కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పర్ణశాలల పండుగలో

పర్ణశాలల పండుగలో

అధ్యాయము 66

పర్ణశాలల పండుగలో

యేసు తన బాప్తిస్మము దగ్గరనుండి గడచిన మూడు సంవత్సరములలో ఎంతో ప్రఖ్యాతిగాంచును. అనేకవేలమంది ఆయన చేసిన అద్భుతములను చూసిరి, ఆయన కార్యములనుగూర్చిన వార్తలు ఆ దేశమందతటను వ్యాపించును. ఇప్పుడు, పర్ణశాలల పండుగకు యెరూషలేముకు చేరిన ప్రజలు, ఆయన కొరకు వెదకసాగుదురు. “ఆయన ఎక్కడ?” అని వారు తెలిసికొనగోరుదురు.

యేసు వివాదగ్రస్థుడాయెను. కొందరు ఆయన “మంచివాడని,” మరికొందరు “కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని” అందురు. పండుగ తొలిదినములలో ప్రజలు ఆయననుగూర్చి హీనంగా మాట్లాడుకొందురు. అయినను ఎవరుకూడ యేసు పక్షముగా బాహాటముగా మాట్లాడుటకు ధైర్యము చేయలేదు. ఎందుకనగా ప్రజలు యూదా నాయకులనుండి ప్రత్యపకారము జరుగునేమోయని భయపడుదురు.

పండుగ సగము జరిగిపోయినప్పుడు, యేసు అక్కడికి చేరుకొనును. ఆయన ఆలయమునకు వెళ్లగా, ఆయన అద్భుతమైన బోధనా సామర్థ్యమునకు ప్రజలు విస్మయమొందుదురు. యేసు ఎన్నడును బోధనాపాఠశాలలో విద్యనభ్యసించనందున, యూదులు, “చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెను?” అని ఆశ్చర్యపడుదురు.

“నేను చేయు బోధ నాదికాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తముచొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును” అని యేసు వివరించును. యేసు బోధ దేవుని ధర్మశాస్త్రమునకు సన్నిహితముగాయుండును. ఆ విధముగా, ఆయన తన చిత్తమును కాదుగాని, దేవుని మహిమను వెదకుచున్నాడని స్పష్టపరచబడవలెను. “మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా?” అని యేసు అడుగును. గద్దింపు స్వరముతో ఆయనిట్లనును: “అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు.”

ఆ పిమ్మట యేసు, “మీరెందుకు నన్ను చంప జూచుచున్నారు?” అని అడుగును.

జనసమూహములోని ప్రజలకు, బహుశ పండుగకు వచ్చిన సందర్శకులకు అటువంటి ప్రయత్నముల సంగతి తెలియదు. అటువంటి ప్రజ్ఞావంతుడైన బోధకుని ఎవడైనను చంపుటకు కోరుకొనుట ఊహాతీతముగా వారు పరిగణించుదురు. కాబట్టి, యేసుకు ఏదో జరిగినది అందువలననే ఆయన ఈ విధముగా తలంచుచున్నాడని వారనుకొందురు. వారు, “దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని” అందురు.

జనసమూహమునకు ఆ విషయము తెలియకపోయినను, యూదా నాయకులు యేసు చంపబడవలెనని కోరుకొనుచున్నారు. ఒకటిన్నర సంవత్సరముల క్రితము విశ్రాంతి దినమున యేసు ఒక వ్యక్తిని బాగుచేసినప్పుడు, ఆ నాయకులు ఆయనను చంపుటకు ప్రయత్నించిరి. కాబట్టి యేసు ఇప్పుడు, వారి అవివేకమును సూచించుటకు వారిని ఇట్లడుగును: “మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థతగలవానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పుతీర్చుడి.”

పరిస్థితిని ఎరిగియున్న యెరూషలేము నివాసులు ఇప్పుడు ఇట్లందురు: “వారు చంప వెదకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?” తాము యేసును క్రీస్తని ఎందుకు నమ్మలేదో ఈ యెరూషలేము నివాసులు ఇట్లు వివరించుదురు: “ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడు.”

యేసు వారికిట్లు జవాబిచ్చును: “మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో యెరుగుదురు; నాయంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయనయొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును.” దీనితో వారాయనను పట్టుకొని, బహుశ చెరసాలలో వేయుటకు లేక చంపుటకు ప్రయత్నించుదురు. అయినను వారట్లు చేయలేకపోవుదురు ఎందుకనగా యేసు చనిపోవుటకు అది సమయము కాదు.

ఇంకను, అనేకమంది యేసునందు విశ్వాసముంచిరి, నిజానికి వారు ఆ విధముగా చేయవలెను. ఎందుకనగా, ఆయన నీటిమీద నడిచాడు, పెనుగాలులను శాంతింపజేశాడు. తుపానురేగిన సముద్రములను నిమ్మళింపజేశాడు, కేవలము కొన్ని రొట్టెలు మరియు చిన్నచేపలతో వేలాదిమందికి ఆహారము పెట్టాడు, రోగులను బాగుచేశాడు, కుంటివారు నడుచునట్లును, గ్రుడ్డివారు చూడగలుగునట్లును చేశాడు, కుష్ఠవ్యాధిగలవారిని బాగుచేశాడు మరియు చనిపోయినవారిని సహితము లేపాడు. కావున వారిట్లడుగుదురు: “క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువ సూచక క్రియలు చేయునా?”

ఈ సంగతులను జనులు సణుగుకొనుటను పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యోహాను 7:11-32.

పండుగకు యేసు ఎప్పుడు చేరుకొనును, మరియు ప్రజలు ఆయననుగూర్చి ఏమని చెప్పుకొనుచుండిరి?

యేసు దయ్యము పట్టినవాడని కొందరెందుకు అంటున్నారు?

యెరూషలేము నివాసులు యేసునుగూర్చి ఎటువంటి అభిప్రాయమును కలిగియున్నారు?

అనేకులు యేసునందు ఎందుకు విశ్వాసముంచెదరు?