కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిత్రార్జితమును గూర్చిన ప్రశ్న

పిత్రార్జితమును గూర్చిన ప్రశ్న

అధ్యాయము 77

పిత్రార్జితమును గూర్చిన ప్రశ్న

యేసు పరిసయ్యుని ఇంట భోజనము చేయుచున్నాడని ప్రజలకు స్పష్టముగా తెలియును. కావున వారు వేలసంఖ్యలో యేసు ఎప్పుడు బయటకు వచ్చునాయని వేచియుందురు. యేసును ఎదిరించుచు ఆయన ఏదైనను చెప్పినట్లయిన ఆయనను పట్టుకొనవలెనని ప్రయత్నించు పరిసయ్యులవలె కాక, ఈ ప్రజలు మెప్పుదలతో ఆయన చెప్పుదానిని ఆతురతతో విందురు.

మొదట తన శిష్యులవైపు తిరిగి యేసు ఇట్లు చెప్పసాగును: “పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.” భోజన సమయములో చూపించబడినట్లుగా పరిసయ్యుల మతవిధానము యావత్తు వేషధారణతో నిండియున్నది. భక్తి చూపించుటద్వారా పరిసయ్యుల దుష్టత్వము దాగియున్నను, చివరికది బయలుపరచబడకపోదు. “మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు” అని యేసు చెప్పును.

గలిలయలో ప్రకటించుటకు 12 మందిని పంపించినప్పుడు యేసు వారికిచ్చిన ప్రోత్సాహమునే మరలా ఇచ్చును. ఆయనిట్లనును: “దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి.” దేవుడు ఒక్క పిచ్చుకనైనను మరచిపోడు గనుక, వారిని దేవుడు ఎంతమాత్రము మరచిపోడని యేసు అభయమిచ్చును. ఆయనిట్లనును: “వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు, . . . మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును.”

ఆ జనసమూహములోని ఒకడు, “బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని” వేడుకొనును. పిత్రార్జితములో మొదటి కుమారుడు రెండింతలు భాగము పొందునని మోషే ధర్మశాస్త్రము ఖచ్ఛితముగా చెప్పుచున్నందున, అక్కడ వివాదమునకు ఎటువంటి కారణము లేదు. అయితే ఈ మనుష్యుడు స్పష్టముగా పిత్రార్జితములో న్యాయముగా తనకు రావలసినదానికంటె ఎక్కువ కోరుచున్నాడు.

యేసు అందులో తలదూర్చుటకు న్యాయంగా నిరాకరించును. “ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను?” అని ఆయన అడుగును. ఆ పిమ్మట యేసు జనసమూహమునకు ప్రాముఖ్యమైన ఈ సలహానిచ్చుచున్నాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” అవును, ఒకవ్యక్తి ఎంత ఆస్తి కలిగియున్నను, సాధారణముగా దానియంతటిని విడిచిపెట్టి అతడు చనిపోవును. ఈ వాస్తవాన్ని నొక్కిచెప్పుటకును, ఆలాగే దేవునియెదుట మంచిపేరును కలిగియుండుటకు తప్పిపోవుటలోని బుద్ధిహీనతను చూపించుటకు, యేసు ఒక ఉపమానమును ఉపయోగించును. ఆయనిలా వివరించును:

“ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు ‘నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని’ తనలోతానాలోచించుకొని, ‘నేనీలాగుచేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, “ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని” చెప్పుకొందు’ ననుకొనెను. అయితే దేవుడు, ‘వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని’ అతనితో చెప్పెను.”

దాని ముగింపునుగూర్చి యేసు ఇలా చెప్పును: “దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.” తనశిష్యులు ధనము సమకూర్చుకొను అజ్ఞానపు ఉరిలో పడకపోవచ్చును, అయితే ప్రతిదిన జీవితావసరముల కారణముగా వారు యెహోవాకుచేయు పూర్ణాత్మసేవనుండి సులభముగా తప్పిపోగలరు. కావున యేసు అంతకుముందే సంవత్సరమున్నర క్రితము కొండమీది ప్రసంగములో తానిచ్చిన శ్రేష్ఠమైన సలహాను పునరుద్ఘాటించుటకు ఈ సందర్భమును ఉపయోగించును. తన శిష్యులవైపు తిరిగి ఆయనిట్లనును:

“ఈ హేతువుచేత మీరు ఏమి తిందుమో, అని మీప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీదేహమును గూర్చియైనను చింతింపకుడి. . . . కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. . . . పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు వడుకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. . . .

కావున “ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి; దానితోకూడ ఇవి మీకనుగ్రహింపబడును.”

ప్రత్యేకముగా ఆర్ధిక కష్టము కలుగు సమయములలో యేసు చెప్పినమాటలు బాగుగా ఆలోచించవలసినవే. తన భౌతిక అవసరతల యెడల ఒకవ్యక్తి బహుగా చింతించుచు, ఆత్మీయ విషయములను వెంబడించుటలో వెనుకపడుటకు ఆరంభించినట్లయిన, వాస్తవానికి అతడు దేవుడు తన సేవకులకు అనుగ్రహించు శక్తిసామర్థ్యములయందు అవిశ్వాసమును ప్రదర్శించువాడై యుండును. లూకా 12:1-31; ద్వితీయోపదేశకాండము 21:17.

బహుశ ఎందుకు ఆ మనుష్యుడు పిత్రార్జితమునుగూర్చి అడిగియుండవచ్చును, యేసు ఎటువంటి సలహానిచ్చును?

యేసు ఏ ఉపమానమును ఉపయోగించును, దాని ఉద్దేశ్యమేమి?

యేసు ఏ సలహాను పునరుద్ఘాటించును, మరియు అది ఎందుకు సరియైయున్నది?