కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాంగణమందు నిరాకరించుట

ప్రాంగణమందు నిరాకరించుట

అధ్యాయము 120

ప్రాంగణమందు నిరాకరించుట

గెత్సేమను తోటలో యేసును విడిచి భయముతో మిగిలిన అపొస్తలులతో పారిపోయిన, పేతురు మరియు యోహాను మధ్యలోనే ఆగుదురు. బహుశ వారు యేసును అన్న యింటికి తీసికొనిపోవుటను గమనించియుండవచ్చును. అన్న ఆయనను ప్రధానయాజకుడైన కయప ఇంటికి పంపినప్పుడు, తమ ప్రాణముల విషయమై భయపడుచు, అయితే తమ యజమానికి ఏమి జరుగునోయని తీవ్రముగా ఆలోచించుచు పేతురు మరియు యోహాను దూరముగా వారిని అనుసరించి వెళ్లుదురు.

విశాలమైన కయప గృహమునకు వచ్చినప్పుడు, ప్రధాన యాజకునికి యోహాను తెలిసియున్నందున, అతడు ప్రాంగణములోనికి వెళ్లగల్గును. అయితే పేతురు బయటనే ద్వారమునొద్ద ఆగిపోవును. కాని యోహాను త్వరలోనే మరలావచ్చి ద్వారమునకు కాపలావున్న చిన్నదానితో మాట్లాడును, అలా పేతురుకూడ లోనికి వెళ్లును.

అప్పటికి చలిమొదలు కావడంతో, గృహపనివారు, ప్రధానయాజకుని బంట్రౌతులు కర్రబొగ్గుతో చలిమంట వేయుదురు. యేసు విషయమై జరిగింపబడుచున్న న్యాయవిచారణ ఫలితము కొరకు వేచియున్న పేతురుకూడ చలికాచుకొనుటకు వారితో చేరును. ఆ మంట వెలుగులో పేతురును లోనికి పంపిన చిన్నది అతని తేరిచూచి, “నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా?” అనును.

తాను గుర్తింపబడుటతో కలవరపడిన, పేతురు వారందరియెదుట యేసును తానెన్నడు ఎరుగనని చెప్పును. “ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని” అనును.

అంతట పేతురు నడవాలోనికి వెళ్లగా, అక్కడ మరియొక చిన్నది, అతని చూచి అక్కడ నిలిచియున్న వారితో, “వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని” చెప్పును. ఈసారికూడ పేతురు దానిని నిరాకరించుచు, “ఆ మనుష్యుని నేనురుగనని” ఒట్టుపెట్టుకొనును.

సాధ్యమైనంత మేరకు తనను మరుగు చేసికొనుటకు ప్రయత్నించుచు, పేతురు ఇంకను ప్రాంగణములోనే ఉండును. ఈ సరికి తెల్లవారుజామున తొలికోడి కూయుటతో పేతురు కలవరపడును. ఆ సమయమునకు యేసు విషయమై న్యాయవిచారణ ఇంకను జరుగుచున్నది, అది ప్రాంగణమునకు పైగా ఎగువనున్న గదిలో జరుగుచున్నది. నిస్సందేహముగా పేతురు, ఇతరులు క్రింద వేచియుండి సాక్ష్యము పలుకుటకు తీసికొనిరాబడు వివిధ సాక్షులు వచ్చిపోవుటను చూచుచుందురు.

యేసు సహచరుడనని పేతురు నిరాకరించి దాదాపు ఒక గంట సమయము గడచిపోయినది. ఇప్పుడు ఆయనచుట్టునున్న అనేకులు అతనిచూచి, “నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని” అతనితో అందురు. ఆ గుంపులో, పేతురు ఎవరి చెవినరికెనో ఆ మల్కు బంధువు ఒకడు, “నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా?” అనును.

అందుకు పేతురు, “ఆ మనుష్యుని నేనెరుగనని” విసురుగా చెప్పును. వారందరు తప్పుగా అనుకొనుచున్నారని, తను నిజమే చెప్పుచున్నాడని లేనిచో తనమీదికి కీడు రావలెనని తనను శపించుకొనుచు ఒట్టుపెట్టుకొనుచు, పేతురు వారిని ఒప్పించుటకు ప్రయత్నించుచున్నాడు.

పేతురు అలా మూడవసారి నిరాకరించుచుండగా, కోడి కూయును. బహుశ ఆ సమయమందే, ప్రాంగణమునకు పైగావున్న బాల్కనీలోకి వచ్చిన యేసు అతనివైపు తిరిగి చూచును. వెంటనే పేతురు, కేవలము కొన్నిగంటల క్రితము, “కోడి రెండుమారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని” యేసు మేడగదిలో చెప్పిన మాటలను గుర్తుచేసికొనును. తను చేసిన పాపభారముతో నలిగినవాడై, పేతురు బయటకు వెళ్లిపోయి బహుగా ఏడ్చును.

ఇది ఎలా సంభవించగలదు? తన ఆత్మీయబలము విషయములో అంత నిశ్చయతగల పేతురు ఎట్లువరుసగా మూడుసార్లు తన యజమానుని నిరాకరించగలిగెను? నిస్సందేహముగా పరిస్థితులు పేతురును కలవరపెట్టెను. సత్యము వక్రీకరించ బడుచున్నది, యేసు దుష్టుడైన ఒక నేరస్థునిగా చిత్రీకరింపబడు చున్నాడు. సరియైనది తప్పుగా, నిర్దోషి దోషిగా చేయబడుచున్నాడు. కావున పరిస్థితుల వత్తిడివలన, పేతురు తన సమతూకమును కోల్పోవును. ఆకస్మికముగా అతని యథార్థతనుగూర్చిన ఆలోచన తల్లక్రిందులగును; తనకే దుఃఖము కలుగునట్లు ఆయన మనుష్యుల భయముచే అచేతనుడయ్యాడు. అది మనకెన్నటికిని సంభవించకుండును గాక! మత్తయి 26:57, 58, 69-75; మార్కు 14:30, 53, 54, 66-72; లూకా 22:54-62; యోహాను 18:15-18, 25-27.

పేతురు మరియు యోహానుకు ప్రధానయాజకుని గృహ ప్రాంగణములోనికి ప్రవేశము ఎట్లు లభించును?

పేతురు యోహానులు ప్రాంగణమందుండగా, ఆ గృహములో ఏమి జరుగును?

కోడి ఎన్నిమారులు కూయును, పేతురు ఎన్నిమారులు తాను యేసును ఎరుగననును?

పేతురు శపించుకొనుట ఒట్టుపెట్టుకొనుట అనగా దాని భావమేమి?

తాను యేసును ఎరిగియున్నానని పేతురు నిరాకరించుటకు ఏది కారణమగును?