కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పొరుగువాడైన సమరయుడు

పొరుగువాడైన సమరయుడు

అధ్యాయము 73

పొరుగువాడైన సమరయుడు

యేసు బహుశ యెరూషలేముకు దాదాపు రెండు మైళ్ల దూరములోగల బేతనియ అను గ్రామమునకు దగ్గరలో ఉండవచ్చును. మోషే ధర్మశాస్త్రములో ప్రావీణ్యముగల ఒక మనుష్యుడు ఒక ప్రశ్నతో ఆయన దగ్గరకు వచ్చి, ఇట్లడుగును: “బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?”

ఆ న్యాయవాది కేవలం సమాచారము కొరకే కాకుండా, తనను పరీక్షించు కోరికతో అలా అడుగుచున్నాడని యేసు గ్రహించును. యూదుల సున్నిత భావాలకు అభ్యంతరము కలుగజేయు విధముగా యేసు జవాబు చెప్పునట్లు చేయుటయే బహుశ ఆ న్యాయవాది గురియైయుండవచ్చును. కావున యేసు, “ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావు?” అని అడిగి, ఆ న్యాయవాదియే సమాధానము చెప్పునట్లు చేయును.

జవాబిచ్చుటలో, ఆ న్యాయవాది అసాధారణమైన తెలివిని ప్రదర్శించుచు, ద్వితీయోపదేశకాండము 6:5 మరియు 19:18 లో చెప్పబడిన దేవుని నియమమును ఎత్తిచూపుచు ఇట్లనును: “‘నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.’”

“నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని” యేసు ప్రత్యుత్తరమిచ్చును.

అయితే ఆ న్యాయవాది అంతటితో సంతృప్తిపడలేదు. యేసు ఇచ్చిన జవాబు అతననుకున్నంత ప్రత్యేకముగా లేదు. తన అభిప్రాయములే సరియని, ఇతరులతో తన వ్యవహరములందు తానే నీతిమంతుడని యేసునుండి అతడు రూఢిపరచుకొనవలెనని కోరుచున్నాడు. అందుకే అతడిట్లడుగును: “అవునుగాని నా పొరుగువాడెవడు?”

లేవీయకాండము 19:18 లోని సందర్భము సూచించునట్లుగా యూదులు “పొరుగువాడను” మాట కేవలము తమ తోటి యూదులకు మాత్రమే అన్వయించునని నమ్ముదురు. వాస్తవానికి, అపొస్తలుడైన పేతురు సహితము ఆ తర్వాత ఆలాగే చెప్పెను: “అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని సమీపించుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును.” (NW) కావున ఆ న్యాయవాది, బహుశ యేసు శిష్యులుకూడ, తమ దృష్టిలో యూదులు కానివారు నిజముగా తమ పొరుగువారు కాదుగనుక, కేవలము తమతోటి యూదులను మాత్రమే దయతో చూచితే తాము నీతిమంతుల మగుదుమని నమ్ముదురు.

తనను వినువారిని అభ్యంతరపరచకుండ, యేసు వారి అభిప్రాయమును ఎట్లు సరిదిద్దును? బహుశ నిజముగా జరిగిన ఒక సంఘటనను పునస్కరించుకొని, ఆయన వారికొక కథ చెప్పును. యేసు ఇలా వివరించును: “ఒక మనుష్యుడు [యూదుడు] యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.”

యేసు ఇంకను ఇట్లనును: “అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవుచు, అతడు పడియున్న చోటికివచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడెను.”

అనేకమంది యాజకులు వారి దేవాలయ సహాయకులు యెరికోలో నివసింతురు, ఇది వారు సేవచేయు యెరూషలేము దేవాలయమునుండి 3,000 అడుగుల దిగువకు వెళ్లు ప్రమాదకరమైన రహదారిలో 14 మైళ్ల దూరములో ఉన్నది. కష్టములోయున్న తోటియూదునికి యాజకుడు మరియు లేవీయుడు నిజానికి సహాయము చేయవలసియుండిరి. అయితే వారట్లు చేయలేదు. బదులుగా ఒక సమరయుడు అట్లు చేయును. యూదులు సమరయులను ఎంతగా ద్వేషింతురంటే, ఇటీవలనే యేసును “సమరయుడు” అని పిలుచుచు వారు కఠినమైన మాటలతో ఆయనను అవమానపరచిరి.

ఆ యూదునికి సహాయము చేయుటకు సమరయుడు ఏమిచేయును? యేసు ఇట్లు చెప్పును: [సమరయుడు అతని] “దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములనుకట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని ఇంటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి [బహుశ రెండు దినముల బత్తెము] ఆ పూటకూళ్లవానికిచ్చి, ‘ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని’ అతనితో చెప్పిపోయెను.”

ఈ కథ చెప్పిన తర్వాత, యేసు ఆ న్యాయవాదిని ఇట్లడుగును: “దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?”

సమరయుడేనని చెప్పుటకు బాధపడుచునే, ఆ న్యాయవాది సాధారణమైన సమాధానమిస్తు, “అతనిమీద జాలిపడినవాడే” అనును.

అందుకు యేసు, “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” అతనితో చెప్పును.

యేసు సూటిగా ఆ న్యాయవాదితో యూదులు కానివారుకూడ తన పొరుగువారని చెప్పియున్నట్లయిన, దీనిని అతడు నిరాకరించుటయే కాకుండ యేసుతో జరుగుచున్న చర్చలో అక్కడున్న వారనేకులు అతని పక్షము వహించియుండెడివారు. అయితే, ఈ నిజ-జీవితమును పోలిన కథ, మన పొరుగువారిలో మన జాతికి, తెగకుచెందిన వారితోపాటు ఇతరులుకూడ ఉన్నారనుటను నిర్ద్వందముగా విశదపరచుచున్నది. యేసు ఎంత అద్భుతరీతిన బోధించెను! లూకా 10:25-37; అపొ.కార్యములు 10:28; యోహాను 4:9; 8:48.

న్యాయవాది యేసును ఎటువంటి ప్రశ్నలడిగెను, మరియు ఆయనలా అడుగుటలో స్పష్టముగా అతని ఉద్దేశ్యమేమై యుండును?

యూదులు తమ పొరుగువారు ఎవరని నమ్ముచున్నారు, ఆయన శిష్యులును అటువంటి అభిప్రాయమునే కలిగియుండిరనుటకు ఏ రుజువుకలదు?

న్యాయవాది నిరాకరించలేని విధముగా యేసు ఆ విషయమును ఎట్లు సరియైన అభిప్రాయమునకు తెచ్చును?