పితృత్వమును గూర్చిన ప్రశ్న
అధ్యాయము 69
పితృత్వమును గూర్చిన ప్రశ్న
పండుగ దినములలో యూదా నాయకులతో యేసు చర్చ మరింత తీవ్రమగును. “మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును” అని యేసు అంగీకరించుచు, ఇట్లనును: “అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారు.”
వారి తండ్రిని వారు గుర్తించకపోయినను, యేసు వారి తండ్రి తన తండ్రినుండి వేరైయున్నాడని స్పష్టము చేయుచున్నాడు. యేసు ఎవరిని మనస్సులోపెట్టుకొని మాట్లాడుచున్నాడో గ్రహించక, యూదా నాయకులు, “మా తండ్రి అబ్రాహాము” అని ప్రత్యుత్తరమిచ్చుదురు. దేవుని స్నేహితుడైన, అబ్రాహాము కలిగియున్న విశ్వాసమునే తామును కలిగియున్నామని వారు భావించుచున్నారు.
అయితే యేసు తన జవాబుతో వారిని అదరగొట్టును. “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు” అనును. అవును, నిజమైన కుమారుడు తన తండ్రిని అనుకరించును. యేసు ఇట్లనుచున్నాడు: “దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు.” గనుక యేసు మరలా ఇట్లనును: “మీరు మీతండ్రి క్రియలే చేయుచున్నారు.”
యేసు ఎవరినిగూర్చి మాట్లాడుచున్నాడో వారింకను అర్థము చేసికొనలేదు. “మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము” అని చెప్పుచు, తాము న్యాయముగా అబ్రాహాము సంతానమేయని వారు చెప్పుచున్నారు. కావున, అబ్రాహాము వలెనే తామును సత్యారాధికులమని వాదించుచు, వారిట్లందురు: “దేవుడొక్కడే మాకు తండ్రి.”
కాని దేవుడు నిజముగా వారి తండ్రియేనా? “దేవుడు మీ తండ్రియైనయెడల,” అని అంటూ యేసు ఇట్లడుగును, “మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నామాటలు గ్రహింపకున్నారు?”
తనను తిరస్కరించుటవలన కలుగు పరిణామములను ఈ మత నాయకులకు చూపించుటకు యేసు ప్రయత్నించును. అయితే ఇప్పుడు ఆయన సూటిగా వారితో ఇట్లనుచున్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు.” అపవాది ఎటువంటి తండ్రి? యేసు అతనిని నరహంతకునిగా గుర్తించుచు ఇట్లనును: “వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.” కావున “దేవుని సంబంధియైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులుకారు గనుకనే మీరు వినరని” యేసు తేల్చిచెప్పును.
యేసు చేసిన నేరస్థాపనకు కోపము తెచ్చుకొని, యూదులు, “నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా” అని అందురు. సమరయులు, యూదులు ద్వేషించిన ప్రజలుగా యుండినందున, “సమరయుడు” అను మాట చులకనచేయుటకు మరియు అవమానించుటకు ఉపయోగింపబడినదై యున్నది.
సమరియుడనే అపనిందను లక్ష్యపెట్టకుండా, యేసు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చును: “నేను దయ్యము పట్టినవాడను కాదు, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.” ఇంకను మాట్లాడుచు యేసు వారు ఆశ్చర్యపడు ఈ వాగ్దానము చేయును: “ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడు.” యేసును వెంబడించు వారందరు అక్షరార్థముగా ఇక ఎన్నడును చనిపోరని యేసు భావముకాదు. బదులుగా, వారు నిత్య నాశనమును, లేక పునరుత్థానము లేని “రెండవ మరణమును,” అనుభవించరని ఆయన భావమైయున్నది.
ఏమైనను, యూదులు యేసు మాటలను అక్షరార్థముగా తీసుకొందురు. కావున, వారిట్లందురు: “నీవు దయ్యము పట్టినవాడవని ఇప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ‘ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని’ నీవు చెప్పుచున్నావు. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావు?”
ఈ చర్చయంతటిలో యేసు ఈ మనుష్యులకు తాను వాగ్దానము చేయబడిన మెస్సీయనను వాస్తవమును సూచించుచున్నాడనుట స్పష్టము. అయితే తన గుర్తింపునుగూర్చిన వారి ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చుటకు బదులు, యేసు వారితో ఇట్లనును: “నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; ‘మా దేవుడని’ మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నాతండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును.”
ఇంకను మాట్లాడుచు, మరలా విశ్వాసియైన అబ్రాహామును ప్రస్తావించుచు, యేసు ఇట్లనును: “మీ తండ్రియైన అబ్రాహాము నాదినమును చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను.” అవును, విశ్వాసమను నేత్రములతో, అబ్రాహాము వాగ్దానము చేయబడిన మెస్సీయ రాకడ కొరకు ఎదురుచూసెను. అపనమ్మకముతో, యూదులు, “నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా?” అని ఆయనను అడుగుదురు.
జవాబుగా యేసు, “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” అయితే యేసు పరలోకములో బలమైన ఆత్మీయ వ్యక్తిగా తనకున్న మానవపూర్వపు ఉనికిని సూచించుచున్నాడు.
“అబ్రాహాము కంటే ముందున్నానని” యేసు చెప్పినందుకు కోపోద్రేకులైన యూదులు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి, గాని యేసు దాగి దేవాలయములోనుండి నిరపాయంగా బయటికి వెళ్లిపోవును. యోహాను 8:37-59; ప్రకటన 3:14; 21:8.
▪ తాను, తన శత్రువులు వేర్వేరు తండ్రులను కలిగియున్నారని యేసు ఎట్లు చూపించును?
▪ యూదులు యేసును సమరయుడని పిలుచుటలో భావమేమై యున్నది?
▪ తన అనుచరులు ఎన్నడును మరణము రుచిచూడరని చెప్పుటలో యేసు భావమేమి?