుచున్నాను.”
ఆ పిమ్మట యేసు ఇట్లు వివరించును: “చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితిని.”
దానితో, అక్కడున్న పరిసయ్యులు ఇట్లడుగుదురు: “మేమును గ్రుడ్డివారమా?” తాము మానసికముగా గ్రుడ్డివారమని వారు అంగీకరించినట్లయిన, యేసుయెడల వారి వ్యతిరేకతకు క్షమాపణ ఉండును. యేసు వారికి చెప్పినట్లుగా, “మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును.” అయితే, వారు కఠినహృదయులై తాము గ్రుడ్డివారము కాదని, తమకు ఆత్మీయ వెలుగు అవసరము లేదని వాదింతురు. కావున యేసు, “‘చూచుచున్నామని’ మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పును.” యోహాను 9:19-41.
▪ పరిసయ్యుల ఎదుటికి వారిని పిలిచినప్పుడు ఒకప్పటి గ్రుడ్డివాని తలిదండ్రులు ఎందుకు భయపడుదురు, మరియు వారు జాగ్రత్తగా ఎట్లు జవాబుచెప్పుదురు?
▪ ఒకప్పటి గ్రుడ్డివానిని పరిసయ్యులు భయపెట్టుటకు ఎట్లు ప్రయత్నించుదురు?
▪ ఆ మనుష్యుని ఏ న్యాయతర్కన పరిసయ్యులకు ఆగ్రహము రప్పించును?
▪ యేసును వ్యతిరేకించుటలో పరిసయ్యులకు ఎందుకు క్షమాపణ లేదు?