కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుని స్వస్థపరచుట

పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుని స్వస్థపరచుట

అధ్యాయము 70

పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుని స్వస్థపరచుట

యూదులు యేసును రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించినప్పుడు, ఆయన యెరూషలేమును విడిచి వెళ్లలేదు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతోకూడ పట్టణములో ఒక మార్గమున పోవుచుండగా, వారు పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుని చూతురు. యేసు శిష్యులు, “బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపముచేసెను? వీడా, వీని కన్నవారా?” అని అడుగుదురు.

కొందరు బోధకులు నమ్మినట్లుగా, బహుశ శిష్యులుకూడ ఒకడు తన తల్లిగర్భమందే పాపము చేయవచ్చని నమ్మిరి. అయితే యేసు, “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను” అని జవాబిచ్చును. అతడుగాని అతని తలిదండ్రులుగాని పాపము చేయుటవలన ఆ మనుష్యుడు గ్రుడ్డివాడు కాలేదు. మొదటి మనుష్యుడగు ఆదాముచేసిన పాపము ఫలితముగా మానవులందరు అసంపూర్ణులుగా తయారై, పుట్టు గ్రుడ్డితనమువంటి లోపములకు లోనయిరి. ఈ మనుష్యులలో ఉన్న ఈ లోపము యేసు దేవుని కార్యములను వెల్లడిచేయుటకు ఒక అవకాశమునిచ్చినది.

ఈ పనులనుచేయు అత్యవసరతను యేసు నొక్కితెల్పును. “పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని” ఆయన చెప్పును. త్వరలోనే ఆయన మరణించి సమాధియొక్క చీకటిలోనికి వెళ్లిపోవును, ఆయన అక్కడ ఏమియు చేయలేడు. మిగిలిన ఈ సమయములో, ఆయన లోకములో వెలుగునకు మూలమైయున్నాడు.

ఈ సంగతులు చెప్పిన తర్వాత, యేసు నేలపై ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేయును. వాని కన్నులమీద ఆ బురదపూసి “నీవు సీలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని” వానితో చెప్పును. అతడట్లు చేసినప్పుడు, అతడు చూడగల్గును! జీవితములో తొలిసారిగా చూడగలుగుచున్నందుకు, అతడు కోనేటినుండి తిరిగివచ్చినప్పుడు ఎంతగా ఆనందించునో!

అతని పొరుగువారు మరియు ఎరిగియున్న ఇతరులు ఇదిచూచి ఆశ్చర్యపడుదురు. “వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా?” అని వారందురు. “వీడే” అని కొందరు జవాబివ్వగా, మరికొందరు దీనిని నమ్మలేక, “వీడుకాడు, వీనిపోలియున్న యొకడని” అందురు. అయితే ఆ మనుష్యుడు, “ఆ వ్యక్తిని నేనే” అనును.—NW.

“నీ కన్నులేలాగు తెరవబడెను?” ప్రజలు తెలిసికొనగోరుదురు.

“యేసు అనునొక మనుష్యుడు బురదచేసి నా కన్నులమీద పూసి, ‘నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని’ నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిని.”

“ఆయన ఎక్కడ?” అని వారడుగుదురు.

“నేనెరుగను” అని అతడు సమాధానమిచ్చును.

ఇప్పుడు ప్రజలు ఒకప్పుడు గ్రుడ్డివాడైయుండిన ఈ మనుష్యుని తమ మతనాయకులైన పరిసయ్యులయొద్దకు తీసుకొనిపోవుదురు. వారుకూడ అతడెట్లు చూపు పొందెనని ప్రశ్నించుదురు. “నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని” అతడు వివరించును.

భిక్షగాడు స్వస్థపరచబడినందుకు పరిసయ్యులు నిశ్చయముగా ఆనందించవలెను గదా! అయితే దానికి బదులు, వారు యేసును తూలనాడుదురు. “ఈ మనుష్యుడు దేవునినుండి వచ్చినవాడు కాడని” వారు చెప్పుదురు. వారెందుకు అట్లు చెప్పుచున్నారు? ఎందుకనగా, “ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు.” అయితే ఇతర పరిసయ్యులు కొందరు, “పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలేలాగు చేయగలడు?” అని ఆశ్చర్యపోయిరి. కావున వారిలో బేధము పుట్టెను.

అందువలన, వారు ఆ మనుష్యుని ఈలాగు అడుగుదురు: “అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమనుకొనుచున్నావు?”

“ఆయన ఒక ప్రవక్త” అని జవాబిచ్చును.

పరిసయ్యులు దీనిని నమ్మలేదు. ప్రజలను మోసగించుటకు యేసుకు ఈ మనుష్యునికి మధ్య ఏదో రహస్య ఒప్పందము కలదని వారు నమ్ముదురు. కావున ఆ విషయమును తేల్చుకొనుటకుగాను వారా భిక్షగాని తలిదండ్రులను ప్రశ్నించుటకై పిలిపింతురు. యోహాను 8:59; 9:1-18.

ఆ మనుష్యుని గ్రుడ్డితనమునకు ఏది కారణము, ఏది కాదు?

ఏ మనుష్యుడు పనిచేయలేని రాత్రి ఏమైయున్నది?

ఆ మనుష్యుడు స్వస్థపడినప్పుడు, అతని ఎరిగియున్న వారి ప్రతిస్పందన ఏమైయున్నది?

ఆ మనుష్యుని స్వస్థత విషయములో పరిసయ్యులలో ఎట్లు భేదము పుట్టెను?