కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిలాతు దగ్గరనుండి హేరోదు నొద్దకు మరలా వెనుకకు

పిలాతు దగ్గరనుండి హేరోదు నొద్దకు మరలా వెనుకకు

అధ్యాయము 122

పిలాతు దగ్గరనుండి హేరోదు నొద్దకు మరలా వెనుకకు

పిలాతునొద్ద తాను రాజునను సంగతిని దాచుటకు యేసు ప్రయత్నించకపోయినను, తన రాజ్యము రోముకు ఎలాంటి బెదిరింపు కాదని ఆయన వివరించును. “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు” అని యేసు చెప్పును. ఆ విధముగా తన రాజ్యము భూసంబంధమైనది కాకపోయినను యేసు తనకొక రాజ్యము కలదని మూడు సార్లు అంగీకరించెను.

అయినను, పిలాతు ఆయనను ఇంకను వత్తిడిచేయుచు, “నీవు రాజువా?” అని అడుగును. అనగా నీ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాకపోయినను నీవు రాజువేనా? అని

యేసు దానికిట్లు జవాబిచ్చుచు, పిలాతు సరియైన అవగాహనకు వచ్చునట్లు చేయును: “నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును.”

అవును, యేసు భూమిపై ఉండు ఉద్దేశ్యము “సత్యము” నకు సాక్ష్యమిచ్చుటకే, ప్రత్యేకముగా రాజ్యసత్యమును గూర్చి. దానికొరకు తన ప్రాణమునివ్వవలసినను నమ్మకముగా యుండుటకు యేసు సిద్ధపడియున్నాడు. పిలాతు “సత్యమనగా ఏమిటి?” అని అడిగినను, మరింత వివరణ కొరకు అతడు ఆగడు. తీర్పుతీర్చుటకు సరిపడునంత అతడు విన్నాడు.

రాజభవనము వెలుపల వేచియున్న జనసమూహముల యొద్దకు పిలాతు వెళ్లును. తన ప్రక్కన యేసును కలిగియుండి, అతడు ప్రధానయాజకులకును, వారితోనున్న వారికి ఇట్లు చెప్పును: “ఈ మనుష్యుని యందు ఏ నేరమును నాకు కనబడలేదు.”

ఆ నిర్ణయమునకు కోపగించిన వారై, జనసమూహములు ఇలా వత్తిడిచేశారు: “ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడు.”

కారణరహితమైన యూదుల ఛాందసత్వము పిలాతును ఆశ్చర్యపరచును. కావున, ప్రధానయాజకులును పెద్దలును ఇంకను కేకలు వేయుచుండగా పిలాతు యేసువైపు తిరిగి ఇట్లడుగును: “నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా?” అయినను, యేసు ఏలాంటి జవాబిచ్చుటకైనను ప్రయత్నించడు. ఘోరమైన ఆ ఆరోపణల మధ్యను ఆయన మాట్లాడకుండుట పిలాతును ఆశ్చర్యపరచును.

యేసు గలిలయవాడని తెలిసిన పిలాతు ఏదోవిధముగా బాధ్యతనుండి తను తప్పుకొనుటకు చూచును. గలిలయ పాలకుడైన హేరోదు అంతిప (హేరోదు ది గ్రేట్‌ యొక్క కుమారుడు) పస్కాపండుగ నిమిత్తము యెరూషలేములో ఉన్నాడు, కావున పిలాతు యేసును అతనియొద్దకు పంపును. అంతకుముందు, హేరోదు అంతిప బాప్తిస్మమిచ్చు యోహాను తలను నరికించి, ఆ తర్వాత యేసు చేయుచున్న అద్భుతములను గూర్చి వినినప్పుడు అతడు ఆ యేసే మృతులలోనుండి లేచిన యోహాననుకొని ఎంతో భయపడెను.

ఇప్పుడు, హేరోదు యేసును చూచు విషయమై మిక్కిలి సంతోషించును. యేసు సంక్షేమము విషయమై శ్రద్ధకలిగి లేక ఆయనపై చేయబడిన ఆరోపణలను గూర్చి తెలిసికొనుటకు తాను నిజమైన ప్రయత్నము చేయగోరుచున్నానని అతడు సంతోషించుటలేదు. గానీ, యేసు ఏదైనా అద్భుతము చేస్తే చూడాలని అతడు కేవలము ఆశతో ఎదురు చూస్తున్నాడు.

అయితే యేసు, హేరోదు ఆశను నెరవేర్చుటకు నిరాకరించును. నిజానికి హేరోదు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఒక్కమాటైనను మాట్లాడడు. నిరాశచెందిన హేరోదు అతని సైనికులు యేసును హేళన చేయుదురు. వారాయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి అపహసింతురు. ఆ పిమ్మట వారు ఆయనను మరలా పిలాతునొద్దకు పంపుదురు. దాని ఫలితముగా గతమందు శత్రువులుగా నుండిన హేరోదు, పిలాతు మంచి మిత్రులగుదురు.

యేసు తిరిగి వచ్చినప్పుడు, పిలాతు ప్రధాన యాజకులను, యూదా అధికారులను, ప్రజలను పిలిపించి వారితో ఇట్లు చెప్పును: “ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు; హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదును.”

ఆ విధముగా పిలాతు రెండుసార్లు యేసును నిర్దోషియని ప్రకటించెను. యాజకులు కేవలము అసూయచేతనే ఆయనను తనకు అప్పగించెనని ఎరిగినవాడై ఆయనను విడుదలచేయుటకు అతడు ఆతురపడును. పిలాతు యేసును విడుదల చేయుటకు ఇంకను ప్రయత్నించుచుండగా, అతనిపై అంతంతకు వత్తిడి పెరుగును. అతడు న్యాయపీఠముపై కూర్చొనియుండగా, అతని భార్య ఒక వర్తమానము పంపి, అతనిని ఇట్లు బలవంతపెట్టును: “నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను [దైవ మూలముగా] కలలో మిక్కిలి బాధపడితిని.”

ఆయనను విడుదల చేయవలెనని తనకు తెలిసినను, పిలాతు ఈ అమాయకుని ఎట్లు విడుదల చేయగలడు? యోహాను 18:36-38; లూకా 23:4-16; మత్తయి 27:12-14, 18, 19; 14: 1, 2; మార్కు 15:2-5.

తన రాజరికమును గూర్చిన ప్రశ్నకు యేసు ఎట్లు జవాబిచ్చును?

దేనినిగూర్చి సాక్ష్యమిచ్చుచు యేసు తన భూజీవితమును గడిపెనో ఆ “సత్యము” ఏమి?

పిలాతు తీర్పు ఏమి, దానికి ప్రజలెట్లు ప్రతిస్పందింతురు, మరియు యేసు విషయమై పిలాతు ఏవిచేయును?

హేరోదు అంతిప ఎవరు, యేసును చూచుటకు అతడెందుకు మిక్కిలి సంతోషించును, మరియు ఆయన విషయములో అతడేమి చేయును?

యేసును విడుదల చేయుటకు పిలాతు ఎందుకు ఆతురపడును?