కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థన మరియు వినయముల అవసరత

ప్రార్థన మరియు వినయముల అవసరత

అధ్యాయము 94

ప్రార్థన మరియు వినయముల అవసరత

అంతకుముందు యూదయలో ఉన్నప్పుడు, యేసు ప్రార్థన విషయములో పట్టుదల కలిగియుండు ప్రాముఖ్యతనుగూర్చి ఒక ఉపమానము చెప్పెను. ఇప్పుడు, యెరూషలేముకు చేయుచున్న చివరి పర్యటనలో, ఆయన మరలా విసుగక ప్రార్థనచేయు అవసరతను నొక్కితెల్పును. ఆయన తన శిష్యులకు మరొక (ఈ క్రింది) ఉపమానము చెప్పినప్పుడు యేసు ఇంకను సమరయ లేక గలిలయలో ఉండవచ్చును.

“దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయునుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికివచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.”

ఆ పిమ్మట యేసు తన కథయొక్క అన్వయింపును చెప్పుచు, ఇట్లనును: “అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పినమాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు.”

యెహోవా దేవుడు ఏ విధముగానైనను ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతివలె ఉన్నాడని యేసు అంతరార్థము కాదు. బదులుగా, అన్యాయస్థుడగు న్యాయాధిపతి సహితము విడువకచేయు విన్నపములకు ప్రత్యుత్తరమిచ్చుచుండగా, సమస్త విషయములలో నీతిమంతుడును, సత్పురుషుడును అయిన దేవుడు, తన ప్రజలు విసుకక ప్రార్థించినట్లయిన వారికి ప్రత్యుత్తరమిచ్చుననుటలో ఏ సందేహము లేదు.

దీనులు, దరిద్రులకు పలుమారులు అన్యాయము జరుగుతుంది. అయితే అధికారముగలవారు, ధనవంతులు తరచు అనుగ్రహము పొందుచున్నారు. అయితే దేవుడు, దుష్టులు న్యాయముగా శిక్షింపబడునట్లు చేయుటయేగాక నిత్యజీవము నిచ్చుటద్వారా తన సేవకులకు నిశ్చయముగా న్యాయము జరుగునట్లు చూచును. అయితే దేవుడు త్వరగా న్యాయము తీర్చునని ఎంతమంది స్థిరముగా నమ్ముచున్నారు?

ప్రార్థనాశక్తికి సంబంధమున్న విశ్వాసమును గూర్చి ప్రత్యేకముగా తెల్పుచు, యేసు ఇట్లడుగును: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” ఆ ప్రశ్నకు అప్పుడు జవాబు ఇవ్వబడకపోయినను, క్రీస్తు రాజ్యాధికారముతో వచ్చునప్పుడు విశ్వాసము సామాన్యమైయుండదని దాని భావమైయుండవచ్చును.

యేసు మాటలను వినుచున్న వారిలో కొందరు విశ్వాసము విషయంలో తాము స్వనీతిపరులనే భావన కల్గియున్నారు. తమంతటతామే నీతిమంతులమని నమ్ముచు, వారు ఇతరులను తృణీకరింతురు. అలాంటి గుంపులో యేసు శిష్యులలో కొందరుకూడ చేరియుండవచ్చును. కావున ఆయన అటువంటి వారినుద్దేశించి ఈ క్రింది ఉపమానమును చెప్పును:

“ప్రార్థనచేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.”

ఇతరులను మెప్పించుటకు పరిసయ్యులు బహిరంగముగా నీతిని కనబరచుదురను విషయము అందరికి తెలిసినదే. సాధారణముగా వారు, తాము స్వయంగా ఏర్పరచుకొనిన సోమ, గురు వారాలలో ఉపవాసముందురు, మరియు వారు పొలములోని చిన్నమొక్కలలో సహితము నియమబద్ధముగా పదియవ వంతు చెల్లింతురు. కొన్నినెలల క్రితము పర్ణశాలల పండుగ సమయములో, “ధర్మశాస్త్రమెరుగని [దానికి పరిసయ్యులిచ్చిన భావము] ఈ జనసమూహము శాపగ్రస్తమైనది” అని చెప్పినప్పుడు, సామాన్య ప్రజలయెడల వారికున్న దురభిప్రాయము వెల్లడయినది.

తన ఉపమానమును కొనసాగించుచు, యేసు అటువంటి “శాపగ్రస్తుడైన” వ్యక్తినిగూర్చి చెప్పును: “అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ముకొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.” సుంకరి, వినయముతో తన తప్పిదములను ఒప్పుకొనినందున, “అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” అని యేసు చెప్పును.

ఆ విధముగా యేసు మరలా వినయముగా ఉండు అవసరతను గూర్చి నొక్కితెల్పును. అధికారవ్యామోహములు ప్రబలమై, ఎంతో పలుకుబడితో స్వనీతిపరులైన పరిసయ్యులున్న సమాజములో పెరిగినందువలన, యేసు శిష్యులు సహితము అట్టి ప్రభావమునకు గురియగుదురనుట ఆశ్చర్యమేమీ కాదు. అయినను, వినయమునుగూర్చి యేసు ఎంత శ్రేష్ఠమైన పాఠములను బోధించును! లూకా 18:1-14; యోహాను 7:49.

అన్యాయస్థుడైన న్యాయాధిపతి విధవరాలి విన్నపమును ఎందుకు మన్నించును, మరియు యేసు చెప్పిన ఉపమానము ఏ పాఠమును నేర్పును?

ఆయన వచ్చినప్పుడు యేసు ఎట్టి విశ్వాసమును కనుగొనును?

పరిసయ్యుడు, సుంకరిని గూర్చిన ఉపమానమును యేసు ఎవరినుద్దేశించి చెప్పును?

పరిసయ్యుల ఏ దృక్పధమును విసర్జించవలెను?